నరసరావుపేట ఈస్ట్: ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం అంతర్ కళాశాలల పురుషుల ఖోఖో విజేతగా కృష్ణవేణి డిగ్రీ కళాశాల నిలిచింది. రెండురోజులుగా కళాశాల క్రీడా మైదానంలో నిర్వహించిన పోటీలో కృష్ణవేణి కళాశాల జట్టు వాగ్దేవి డిగ్రీ కళాశాలపై విజయం సాధించి ప్రథమస్థానం కై వసం చేసుకోగా వాగ్దేవి జట్టు ద్వితీయ స్థానంతో సరిపెట్టుకుంది. విక్టరీ కళాశాల జట్టు తృతీయ స్థానం, వర్సిటీ ఇంజినీరింగ్ కళాశాల జట్టు నాల్గవ స్థానంలో నిలిచాయి. బుధవారం ఏర్పాటు చేసిన బహుమతి ప్రదానోత్సవ సభకు కళాశాల ప్రిన్సిపల్, వర్సిటీ పాలకమండలి సభ్యుడు నాతాని వెంకటేశ్వర్లు అధ్యక్షత వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన వర్సిటీ క్రీడా పరిశీలకుడు బి.సూర్యనారాయణ మాట్లాడుతూ క్రీడలు యువత భవిష్యత్‌ను తీర్చిదిద్దేందుకు దోహదపడతాయన్నారు. క్రీడలలో రాణించిన విద్యార్థులకు విద్య, ఉద్యోగ అవకాశాలలో రిజర్వేషన్ వర్తిస్తుందని వివరించారు. సెలక్షన్ కమిటీ సభ్యుడు పి.శివప్రసాద్ మాట్లాడుతూ యువత తమ కాలాన్ని సెల్‌ఫోన్, ఇంటర్నేట్ మోజులో పడి వృథా చేసుకోవద్దని హితవు పలికారు. విద్యతో పాటు క్రీడా, సాంస్కృతిక అంశాలలో రాణించాలని సూచించారు. కళాశాల డైరెక్టర్ కోమటినేని నాసరయ్య మాట్లాడుతూ, క్రీడాకారులు తమ ప్రతిభను జాతీయస్థాయిలో చాటాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో టోర్నమెంట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ ఈదర ఆదిబాబు, ధనలక్ష్మి వ్యాయామ కళాశాల ప్రిన్సిపల్ సీహెచ్ వెంకట్రావు, శంకరభారతీపురం జెడ్పీ హైస్కూల్ పీడీ పద్మావతి, కళాశాల వైస్ ప్రిన్సిపల్ ఎంఆర్‌కె సతీస్‌బాబు, అకడమిక్ డైరెక్టర్ డాక్టర్ యోగేశ్వరరావు, తిరుపతిరావు పాల్గొన్నారు.


