సత్తెనపల్లి ఆర్డీఓ కార్యాలయం చుట్టూ అల్లరి మూకలు హల్‌చల్ వైఎస్సార్ సీపీ మద్దతుదారులు రాకుండా అడ్డుకున్న టీడీపీ గూండాలు రుద్రవరం టీడీపీ రెబల్ అభ్యర్థి నామినేషన్ పత్రాలు లాక్కెళ్లిన దుండగులు కోర్టు ఆదేశాలు ఉన్నా నామినేషన్ల దాఖలుకు ఆటంకాలు
నామినేషన్ పత్రాలు లాగేశారు
దారుణ పరిస్థితులు సృష్టిస్తున్నారు
కొనసాగిన పచ్చమూకల దౌర్జన్యకాండ
సత్తెనపల్లి: పెదకూరపాడు నియోజకవర్గంలో ప్రాదే శిక ఎన్నికల్లో సాగించిన అరాచకాలనే పచ్చ మూకలు రెండో విడత పంచాయతీ ఎన్నికల్లోనూ నిస్సిగ్గుగా కొనసాగించారు. రాజకీయ పార్టీలకు అతీతంగా పార్టీ గుర్తుల్లేని పంచాయతీ ఎన్నికల్లో సైతం వైఎస్సార్ సీపీ మద్దతు దారులను టార్గెట్ చేసుకొని దౌర్జన్యాలకు తెగబడ్డారు. తొలిరోజు బుధవారం ఎక్కడికక్కడ నామినేషన్లు వేయనివ్వకుండా అడ్డుకోవడంతో చివరకు కోర్టును ఆశ్రయించిన అభ్యర్థులు కోర్టు ఆదేశాల మేరకు సత్తెనపల్లి రెవెన్యూ డివిజన్ కార్యాలయంలో నామినేషన్లు వేసేందుకు రాగా సత్తెనపల్లిలో కూడా పెదకూరపాడు టీడీపీ గూండాలు అడ్డుకున్నారు. పెదకూరపాడు పల్లె రాజకీయ నేపథ్యంలో పట్టణంలో అరాచకం కొనసాగింది. పట్టణంలోని రెవెన్యూ డివిజనల్ అధికారి కార్యాలయం చుట్టూ గురువారం పచ్చమూకలు హల్‌చల్ చేశారు. వైఎస్సార్ సీపీ మద్దతుదారులను నామినేషన్ వేసేందుకు రానివ్వకుండా ఎక్కడికక్కడ అడ్డుకున్నారు.
నామినేషన్ పత్రాలు లాక్కొని గూండాయిజం
అచ్చంపేట మండలం రుద్రవరం గ్రామానికి చెందిన టీడీపీ రెబలైన బీజేపీ మద్దతుదారుడు చల్లా నాగేశ్వరరావు సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసేందుకు రాగా అతని చేతుల్లోని నామినేషన్ పత్రాలను గుర్తు తెలియని దుండగులు లాక్కొని పరారయ్యారు. అలాగే వైఎస్సార్ సీపీ మద్దతుదారులు నామినేషన్ దాఖలు చేసేందుకు ఎంత ప్రయత్నం చేసినప్పటికీ టీడీపీ అల్లరి మూకలు అడ్డుకున్నారు. పోలీసులు, ఎన్నికల అధికారులు సైతం వారికి రక్షణగా నిలవకపోవడంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో వైఎస్సార్ సీపీ సత్తెనపల్లి నియోజకవర్గ కార్యాలయానికి చేరుకొని అక్కడ వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. ఓటమిపాలవుతామనే భయం తోనే వైఎస్సార్ సీపీ మద్దతుదారులను అడ్డుకుంటున్నారనే విషయం తేటతెల్లమవుతోంది. బెల్లంకొండ మండలం మాచాయపాలెం గ్రామానికి చెందిన ఇరువురు మహిళలు సత్తెనపల్లి ఆర్డీఓ కార్యాలయానికి చేరుకొని అక్కడ బందోబస్తులో ఉన్న సీఐ బ్రహ్మయ్యతో మాకు నామినేషన్ వేసే అవకాశం లేదని, మీరే మాకు దిక్కు అన్నప్పటికీ లోపలికి అనుమతించలేదు. పైగావారి వేదనను కవర్ చేస్తున్న ‘సాక్షి’ మీడియా ప్రతినిఽధిని కూడా వీడియో ఆపివేయమని బిగ్గరగా ఆదేశించారు.
వైఎస్సార్ సీపీ మద్దతుదారులపై దౌర్జన్యం
బెల్లంకొండ: ప్రభుత్వం మాది.. మీరు నామినేషన్ వేయడానికి వెళ్లేదంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులపై టీడీపీ నాయకులు దౌర్జన్యానికి దిగారు. గురువారం బెల్లండొండ మండలంలోని వెంకటాయపాలెం గ్రామానికి చెందిన వైఎస్సార్ సీపీ మద్దతుదారులు నామినేషన్ వేయడానికి సిద్ధమయ్యారు. సర్పంచ్ అభ్యర్థి కారుమూరి తిరుపతిరావుతో కలిసి నామినేషన్ కేంద్రమైన మన్నె సుల్తాన్‌పాలెం గ్రామానికి బయలుదేరారు. ఈ క్రమంలో నామినేషన్ కేంద్రం వద్ద ఉన్న టీడీపీ నాయకులు, రౌడీ మూకలు మన్నెసుల్తాన్ పాలెం పోలిమేర వద్దకు వచ్చి వైఎస్సార్ సీపీ మద్దతుదారులను అడ్డగించారు. నామినేషన్ వేయడానికి వీలు లేదంటూ దౌర్జన్యానికి దిగారు. దీంతో నామినేషన్ వేయకుండానే వైఎస్సార్ సీపీ మద్దతుదారులు వెనుతిరగాల్సి వచ్చింది.
నేను అచ్చంపేట మండలం రుద్రవరం గ్రామ సర్పంచ్‌గా నామినేషన్ దాఖలు చేసేందుకు సత్తెనపల్లి వచ్చా. ఆర్డీఓ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేసేందుకు వెళ్లుతుండగా అల్లరి మూకలు ఏడుగురు కలిసి నాచేతిలోని నామినేషన్ పత్రాలను లాక్కొని వెళ్లారు. ఆ పత్రాలతో పాటు విలువైన కాగితాలు కూడా ఉన్నాయి. నేను ఎవరికి చెప్పుకోవాలో కూడా తెలియడం లేదు.
– చల్లా నాగేశ్వరరావు, సర్పంచ్ అభ్యర్థి, రుద్రవరం
నేను క్రోసూరు మండలం దొడ్లేరు గ్రామపంచాయతీ సర్పంచ్‌గా పోటీ చేసేందుకు నామినేషన్ దాఖలు చేయకుండా అధికార పార్టీ ఆటంకాలు కలిగిస్తున్నారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి దారుణ పరిస్థితులు కల్పించడం మంచి పద్ధతి కాదు. ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కల్పించకపోవడం, భయభ్రాంతులకు గురి చేయడం మంచి సాంప్రదాయం కాదు.
–ఓర్సు గోవిందమ్మ, సర్పంచ్ అభ్యర్థి, దొడ్లేరు


