పోలీసులు ఖాకీ చొక్కాలు కాకుండా పచ్చ చొక్కాలతో విధులు
క్రోసూరు ఎస్ఐ రవిబాబు, ప్రజలను తరిమి కొట్టడం, రెడ్లును లేకుండా చేస్తాడంటా
రాష్ట్రానికి పెట్టుబడులు పెట్టేవారు వచ్చే పరిస్థితి మచ్చుకై నా కనిపించటం లేదు
పెదకూరపాడు మాజీ ఎమ్మెల్యే నంబూరు శంకరరావు ధ్వజం
సత్తెనపల్లి: చంద్రబాబూ.. ఒక్కసారి చూసుకోయ్యా.. నువ్వు ఏమి చేస్తున్నావో .. ఆఖరికి రాజధాని ప్రాంతంలో కూడా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించలేక మీ ఎమ్మెల్యేలు రౌడీలు, గుండాలుగా దిగజారి నామినేషన్లు వేయనివ్వడం లేదనిని పెదకూరపాడు మాజీ ఎమ్మెల్యే నంబూరు శంకరరావు ధ్వజమెత్తారు. క్రోసూరు మండలం అనంతవరానికి చెందిన అన్నపురెడ్డి సీతారావమ్మపై ఎస్ఐ రవిబాబు దాడి చేయడంతో గాయపడి సత్తెనపల్లి ప్రభుత్వ ప్రాంతీయ వైద్యశాలలో ఆమె చికిత్స పొందుతుండగా బుధవారం పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ అసలు మీరు ఖాకీ డ్రస్ వేసుకున్నారా, పచ్చొక్కాలు వేసుకున్నారా అర్థం కావట్లేదని, పచ్చచొక్కాలోళ్ళు పాపం ఏమి అనటంలా వాస్తవంగా చెప్పాలంటే మీరే, ఈ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్లే ఈ రకంగా చేస్తున్నారని ఆరోపించారు. ఏం వచ్చింది మీకు? ఎవరు జీతాలు ఇస్తున్నారు మీకు? తెలుగుదేశం పార్టీ ఇస్తుందా మీకు జీతాలు? లేకపోతే వాళ్లు ఇచ్చే లంచాలు తీసుకుని మీరు ఈ పనులు చేస్తున్నారా? నేను ఎస్పీకి, డీఎస్పీకి చెప్పడం జరిగిందని, ప్రతి నామినేషన్ సెంటర్లో కూడా 200 మంది రౌడీల్ని, గుండాల్ని తీసుకొచ్చి పెట్టారని, వాళ్లని బయటికి పంపించండి నామినేషన్లు సక్రమంగా జరుగుతాయని మెసేజ్ పెట్టడం, సమాచారం ఇవ్వడం జరిగిందని చెప్పారు. వాళ్లని అట్లాగే ఉంచి, నామినేషన్లు వేసే వాళ్లని కొట్టడం అనేది ఎంత దుర్మార్గమో! మరి ప్రజాస్వామ్యంలో నామినేషన్లు వేయనివ్వరా.. ఆఖరికి కోర్టుకి వెళ్లి డైరెక్షన్ తెచ్చుకునే పరిస్థితి తీసుకొచ్చారన్నారు. పోలీసుల వల్ల ఆఖరికి ప్రజాస్వామ్యం కూడా చచ్చిపోయే పరిస్థితికి వచ్చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. కొన్ని వ్యవస్థలు పాడైపోతున్నాయని, మీరు వాళ్లకి అంటకాగుతున్నారు కాబట్టే వాళ్ల ఇష్టానుసారంగా చేస్తున్నారని వివరించారు. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు కూడా నామినేషన్ వేయనివ్వకుండా చేసి, ఏదో మేము ఏక గ్రీవం చేశామని సంకలుగుద్దు కుంటున్నారని ఎద్దేవా చేశారు. ప్రజాస్వామ్యంలో ఎన్నికలు జరిగి గెలిస్తే గెలిచిన కింద లెక్క, అంతేగానీ ఈ దౌర్జన్యాలు, నామినేషన్ వేయనివ్వకుండా, ఏదో మేము పెద్ద ఘనకార్యం చేసినట్లు భావిస్తున్నారని విమర్శించారు. ఏదైనా డెవలప్మెంట్ చేయండి, అంతేగానీ ఈ గుండాయిజం, రౌడీయిజాలు చేసి, నామినేషన్లు వేయనివ్వకుండా చేయడం పెద్ద గొప్పతనం అనుకుంటున్నారా.. సిగ్గు ఉండాలని కూటమి నాయకులను నిలదీశారు. ప్రభుత్వానికి సపోర్ట్ చేసే నాయకులకు కూడా నేను చెబుతున్నా.. ఇలాంటి దౌర్జన్యాలకు మీరు వత్తాసు పలకటం, ఓ వర్గం మీడియా వంత పాడటం దారుణమన్నారు. మేధావులు కూడా ఆలోచన చేయాలని కోరారు. పెదకూరపాడు, సత్తెనపల్లి ప్రాంతంలో ఎక్కడా కూడా గతంలో అరాచకాలు లేవని చెప్పారు.
క్రోసూరు ఎస్ఐ రవిబాబు తీరుపై ఆగ్రహం...
మా వాళ్లు నామినేషన్ వేయడానికి వెళ్లేందుకు రెడీ అయితే, వాళ్లని కొడతారా? అనంతవరం గ్రామంలో రెడ్లు అనేవాళ్లను మూడు రోజుల్లో లేకుండా చేస్తాను అని క్రోసూరు ఎస్ఐ రవిబాబు హెచ్చరించడంపై శంకరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంకా రెండు సంవత్సరాలు టైమ్ ఉంది.. ఈ రెండు సంవత్సరాల తర్వాత ఎవరు ఏం చేస్తారు? ఈ రకంగా మీరు గ్రామాల్లో కక్షలు, కార్పణ్యాలు జనాలకు నేర్పుతున్నారని మండిపడ్డారు. ప్రశాంతంగా వ్యవసాయం చేసుకునే కుటుంబాల్ని మీరు నాశనం చేసి పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం సత్తెనపల్లి డీఎస్పీ కార్యాలయానికి నంబూరి శంకరరావు, నాయకులు వెళ్లగా అక్కడ జిల్లా అడిషనల్ ఎస్పీ రోహిత్‌కుమార్ చౌదరి ఉండటంతో ఆయనకు ఫిర్యాదు చేసేందుకు ప్రయత్నించగా ఆయన విననట్లు ఏదైనా ఉంటే ఫిర్యాదు ఇవ్వండి చూస్తా అంటూ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. అనంతరం క్రోసూరు వెళ్లేందుకు శంకరరావు పయనం కాగా పోలీసులు హౌస్ అరెస్ట్ చేశామంటూ గుంటూరు తీసుకెళ్లారు. ఆయనతో పాటు వైఎస్సార్ సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి చెన్నప్పరెడ్డి వెంకటేశ్వరరెడ్డి, చింతారెడ్డి సాయిరెడ్డి ఉన్నారు.
పచ్చని పల్లెలో ఫ్యాక్షన్ చిచ్చు


