మాజీ మంత్రి విడదల రజిని
చిలకలూరిపేట: గ్రామ పంచాయతీ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల విజయమే లక్ష్యంగా పోరాడుదామని మాజీ మంత్రి విడదల రజిని చెప్పారు. పట్టణంలోని మాజీ మంత్రి నివాస ప్రాంగణంలో పంచాయతీ ఎన్నికల సన్నాహక కార్యక్రమంలో భాగంగా పార్టీ ముఖ్య నాయకులతో బుధవారం సమావేశం నిర్వహించారు. రజిని మాట్లాడుతూ రానున్న పంచాయతీ ఎన్నికలను పార్టీ నాయకులు ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని సూచించారు. ఇటీవల జరిగిన మున్సిపల్, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల సందర్భంగా టీడీపీ అధికారాన్ని అడ్డుపెట్టుకుని నియోజకవర్గంలో అరాచక రాజకీయాలకు పాల్పడిందని విమర్శించారు. ఎంపీటీసీ ఎన్నికల సమయంలో నామినేషన్లు దాఖలు చేయడానికి వెళ్లిన వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను నామినేషన్ కేంద్రాల వద్ద టీడీపీకి చెందిన వారు అడ్డుకుని, నామినేషన్లు వేయకుండా ఆటంకాలు సృష్టించారని గుర్తు చేశారు. మున్సిపల్ ఎన్నికల సందర్భంగా పోలింగ్ బూత్‌ల వద్ద రౌడీ మూకలతో దాడులు చేయించి వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలపై భౌతిక దాడులకు పాల్పడుతూ వారిని భయభ్రాంతులకు గురిచేశారని, రిగ్గింగ్, దొంగ ఓట్లతో గెలిచిన విషయాన్ని గుర్తించి అప్రమత్తంగా మెలగాలన్నారు. అధికార పార్టీ పోలీసు యంత్రాంగాన్ని తమ రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకుంటూ ప్రతిపక్ష నాయకులు, కార్యకర్తలపై ఒత్తిళ్లు, బెదిరింపులకు పాల్పడిందని విమర్శించారు. ఎన్నికల్లో ప్రజల మద్దతుతో గెలవాల్సిన పార్టీ, అధికార బలాన్ని ఉపయోగించుకుని ప్రతిపక్షాన్ని అణచివేయాలని చూడటం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని అన్నారు. ఇలాంటి దాడులు, బెదిరింపులు, అడ్డంకుల ద్వారా నియోజకవర్గంలో ఒక చెడు రాజకీయ సంస్కృతికి తెరలేపారని ఆవేదన వ్యక్తం చేశారు. గత ఎన్నికల్లో ఎదురైన అనుభవాలను దృష్టిలో పెట్టుకుని రానున్న పంచాయతీ ఎన్నికల్లో పార్టీ శ్రేణులు మరింత అప్రమత్తంగా ఉండాలని, ఎలాంటి బెదిరింపులకు, ప్రలోభాలకు భయపడకుండా ఐక్యంగా మెలగాలని సూచించారు. ప్రజాబలమే వైఎస్సార్ సీపీకి అసలైన బలమని, ప్రజల విశ్వాసాన్ని చూరగొంటూ ప్రతి గ్రామంలో పార్టీ విజయానికి కృషి చేయాలని కోరారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి హయాంలో అమలైన సంక్షేమ పథకాలను, అభివృద్ధి గురించి ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని వెల్లడించారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రజలకు వివరించాలన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ చిలకలూరిపేట, నాదెండ్ల, యడ్లపాడు మండలాల అధ్యక్షులు దేవినేని శంకరావు, మంగు ఏడుకొండలు, వడ్డేపల్లి నరసింహరావు, పార్టీ జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు కందుల శ్రీకాంత్, నాయకులు గుంజి శ్రీనివాసరావు, రాచమంటి చింతారావు, సింగారెడ్డి కోటిరెడ్డి, మండలాల ముఖ్య నాయకులు పాల్గొన్నారు.


