నరసరావుపేట: డాక్టర్ ఎన్‌టీఆర్ వైద్యసేవ పథకంపై వచ్చిన 157 ఫిర్యాదుల పర్యవేక్షక కమిటీ చైర్మన్, జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా సమీక్షించారు. కలెక్టర్ కార్యాలయంలో డాక్టర్ ఎన్‌టీఆర్ వైద్యసేవపై డిసీప్లీనరీ కమిటీ సమావేశం బుధవారం నిర్వహించారు. వాటిలో లబ్ధిదారుల నుండి నగదు వసూలు, ఇతర ఆరోపణలకు సంబంధించిన తొమ్మిది ఫిర్యాదుల వివరాలను జిల్లా కో–ఆర్డినేటర్ డాక్టర్ జి.చంద్రశేఖర్ వివరించారు. వీటిలో ఒక ఫిర్యాదుపై సమగ్ర విచారణ నిర్వహించి, సంబంధిత ప్రొఫెసర్ల సహకారంతో వాస్తవాలను నిర్ధారించి, పూర్తి విచారణ నివేదికను సమర్పించాలని ఆదేశించారు. అదేవిధంగా లబ్ధిదారుల నుంచి నగదు వసూలు చేసిన ఆసుపత్రిపై విచారణ జరిపి, నిబంధనల మేరకు మూడుసార్లు జరిమానా విధించడం జరిగిందని చెప్పారు. లబ్ధిదారులకు నగదు రహిత వైద్యం అందేలా ఆసుపత్రుల యాజమాన్యాలు తగిన చర్యలు తీసుకోవాలని, ఎట్టి పరిస్థితుల్లోను వైద్యం కోసం వచ్చే వారి నుంచి ఎటువంటి నగదు వసూలు చేయరాదని హెచ్చరించారు. జిల్లా ప్రభుత్వాస్పత్రుల సమన్వయ అధికారి డాక్టర్ ఎం.ప్రసూన, డీఎంహెచ్‌ఓ డాక్టర్ చుక్కా రత్నమన్మోహన్, వైద్య సేవ సిబ్బంది పాల్గొన్నారు.


