పెదకాకాని: విద్యార్థులు సంగీత పోటీల్లోనూ రాణించాలని ఏఎన్‌యూ ఇన్‌చార్జి వీసీ ఆచార్య కె గంగాధరరావు అన్నారు. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో గురువారం సంగీత పోటీలు నిర్వహించారు. ఏఎన్‌యూ, ఆకాశవాణి విజయవాడ వారి సౌజన్యంతో 30 సంవత్సరాలలోపు విద్యార్థులకు నిర్వహించిన సంగీత పోటీల్లో పలువురు విద్యార్థులు ప్రతిభ కనబర్చారు. సంగీత విభాగం అధిపతి డాక్టర్ మంజుల ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి న్యాయనిర్ణేతలుగా ఆలిండియా రేడియో కార్యక్రమ నిర్వహణాధికారి నన్నం మధు, ఎం వెంకటరమణ, ఎస్‌ఎల్‌ఎన్ రాజు విచ్చేశారు. వర్సిటీ వీసీ ఆచార్య కె గంగాధరరావు సంగీత పోటీలకు న్యాయనిర్ణేతలుగా విచ్చేసిన ఆకాశవాణి విజయవాడ నిలయ విద్వాంసులు మల్లాది శ్రీరామ ప్రసాద్, కొమ్మజోస్యుల సద్గురు చరణ్, విష్ణుబొట్ల సరస్వతిలను సత్కరించారు. కార్యక్రమానికి ప్రిన్సిపల్ త్రిమూర్తిరావు అధ్యక్షత వహించారు.
గుంటూరు రూరల్: గుంటూరు నగర శివారులోని లాంఫాం వ్యవసాయ పరిశోధన స్థానంలో ఉన్న ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయాన్ని ఆమెరికా రాయబార కార్యాలయం సీనియర్ వ్యవసాయ నిపుణులు గురువారం సందర్శించారు. న్యూఢిల్లీలోని అమెరికా రాయబార కార్యాలయం, వ్యవసాయ వ్యవహారాల కార్యాలయం (యు.ఎస్.డి.ఏ.) సీనియర్ వ్యవసాయ నిపుణులు డాక్టర్ సంతోష్‌కుమార్‌సింగ్ విశ్వవిద్యాలయాన్ని సందర్శించి 2026–27 పంటల ఉత్పత్తి అంచనాలు, ఎల్‌నినో ప్రభావంపై విశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టర్ పీవీ సత్యనారాయణతో చర్చించారు. డాక్టర్ సంతోష్ కుమార్‌సింగ్ విశ్వవిద్యాలయ ఉపకులపతి, ఇతర ఉన్నతాధికారులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. సమావేశంలో 2026–27 పంటల ఉత్పత్తి అంచనాలు, రాష్ట్రంలో 2026–27 వ్యవసాయ సంవత్సరానికి సంబంధించి వరి, మొక్కజొన్న, ఇతర తృణధాన్యాల ఉత్పత్తి అంచనాలపై సమగ్రంగా చర్చించారు. సమావేశం అనంతరం ఆయన క్షేత్రస్థాయిలో పర్యటించి, స్థానిక రైతులతో ముఖాముఖి నిర్వహించి, పంటల పరిస్థితిని స్వయంగా పరిశీలించారు. కార్యక్రమంలో విశ్వవిద్యాలయం అధికారులు తదితరులు పాల్గొన్నారు.
ఆర్జేడీ బి.లింగేశ్వరరెడ్డి
అమరావతి: మునగోడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను గురువారం ప్రాంతీయ పాఠశాల విద్యా సంచాలకుడు బి లింగేశ్వరరెడ్డి ఆకస్మిక తనిఖీ చేశారు. తనిఖీలో భాగంగా ఆయన పదవ తరగతి విద్యార్థుల విద్యా ప్రమాణాలు, మిషన్ మార్చ్–2027కు సంబంధించిన ప్రగతి వివరాలు అడిగి తెలుసుకున్నారు. మధ్యాహ్న భోజనం నాణ్యతను పరిశీలించి తగు సలహాలు, సూచనలు చేశారు. అనంతరం పాఠశాల ఉపాధ్యాయులతో సమావేశమై ఐఈడీ కోర్స్, ప్రసస్థ్ స్క్రీనింగ్, ఏఐ సమర్థ్ కోర్స్‌లో రిజిస్ట్రేషన్ గురించి వాకబు చేశారు. గత సంవత్సరం 10వ తరగతి ఫలితాలు, ప్రస్తుతం 10వ తరగతి పిల్లల ప్రగతి గురించి చర్చించి గతేడాది కంటే మెరుగైన ఫలితాలు వచ్చేలా పనిచేయాలని ఆదేశించారు.
గుంటూరు వెస్ట్ (క్రీడలు): గుంటూరు జిల్లా చెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఓపెన్ అండ్ కిడ్స్ చదరంగ పోటీలు నిర్వహిస్తామని పోటీల నిర్వాహకుడు పి.విజయ్‌కుమార్ తెలిపారు. గురువారం స్థానిక శ్యామలానగర్‌లోని మాంటిస్సోరి ఇంగ్లిష్ మీడియం స్కూల్‌లో నిర్వ హించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఈనెల 22న మాంటిస్సోరి స్కూల్లో పోటీలు నిర్వహిస్తామన్నారు. పోటీలకు సంబంధించిన బ్రోచర్‌ను జిల్లా చెస్ అసోసియేషన్ అధ్యక్షుడు సిహెచ్ రవీంద్రరాజు, మాంటిస్సోరి స్కూల్ డైరెక్టర్ కె.వి.సెబాస్టియన్ ఆవిష్కరించారు.


