ప్రజాస్వామ్యం ఖూనీ | - | Sakshi
Sakshi News home page

ప్రజాస్వామ్యం ఖూనీ

Nov 28 2026 1:56 AM | Updated on Nov 28 2026 1:56 AM

ప్రజాస్వామ్యం ఖూనీ ● అదే మండలంలోని కోళ్లపూడి గ్రామంలో వైఎస్సార్‌ సీపీకి చెందిన సర్పంచ్‌ అభ్యర్థి 55 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. టీడీపీ నేతల ఒత్తిడితో మూడుసార్లు రీకౌంటింగ్‌ నిర్వహించారు. ఎంత ప్రయత్నించినా రెండు ఓట్ల మెజార్టీతో వైఎస్సార్‌ సీపీ అభ్యర్థి గెలిచినప్పటికీ, మూడు గంటలపాటు డిక్లరేషన్‌ ఇవ్వకుండా నిలిపివేశారు. దీంతో వైఎస్సార్‌ సీపీ నాయకులు, కార్యకర్తలు కౌంటింగ్‌ కేంద్రం వద్ద ధర్నాకు దిగారు. మళ్లీ పోలీసులు రంగప్రవేశం చేసి లాఠీచార్జి చేశారు. ● పల్నాడు జిల్లా వినుకొండ నియోజకవర్గంలోని ఈపూరు మండలం కొండ్రముట్ల గ్రామంలో వైఎస్సార్‌ సీపీ అభ్యర్థి 133 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. విజయం ప్రకటించవద్దంటూ అధికార పార్టీ ఎమ్మెల్యే ఆదేశాలు ఇవ్వడంతో రీకౌంటింగ్‌ నిర్వహించిన అధికారులు బ్యాలెట్‌ పేపర్లు మార్చి టీడీపీ అభ్యర్థి గెలుపొందినట్లు ప్రకటించారు. పోలింగ్‌ ప్రారంభం నుంచే ఇతర ప్రాంతాల నుంచి టీడీపీ గుండాలు భారీ సంఖ్యలో మోహరించి రిగ్గింగ్‌కు ప్రయత్నించినప్పటికీ, వైఎస్సార్‌ సీపీ నేతలు, కార్యకర్తలు ప్రాణాలను ఫణంగా పెట్టి అడ్డుకున్నారు. ఇంత చేసినా ప్రజల తీర్పును మారుస్తూ ఎన్నికల అధికారులు బరితెగించి టీడీపీ అభ్యర్థి గెలిచినట్లు ప్రకటించారు. ● వినుకొండ నియోజకవర్గంలోని బొల్లాపల్లి మండలం గరికపాడులో వైఎస్సార్‌ సీపీ సర్పంచ్‌ అభ్యర్థి 200 ఓట్ల మెజార్టీతో విజయం సాధించినప్పటికీ, ఫలితాన్ని ప్రకటించకుండా నిలిపివేశారు. టీడీపీ గూండాలు కర్రలు, రాడ్లతో కౌంటింగ్‌ కేంద్రాన్ని చుట్టుముట్టారు. విద్యుత్‌ సరఫరా నిలిపివేసి అరాచకం సృష్టించారు. అధికారులు ఏకపక్షంగా రీపోలింగ్‌కు ఆదేశించడం దారుణమైన విషయం. గ్రామస్తులు ఎన్నికలను బహిష్కరించారు. శుక్రవారం ఎన్నికలు నిర్వహించారు. గ్రామంలో 1,731 ఓట్లు ఉండగా, ఎవరూ ఓటింగ్‌కు రాకపోవడంతో టీడీపీ నాయకులే 350 ఓట్లు పోలైనట్లు చూపించారు. అందులో టీడీపీ సర్పంచ్‌ అభ్యర్థి మొక్కపాటి మాధవి 329 ఓట్ల మెజార్టీతో గెలిచినట్లు అధికారులు ప్రకటించారు. వెల్లటూరులో సైతం వైఎస్సార్‌ సీపీ నాయకులు, కార్యకర్తలు ఎన్నికలను బహిష్కరించారు.

ప్రజల ఓట్లతో సంబంధం లేకుండా డిక్లరేషన్లు వైఎస్సార్‌ సీపీ అభ్యర్థులు గెలిచిన చోట టీడీపీ అభ్యర్థులకు అందజేత ఆందోళనకు దిగిన వైఎస్సార్‌ సీపీ నాయకులపై పోలీసుల లాఠీచార్జి

ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన అధికారులే టీడీపీ నేతల ఒత్తిళ్లకు తలొగ్గారు. వారు ఇచ్చే అవినీతి సొమ్ముకు ఆశపడి బరితెగిస్తున్నారు. ప్రజల ఓట్లతో గెలుపొందిన అభ్యర్థులకు డిక్లరేషన్‌ ఫామ్‌ ఇవ్వకుండా, టీడీపీ అభ్యర్థులు గెలిచినట్లుగా ఏకపక్షంగా ప్రకటించేస్తున్నారు. ఈ విషయం బయటపడితే ఉద్యోగం పోతుందనే భయం కూడా లేకుండా, అధికార పార్టీకి ఊడిగం చేస్తున్నారు.

సాక్షి ప్రతినిధి, గుంటూరు: ఒకపక్క అభ్యర్థులను నామినేషన్లు వేయనీయకుండా పోలీసులు అడ్డుకోవడం, బలవంతంగా విత్‌డ్రా చేయించడం, అది కుదరకపోతే పోలింగ్‌ రోజున ముఖ్య నాయకులతోపాటు అభ్యర్థులను సైతం అక్రమంగా నిర్బంధించడం వంటి చర్యలకు పాల్పడుతున్నారు. కౌంటింగ్‌ కేంద్రాల వద్ద అధికార పార్టీ గుండాలు కర్రలు, రాడ్లతో తిరుగుతున్నా చూసీచూడనట్లు వదిలేయడం వంటి అరాచకాలకు దిగుతున్నారు. మరోవైపు ఎన్నికల కమిషన్‌ ఆదేశాలు పాటించాల్సిన అధికారులు, కూటమి ఎమ్మెల్యేలు చెప్పేవాటినే నిబంధనలుగా భావిస్తున్నారు. నామినేషన్ల తిరస్కరణలోనూ దిగజారి ప్రవర్తిస్తున్నారు. గురజాల నియోజకవర్గంలో హైకోర్టు అనుమతి తెచ్చుకుని, పోలీసు భద్రత నడుమ వైఎస్సార్‌సీపీ మద్దతుదారులు 35 మంది సర్పంచ్‌ అభ్యర్థులుగా నామినేషన్లు దాఖలు చేశారు. అయితే, ఎన్నికల అధికారులు వారి నామినేషన్లను తిరస్కరించారు.

దారుణాలకు ఇవిగో నిదర్శనాలు

బాపట్ల జిల్లా పర్చూరు నియోజకవర్గంలోని మార్టూరు మండల కేంద్రంలో వైఎస్సార్‌ సీపీ సర్పంచ్‌ అభ్యర్థి 200కు పైగా ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. అయితే, ఎన్నికల అధికారులు టీడీపీ ఎమ్మెల్యే ఒత్తిడితో బరితెగించి, టీడీపీ అభ్యర్థి 75 ఓట్ల మెజార్టీతో గెలుపొందినట్లు ప్రకటించి డిక్లరేషన్‌ ఇచ్చేశారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ వైఎస్సార్‌ సీపీ అభ్యర్థితోపాటు నాయకులు, కార్యకర్తలు వేలాది మంది జాతీయ రహదారిపై బైఠాయించి సుమారు మూడు గంటలపాటు ఆందోళనకు దిగారు. దీనిపై చర్యలు తీసుకోవాల్సిన కలెక్టర్‌ సైతం పట్టించుకోకపోగా, పోలీసులు లాఠీచార్జి చేసి వైఎస్సార్‌ సీపీ నాయకులు, కార్యకర్తలను చెదరగొట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement