రెచ్చిపోతున్న ‘పచ్చ’ ఖాకీలు | - | Sakshi
Sakshi News home page

రెచ్చిపోతున్న ‘పచ్చ’ ఖాకీలు

Nov 28 2026 1:56 AM | Updated on Nov 28 2026 1:56 AM

శావల్యాపురం, ఈపూరు ఎస్‌ఐల తీరుపై తీవ్ర విమర్శలు విధుల్లో చేరినప్పటి నుంచి టీడీపీ నేతలంటే విధేయత వైఎస్సార్‌ సీపీ శ్రేణులపై అక్రమ కేసులు నమోదు చేసి వేధింపులు

సాక్షి టాస్క్‌ఫోర్స్‌: స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో శావల్యాపురం ఎస్‌ఐ మోర్ల వెంకటేష్‌బాబు వ్యవహారశైలిపై మండలంలో తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఎంపీటీసీ నామినేషన్ల సమయంలో మండల వైఎస్సార్‌ సీపీ కన్వీనర్‌ బోదెపూడి వెంకటేశ్వర్లు, పార్టీ శ్రేణులపై ఇష్టానుసారంగా దూషణలకు దిగడం, నామినేషన్లు వేసే అభ్యర్థులను సైతం అడ్డుకుని ఎన్నికల ప్రక్రియ ఏకపక్షంగా జరిగేలా కీలకపాత్ర పోషించారన్న విమర్శలు ఉన్నాయి. మండలంలోని పోట్లూరు గ్రామం ఎంపీటీసీ అభ్యర్థి నామినేషన్‌ వేసే సమయంలో ముందస్తుగా జిల్లా కలెక్టర్‌ అనుమతులు తీసుకున్నప్పటికీ, కారులో వస్తున్న వారికి భద్రత కల్పించాల్సిన ఎస్‌ఐ అధికార టీడీపీ నేతలకు అండగా నిలిచారని ఆరోపిస్తున్నారు. కారు నడుపుతున్న వారు మద్యం మత్తులో అజాగ్రత్తగా డ్రైవింగ్‌ చేయడం వల్లే పెను ప్రమాదం తప్పిందని ఎస్‌ఐ సమర్థించుకోవడం గమనార్హం. కేవలం వైఎస్సార్‌ సీపీకి చెందిన వారిపైనే కేసులు బనాయించారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సెల్‌ఫోన్‌లో వీడియో తీశారని, వాటిని ఇస్తే ఆధారాలు దొరుకుతాయనే ఫోన్లు తీసుకున్నారని సమాచారం. కారులో లేనివారిపై కూడా కేసులు నమోదు చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. సర్పంచ్‌ ఎన్నికలలో కొత్తలూరు బరిలో ఉన్న అభ్యర్థిని, సానుభూతిపరులను సైతం స్టేషన్‌కు పిలిపించి, అసభ్య పదజాలంతో దూషిస్తూ గంటల తరబడి నిలబెట్టారని ఆరోపిస్తున్నారు. కొత్తలూరు గ్రామంలో ప్రచారం కూడా చేసుకోనీయలేదు. శావల్యాపురం సర్పంచ్‌ అభ్యర్థి జుజ్జూరి రామమూర్తిని సైతం పలుమార్లు స్టేషన్‌కు పిలిపించి తీవ్ర ఇబ్బందులకు గురిచేశారని తెలిపారు. ‘నేను మంత్రి అనగాని సత్యప్రసాద్‌ తాలూకా బంధువును.. నాకేంటి? నన్ను ఎవరూ ఏమీ చేయలేరు’ అంటూ బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నారని సమాచారం.

ఈపూరులోనూ అదే తీరు...

ఈపూరు మండలంలో వైఎస్సార్‌ సీపీ వారిని అణగదొక్కేందుకు చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని భయపెట్టడంలో ఎస్‌ఐ కె.వేణుగోపాల్‌ సిద్ధహస్తుడనే పేరొచ్చింది. పలు కేసుల్లో వైఎస్సార్‌ సీపీ వారిని నిందితులుగా చేర్చారు. ఎంపీటీసీ నామినేషన్‌ వేసేందుకు ఊడిజర్ల గ్రామం నుంచి భారీ సంఖ్యలో గ్రామస్తులు రాగా, వారిని తరిమివేశారు. ఇనుమెళ్ల గ్రామానికి చెందిన రామినీడి అనిల్‌పై టీడీపీ గూండాలు దాడులు చేయడంతో తీవ్రంగా గాయపడ్డారు. వైఎస్సార్‌ సీపీ బలపరిచిన సర్పంచ్‌ అభ్యర్థులను నామినేషన్లు వేయకుండా అడ్డుకోవడం ఒక ఎత్తయితే, నామినేషన్‌ వేసిన అభ్యర్థులను ఉపసంహరించుకోవాలని, రాజీ చేసుకోవాలని స్టేషన్‌కు పిలిపించి ఎస్‌ఐ బెదిరించారు. హత్యాయత్నం కేసులు తప్పవని హెచ్చరించారు. పాత కేసులు ఉన్నాయంటూ బెదిరించారు. ఆర్థిక వనరులపై దాడులు చేయించి భయభ్రాంతులకు గురిచేశారు. పోలింగ్‌కు ముందు రోజు అర్ధరాత్రి ఏజెంట్లను అదుపులోకి తీసుకొని స్టేషన్‌కు తరలించారు. బైండోవర్‌ పేరుతో తరచూ స్టేషన్‌ చుట్టూ తిప్పి ఇబ్బందులకు గురిచేశారు. కొండ్రముట్ల గ్రామంలో బయట వ్యక్తులు వచ్చారని, భయంగా ఉందని వైసీపీ నాయకులు ఫోన్‌ చేయగా, తానేమీ చేయలేనని బదులిచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement