జిల్లాలో మూడో విడత పంచాయతీల వివరాలు...
12 మండలాల్లో పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్
189 పంచాయతీలు, 2,012 వార్డులకు ఎన్నికలు
రేపటి నుంచి నామినేషన్ల స్వీకరణ
డిసెంబర్ 2వ తేదీన పోలింగ్, మధ్యాహ్నం నుంచి ఫలితాలు
ఎన్నికల షెడ్యూల్ ముఖ్యాంశాలు...
సత్తెనపల్లి: జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా మూడో విడత గ్రామపంచాయతీ ఎన్నికల సమరానికి తెరలేచింది. మూడో విడత పంచాయతీ ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల సంఘం గురువారం నోటిఫికేషన్ విడుదల చేసింది. జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ కృతికాశుక్లా నేతృత్వంలో జిల్లా పంచాయతీ అధికారి ఆధ్వర్యంలో ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లాలోని నరసరావుపేట, గురజాల రెండు రెవెన్యూ డివిజన్ల పరిధిలో మొత్తం 12 మండలాల్లో ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల యంత్రాంగం సిద్ధమైంది. గురజాల రెవెన్యూ డివిజన్ పరిధిలో 9 మండలాలు, నరసరావుపేట రెవెన్యూ డివిజన్ పరిధిలో మూడు మండలాల్లో ఎన్నికల ప్రక్రియ కొనసాగనుంది.
12 మండలాలు, 189 పంచాయతీలు...
జిల్లాలో మూడో విడతలో దాచేపల్లి, దుర్గి, గురజాల, కారంపూడి, మాచవరం, మాచర్ల, పిడుగురాళ్ల, రెంటచింతల, వెల్దుర్తి, చిలకలూరిపేట, యడ్లపాడు, నాదెండ్ల మండలాల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈ 12 మండలాల పరిధిలో మొత్తం 189 గ్రామ పంచాయతీ సర్పంచి, 2,012 వార్డు సభ్యుల స్థానాలకు ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు చేశారు. 12 మండలాల పరిధిలో 49 క్లస్టర్ కేంద్రాల్లో నామినేషన్ల స్వీకరణకు క్లస్టర్లకు స్టేజ్–1 రిటర్నింగ్, సహాయ రిటర్నింగ్ అధికారులను నియమించారు. వీరు ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5.00 గంటల వరకు క్లస్టర్ కేంద్రాల్లో అందుబాటులో ఉండి నామినేషన్లు స్వీకరించనున్నారు.
నామినేషన్ రుసుం వివరాలు....
–సర్పంచి స్థానానికి: జనరల్ కేటగిరీకి రూ.3 వేలు, ఎస్సీ, ఎస్టీ బీసీలు రూ.1,500
–వార్డు సభ్యుడి స్థానానికి: జనరల్ కేటగిరికి రూ.1000, ఎస్సీ, ఎస్టీ, బీసీలు రూ.500 –ఈ డిపాజిట్ మొత్తాన్ని నామినేషన్ కేంద్రాల వద్ద ఏర్పాటు చేసిన కౌంటర్లలోనే చెల్లించాలి.
పల్లెల్లో మొదలైన రాజకీయ వేడి..
మూడో విడత పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ అధికారికంగా విడుదల కావడంతో ఆశావాహుల్లో ఉత్సాహం నెలకొంది. సర్పంచి పదవులతో పాటు వార్డు స్థానాలను దక్కించుకునేందుకు అభ్యర్థులు వ్యూహాలకు పదును పెట్టే పనిలో నిమగ్నమయ్యారు. గ్రామాల్లో మద్దతు దారుల సమీకరణ, ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నాలు ఊపందుకోనున్నాయి. నామినేషన్ల ఘట్టంతో మొదలుకానున్న ఈ పల్లె పోరు .. డిసెంబర్ 2న ఓటర్ల తీర్పుతో ముగియనుంది. మొత్తం 5,16,693 మంది ఓటర్లు ఉండగా .. వీరిలో పురుషులు 2,53,275 మంది, మహిళలు 2,63,364 మంది, ఇతరులు 54 మంది ఉన్నారు. వీరి కోసం ఎన్నికల నిర్వహణకు 5,340 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు.
మండలం పంచాయతీలు వార్డులు పోలింగ్కేంద్రాలు జనాభా
చిలకలూరిపేట 22 216 216 52,231
యడ్లపాడు 18 190 190 56,321
నాదెండ్ల 15 172 192 68,978
గురజాల 12 132 132 39,880
దాచేపల్లి 14 144 144 38,643
మాచవరం 15 162 162 51,046
పిడుగురాళ్ల 16 184 184 61,926
మాచర్ల 16 166 166 47,365
కారంపుడి 15 158 174 52,367
రెంటచింతల 11 132 150 49,827
వెల్దుర్తి 20 198 198 49,054
దుర్గి 15 158 158 49,059
మొత్తం 189 2,012 2,068 6,16,697
నామినేషన్ల స్వీకరణ:
నవంబర్ 21 నుంచి 23 వరకు
పరిశీలన (స్క్రూటినీ):
24(ఉదయం 8.00 గంటల నుంచి)
తిరస్కరణపై అప్పీల్: 25వ తేదీ
అప్పీళ్ల పరిష్కారం: ఈనెల 26
నామినేషన్ల ఉపసంహరణకు ఆఖరి గడువు: ఈనెల 27 (మధ్యాహ్నం 3:00 గంటల వరకు)
పోటీ చేయు అభ్యర్ధుల తుది జాబితా: 27
గుర్తుల కేటాయింపు: 27
పోలింగ్ తేదీ:
డిసెంబర్ 02 (ఉదయం 7:00 నుంచి మధ్యాహ్నం 1:00 వరకు)
ఓట్ల లెక్కింపు, ఫలితాలు:
డిసెంబర్ 2 మధ్యాహ్నం 2:00
గంటల నుంచి)
ఉపసర్పంచ్ ఎన్నిక:
ఫలితాలు ప్రకటించిన రోజే
రీపోలింగ్ (అవసరమైతే):
డిసెంబర్ 03 (ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 1:00 వరకు పోలింగ్, ఆరోజు మధ్యాహ్నం 2:00 గంటల నుంచి లెక్కింపు)


