రెండున్నరేళ్లలో ఒక్క ఆలయ కమిటీ చైర్మన్, మెంబర్లుగా అవకాశం ఇవ్వలేదు వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో టీటీడీ మెంబర్లుగా నలుగురికి అవకాశం చైర్‌పర్సన్, అన్ని వార్డులు గెలుస్తాం విలేకర్ల సమావేశంలో డాక్టర్ గోపిరెడ్డి
నరసరావుపేట: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆర్యవైశ్యులను నిలువునా మోసం చేస్తున్నాడని, ఆవిషయాన్ని ఆర్యవైశ్య సంఘీయులు తెలుసుకోవాలని వైఎస్సార్ సీపీ జిల్లా కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి కోరారు. పార్టీ నియోజకవర్గ కార్యాలయంలో గురువారం పార్టీ చైర్‌పర్సన్ అభ్యర్థి షేక్ ఖాజావలి మాస్టారుతో కలిసి నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆర్యవైశ్యులకు తాము పార్టీ తరఫున న్యాయం చేస్తామన్నారు. తమ ప్రభుత్వం రాగానే 2029లో సముచిత స్థానం కల్పిస్తామన్నారు. నిడమానూరి సురేంద్రకు తమ ప్రభుత్వంలో మంచి స్థానం, పదవి ఇచ్చి గౌరవిస్తామని తెలిపారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆర్యవైశ్యులకు విశేషమైన ప్రాధాన్యం ఇచ్చారన్నారు. టీటీడీ బోర్డుకు రెండు విడతలుగా నలుగురికి మెంబర్లుగా అవకాశం ఇచ్చారన్నారు. అనేకమందికి చైర్మన్లుగా అవకాశం కల్పించామన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చి రెండేళ్లవుతున్నా ఏ ఒక్క ఆర్యవైశ్యునికి మెంబర్‌గా అవకాశం ఇవ్వలేదన్నారు. రాష్ట్రంలోని మేజర్ దేవాలయాలైన సింహాచలం, అన్నవరం, శ్రీశైలం, కనకదుర్గమ్మ అమ్మవారి దేవాలయాలకు చైర్మన్లు, బోర్టు మెంబర్లుగా ఆర్యవైశ్యులకు అవకాశం ఇవ్వలేదన్నారు.చంద్రబాబు మాయమాటలు చెబుతారని, సూపర్ సిక్స్ లాగానే వారిని మోసం చేస్తున్నాడన్నారు. ఆర్యవైశ్యులు ఆలోచన చేయాలన్నారు.
పట్టణానికి టీడీపీ చేసిందేమీలేదు
పురపాలక సంఘానికి 40ఏళ్ల తర్వాత మైనార్టీ వర్గానికి చెందిన గౌరవప్రదమైన వ్యక్తి షేక్ ఖాజావలి మాస్టారుకు పోటీచేసేందుకు అవకాశం ఇచ్చామన్నారు. ఆయనను గెలిపించాలని అన్నివర్గాల వారిని కోరారు. ఈ రెండున్నరేళ్లలో పట్టణానికి కూటమి నాయకులు చేసిందేమిలేదని, ప్రజలకు ప్రభుత్వంపై నమ్మకం లేదన్నారు. చైర్‌పర్సన్, పోటీ చేస్తున్న అన్ని వార్డుల్లో తాము తప్పక గెలుస్తామన్నారు.


