డిసెంబర్‌ 23న ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ముసాయిదా ఓటర్ల జాబితా | - | Sakshi
Sakshi News home page

డిసెంబర్‌ 23న ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ముసాయిదా ఓటర్ల జాబితా

Nov 19 2026 2:49 AM | Updated on Nov 19 2026 2:49 AM

నరసరావుపేట: ఉమ్మడి గుంటూరు–కృష్ణా జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నియోజకవర్గ ఓటర్ల ముసాయిదా జాబితాను డిసెంబర్‌ 23వ తేదీన ప్రచురించనున్నట్లు జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ కృతికా శుక్లా వెల్లడించారు. బుధవారం ఎన్నికల కమిషన్‌ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్‌ పాల్గొన్నారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఓటర్ల నమోదు ప్రక్రియ, అందిన దరఖాస్తుల పరిశీలన, ఓటర్ల జాబితా ప్రచురణకు సంబంధించి నిర్ణీత గడువులోగా చేపట్టాల్సిన చర్యలు తెలిపారు. ఇప్పటివరకు అందిన 3,343 దరఖాస్తుల పరిశీలనను వేగవంతం చేస్తున్నట్లు తెలిపారు. ఫారమ్‌–19 ద్వారా ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఓటరు నమోదుకు దరఖాస్తుల స్వీకరణ గడువు నవంబర్‌ ఆరవ తేదీతో ముగిసిందని కలెక్టర్‌ తెలిపారు. ప్రస్తుతం అందిన దరఖాస్తుల పరిశీలన కొనసాగుతోందన్నారు. ఎన్నికల సంఘం నిర్దేశించిన షెడ్యూల్‌ ప్రకారం డిసెంబర్‌ 18వ తేదీ నాటికి ముసాయిదా ఓటర్ల జాబితా తయారీ, ముద్రణ ప్రక్రియ పూర్తి చేయాలని, డిసెంబర్‌ 23వ తేదీన ముసాయిదా జాబితాను ప్రచురించాలని సూచించారు. డిసెంబర్‌ 23 నుంచి వచ్చే ఏడాది జనవరి 12 వరకు కొత్త దరఖాస్తులు, క్లెయిములు, అభ్యంతరాలను స్వీకరించనున్నట్లు తెలిపారు. జనవరి 27వ తేదీ నాటికి వాటి పరిష్కారం, అనుబంధ జాబితాల ముద్రణ పూర్తి చేసి, ఫిబ్రవరి రెండవ తేదీన తుది ఓటర్ల జాబితాను ప్రచురించనున్నట్లు వివరించారు. ఇప్పటివరకు ఓటరుగా నమోదు చేసుకోలేకపోయిన అర్హులైన ఉపాధ్యాయులు డిసెంబర్‌ 23వ తేదీన ముసాయిదా జాబితా ప్రచురించిన అనంతరం జనవరి 12 అవసరమైన ఆధారాలతో నవీకరించిన ఫారమ్‌–19 ద్వారా దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్‌ విజ్ఞప్తి చేశారు. తప్పుడు ధ్రువీకరణ పత్రాలు సమర్పించడం ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్లు 31, 32 ప్రకారం శిక్షార్హమైన నేరమని హెచ్చరించారు. అర్హులైన ఉపాధ్యాయులందరూ నిర్ణీత గడువులోగా ఓటరుగా నమోదు చేసుకుని తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు.

ఎన్నికల కమిషన్‌కు తెలిపిన జిల్లా కలెక్టర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement