నామినేషన్‌ కేంద్రాల్లో భద్రత పెంచండి | - | Sakshi
Sakshi News home page

నామినేషన్‌ కేంద్రాల్లో భద్రత పెంచండి

Nov 19 2026 2:49 AM | Updated on Nov 19 2026 2:49 AM

నామినేషన్‌ కేంద్రాల్లో భద్రత పెంచండి

నరసరావుపేట: జిల్లాలో రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో నామినేషన్ల దాఖలుకు ఎలాంటి ఆటంకాలు, ఆంక్షలు ఎదురుకాకుండా ఎంపీడీఓలు, తహసీల్దార్లు, పోలీసు శాఖ అధికారులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ డాక్టర్‌ కృతికా శుక్లా ఆదేశించారు. అభ్యర్థులు స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా నామినేషన్లు దాఖలు చేసుకునేలా చర్యలు తీసుకోవాలన్నారు. బుధవారం కలెక్టరేట్‌ నుంచి టెలీ కాన్ఫరెన్స్‌ ద్వారా వారితో సమీక్షా సమావేశం నిర్వహించారు.

పటిష్ట భద్రత కల్పించాలి

నామినేషన్‌ కేంద్రాలన్నింటిలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడంతో పాటు పోలీసు బందోబస్తు కల్పించాలని ఆదేశించారు. అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. రోజూ నామినేషన్ల స్వీకరణ పూర్తయిన అనంతరం ఆ పత్రాలను ట్రంక్‌ బాక్సుల్లో భద్రపరచాలని సూచించారు. పరిస్థితులను అంచనా వేసి, అవసరాన్ని బట్టి బందోబస్తు మధ్య మండల కేంద్రానికి తరలించి భద్రపరచాలని తెలిపారు. రిటర్నింగ్‌ అధికారులకు సహాయకంగా సరిపడా సిబ్బందిని నియమించాలని ఎంపీడీఓలను ఆదేశించారు. నామినేషన్‌ పత్రాలను అదే రోజు ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేయాలన్నారు.

అప్రమత్తంగా వ్యవహరించాలి

నామినేషన్ల పరిశీలన ప్రక్రియను నిబంధనల ప్రకారం పారదర్శకంగా నిర్వహించాలని, ఎలాంటి అక్రమ ఉపసంహరణలకు అవకాశం లేకుండా రిటర్నింగ్‌ అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. తిరస్కరించిన నామినేషన్లపై వచ్చే అప్పీళ్లను పరిష్కరించేందుకు రెవెన్యూ డివిజనల్‌ అధికారులు అప్పీలేట్‌ అథారిటీలుగా వ్యవహరిస్తారని తెలిపారు.

ముగిసిన నామినేషన్ల పరిశీలన

నరసరావుపేట: ఫేజ్‌–1 నరసరావుపేట డివిజన్‌లోని బొల్లాపల్లి, ఈపూరు, నరసరావుపేట, నూజెండ్ల, రొంపిచర్ల, శావల్యాపురం, వినుకొండ మండలాల పరిధిలో నిర్వహిస్తున్న పంచాయతీ ఎన్నికల నామినేషన్లు పరిశీలన బుధవారం ముగిసింది. 173 పంచాయతీ సర్పంచ్‌ల పదవులకు 801మంది, 1712 వార్డు సభ్యుల పదవులకు 3657 నామినేషన్లు సక్రమంగా ఉన్నట్లు జిల్లా పంచాయతీ అధికారి నాగేశ్వరనాయక్‌ తెలిపారు.

రేగులమాణ్యంలో చోరీ

రెంటచింతల: మండల కేంద్రమైన రెంటచింతలలోని రేగులమాణ్యం కాలనీకి చెందిన పాశం గోపయ్య ఇంట్లో చోరీ ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాలు.. గోపయ్య ఈ నెల 16వ తేదీ వరంగల్‌ వెళ్లగా ఆయన భార్య సంజీవమ్మ ఆ కాలనీలోని పాఠశాలలో విద్యార్థులకు మధ్యాహ్నం భోజనం వంట చేయడానికి ఇంటి నుంచి ఉదయం 10 గంటల సమయంలో వెళ్లింది. తిరిగి మధ్యాహ్నం 1.30 గం. ఇంటికి వచ్చే సరికి ఇంటి తాళం ధ్వంసం చేసి ఇంట్లో ఉన్న బీరువా తాళం పగలగొట్టి అందులో దాచుకున్న రూ.40 వేల నగదుతో పాటు రూ.3.26 లక్షల విలువైన బంగారు ఆభరణాలు, రూ.42 వేలు విలువైన 20 తులాల రెండు జతలు వెండి పట్టీలు గుర్తుతెలియని వ్యక్తులు చోరీ చేసినట్లు గమనించింది. వెంటనే వరంగల్‌ వెళ్లిన భర్త గోపయ్యకు చోరీ విషయం తెలపగా ఆయన సోమవారం రాత్రి ఇంటికి వచ్చి మంగళవారం రాత్రి చోరీ జరిగిన విషయాన్ని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బుధవారం నరసరావుపేటకు చెందిన క్లూస్‌టీం ఆధారాలను సేకరించారు. గోపయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

కారు ఢీకొని వ్యక్తి మృతి

పిడుగురాళ్ల: కారు ఢీకొని వ్యక్తి మృతి చెందిన సంఘటన పిడుగురాళ్ల పట్టణంలోని బైపాస్‌ రోడ్డులో పంజాబీ దాబా సమీపంలో బుధవారం జరిగింది. సంఘటనకు సంబంధించి పట్టణ ఎస్‌ఐ శివనాగరాజు తెలిపిన వివరాల మేరకు.. బొల్లాపల్లి మండలం గుమ్మనండపాడు గ్రామానికి చెందిన పారా కోటేశ్వరరావు (59) తన కుమార్తెను పిడుగురాళ్లకు చెందిన వ్యక్తితో వివాహం చేశాడు. ఈ క్రమంలో అల్లుడుకు చెందిన పొలాన్ని సాగు చేస్తూ పిడుగురాళ్లలోనే నివసిస్తున్నారు. ఈ క్రమంలోనే కోటేశ్వరరావుతోపాటు అతని భార్యదేవి ద్విచక్ర వాహనంపై పొలానికి వెళ్తుండగా బైపాస్‌ రోడ్డులోని పంజాబీ దాబా వద్ద హైదరాబాద్‌ వైపు నుంచి యద్దనపూడి వెళుతున్న కారు ఢీకొనడంతో ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. హుటాహుటిన పట్టణంలోని ఓ ప్రైవేటు వైద్యశాలకు తరలించగా, కోటేశ్వరరావు చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుని భార్య దేవి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ శివనాగరాజు పేర్కొన్నారు.

ప్రకృతి ఉత్పత్తులకు ప్రీమియం ధరలు

కొరిటెపాడు(గుంటూరు): ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులకు పార్టిసిపేటరీ గ్యారంటీ సిస్టమ్‌(పీజీఎస్‌) ధ్రువీకరణతో గుర్తింపుతో పాటు మెరుగైన ధరలు, మార్కెటింగ్‌ అవకాశాలు లభిస్తాయని ఏపీ ఆర్గానిక్‌ ప్రొడక్ట్స్‌ సర్టిఫికేషన్‌ అథారిటీ(ఏపీఎస్‌ఓపీసీఏ) జోనల్‌ కో–ఆర్డినేటర్‌ మహిత తెలిపారు. ప్రకృతి వ్యవసాయ పీజీఎస్‌ ధ్రువీకరణ ప్రక్రియపై స్థానిక కృషి భవన్‌లో బుధవారం ప్రకృతి వ్యవసాయ క్షేత్ర స్థాయి సిబ్బందికి రెండు రోజుల శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో ఎస్‌పీఎంయూ ప్రాజెక్టు మేనేజర్‌ హర్ష, గుంటూరు డీపీఎంయూ ప్రతినిధి సుమ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement