రాజకీయ జోక్యమే శాపం!
టీడీపీ ప్రభుత్వం వచ్చాక నలుగురు మారిన వైనం రెండురోజుల క్రితం సూపరింటెండెంట్ పదవి వద్దంటూ డాక్టర్ సతీష్ లేఖ బాధ్యతలు చేపట్టేందుకు సీనియర్ వైద్యులు ససేమీరా మితిమీరిన రాజకీయ జోక్యంతోనే వద్దంటున్న వైద్యులు
నరసరావుపేట టౌన్ : పల్నాడు జిల్లాలోనే పెద్దాసుపత్రిగా పేరొందిన నరసరావుపేట ప్రాంతీయ ప్రభుత్వ వైద్యశాల సూపరింటెండెంట్ కుర్చీ ఇప్పుడు ముళ్లకిరీటంగా మారింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నలుగురు సూపరింటెండెంట్‌లు మారడం, తాజాగా సూపరింటెండెంట్ డాక్టర్ సతీష్ సైతం పదవి నుంచి తప్పుకొనేందుకు లేఖ రాయడం ఆసుపత్రి పరిపాలనా వ్యవస్థలో నెలకొన్న పరిస్థితులకు అద్దం పడుతోంది. సూపరింటెండెంట్‌గా డాక్టర్ సతీష్ సుమారు ఐదు నెలల క్రితం బాధ్యతలు చేపట్టారు. రెండు రోజుల క్రితం ఆయన తనకు సూపరింటెండెంట్ బాధ్యతలు వద్దంటూ ఉన్నతాధికారులకు లేఖ రాసినట్లు తెలిసింది. దీంతో ఆయన స్థానంలో ఎవరిని నియమించాలన్న అంశంపై అధికారులు తర్జనభర్జన పడుతున్నారు. సీనియార్టీ జాబితాలో ఉన్న వైద్యులను సంప్రదిస్తున్నా ఎవరూ ముందుకు రావడం లేదని సమాచారం. తమకు సూపరింటెండెంట్ బాధ్యతలు అప్పగించవద్దని కొందరు వైద్యులు లిఖితపూర్వకంగా తెలియజేసినట్లు వైద్యవర్గాల్లో ప్రచారం జరుగుతోంది. డీసీహెచ్‌ఎస్‌గా కొనసాగుతున్న డాక్టర్ ప్రసున్నను అదనపు బాధ్యతలు చేపట్టాలని కోరగా, ఇప్పటికే ఉన్న పనిభారం దృష్ట్యా ఆమె సుముఖత వ్యక్తం చేయలేదని తెలుస్తోంది. దీంతో సీనియర్ వైద్యులంతా విముఖత చూపుతుండటంతో అధికారులకు ఏం చేయాలో పాలుపోని పరిస్థితి నెలకొంది. గతంలోనూ ఇదే పరిస్థితి ఎదురుకావడంతో చిన్నపిల్లల వైద్య నిపుణుడైన డాక్టర్ సతీష్‌ను ఒప్పించి బాధ్యతలు అప్పగించారు. ఇప్పుడు ఆయన సైతం తప్పుకోవాలని నిర్ణయించుకోవడం ఆసుపత్రిలో నెలకొన్న పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది.
పెద్దాసుపత్రికి పెద్ద దిక్కేది..
పల్నాడు జిల్లాలో వేలాది మంది పేద, మధ్యతరగతి ప్రజలు వైద్యసేవల కోసం ఆధారపడే నరసరావుపేట ప్రాంతీయ వైద్యశాలలో సూపరింటెండెంట్ పోస్టుకే దిక్కులేని పరిస్థితి నెలకొనడం ఆందోళన కలిగిస్తోంది. ఆసుపత్రిలో సిబ్బంది కొరత, పరిపాలనా సమస్యలు, మౌలిక వసతుల లోపాలు వంటి సమస్యలను పరిష్కరించాల్సిన బాధ్యత సూపరింటెండెంట్‌పై ఉంటుంది. అలాంటి కీలక బాధ్యతలు చేపట్టేందుకు వైద్యులే వెనుకడుగు వేస్తుండటం వెనుక కారణాలపై ఉన్నతాధికారులు దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. వరుసగా సూపరింటెండెంట్‌లు మారుతున్నా పరిస్థితుల్లో మార్పు రాకపోవడం, చివరకు ఆ పదవిని చేపట్టేందుకు సీనియర్ వైద్యులు సైతం నిరాకరిస్తుండటంతో ఆసుపత్రి పాలన గాడి తప్పుతోందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించాల్సిన ప్రభుత్వ ఆసుపత్రిలోనే అధికార బాధ్యతలు చేపట్టేందుకు వైద్యులు భయపడే పరిస్థితి ఎందుకు ఏర్పడిందన్న ప్రశ్నకు ప్రభుత్వం, వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులే సమాధానం చెప్పాలి.
టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆసుపత్రి సూపరింటెండెంట్‌ల మార్పుల పరంపర కొనసాగుతోంది. గతంలో ప్రభుత్వ వైద్యశాల ప్రాంగణంలో అనుమతులు లేకుండా మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు విగ్రహాన్ని ఏర్పాటు చేయడం వివాదానికి దారితీసింది. ఈ వ్యవహారాన్ని వ్యతిరేకించిన అప్పటి సూపరింటెండెంట్ డాక్టర్ మంత్రునాయక్‌పై అధికార పార్టీ నాయకుల నుంచి ఒత్తిళ్లు, వేధింపులు ఎదురయ్యాయన్న ఆరోపణలు వినిపించాయి. ఈ నేపథ్యంలో ఆయన పదవిని వదిలి ఇతర జిల్లాకు బదిలీపై వెళ్లారు. అనంతరం డాక్టర్ రంగారావు బాధ్యతలు చేపట్టినా రాజకీయ ఒత్తిళ్ల నేపథ్యంలో నాలుగు నెలలకే తప్పుకొన్నట్లు సమాచారం. ఆ తర్వాత ఏడాదిన్నర క్రితం డాక్టర్ సురేష్‌కుమార్‌కు బాధ్యతలు అప్పగించారు. ఆసుపత్రిలో పేరుకుపోయిన సమస్యలను పరిష్కరించేందుకు ఆయన చేసిన ప్రయత్నాలకు అనేక అవరోధాలు ఎదురైనట్లు తెలుస్తోంది. ప్రతి అంశంలో రాజకీయ జోక్యం, మరోవైపు ఉన్నతాధికారుల నుంచి ఒత్తిళ్లు ఎదురవడంతో ఆయన సైతం పదవికి రాజీనామా లేఖ సమర్పించారు. ఆయన స్థానంలో బాధ్యతలు చేపట్టిన డాక్టర్ సతీష్ కూడా ఇప్పుడు అదే బాట పట్టడం చర్చనీయాంశంగా మారింది.


