పురపోరులో ఏడు నామినేషన్లు తిరస్కరణ | - | Sakshi
Sakshi News home page

పురపోరులో ఏడు నామినేషన్లు తిరస్కరణ

Nov 18 2026 2:13 AM | Updated on Nov 18 2026 2:13 AM

పురపోరులో ఏడు నామినేషన్లు తిరస్కరణ

నరసరావుపేట: స్థానిక పురపాలక సంఘానికి నిర్వహిస్తున్న ఎన్నికల ప్రక్రియలో భాగంగా 48 వార్డులకు దాఖలైన నామినేషన్ల పరిశీలనలో ఏడు నామినేషన్లు తిరస్కరణకు గురైనట్లు అసిస్టెంట్‌ ఎన్నికల అధికారి, మున్సిపల్‌ కమిషనర్‌ బి. రమ్యకీర్తన వెల్లడించారు. వీటిలో రెండు చైర్‌పర్సన్‌ నామినేషన్లు కాగా, ఐదు కౌన్సిలర్‌ నామినేషన్లు ఉన్నాయని తెలిపారు. మంగళవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ, వార్డు అభ్యర్థులు దాఖలు చేసిన నామినేషన్లలో వైఎస్సార్‌ సీపీకి చెందిన 14, 24, 33వ వార్డులు, టీడీపీకి చెందిన 30, 37వ వార్డుల నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయని తెలిపారు. చైర్‌పర్సన్‌ పదవికి దాఖలైన నామినేషన్లలో ఇద్దరు స్వతంత్ర అభ్యర్థుల నామినేషన్లు తిరస్కరించినట్లు వెల్లడించారు. నామినేషన్ల పరిశీలన మున్సిపల్‌ కార్యాలయంలోని కేంద్రంలో పోలీసు బందోబస్తు మధ్య నిర్వహించారు. చైర్‌పర్సన్‌ పదవికి 21 మంది నామినేషన్లు దాఖలు చేయగా, పరిశీలనలో రెండు తిరస్కరణకు గురయ్యాయి. మిగిలిన 19 దరఖాస్తుల్లో వైఎస్సార్‌ సీపీకి చెందినవి 4, టీడీపీకి చెందినవి 3, కాంగ్రెస్‌కు చెందిన ఒకటి, బీఎస్‌పీకి చెందిన ఒకటి, స్వతంత్ర అభ్యర్థులవి 8, ఇతరులకు చెందినవి 2 సక్రమంగా ఉన్నట్లు తెలిపారు. కౌన్సిలర్‌ పదవులకు 337 నామినేషన్లను పరిశీలించగా, ఐదు తిరస్కరణకు గురయ్యాయి. మిగిలిన వాటిలో వైఎస్సార్‌ సీపీకి చెందినవి 86, టీడీపీకి చెందినవి 135, కాంగ్రెస్‌కు చెందినవి 8, సీపీఐకి చెందినవి 3, బీజేపీకి చెందినవి 7, బీఎస్‌పీకి చెందినవి 4, స్వతంత్ర అభ్యర్థులవి 52, ఇతరులకు చెందినవి 4 సక్రమంగా ఉన్నట్లు కమిషనర్‌ వెల్లడించారు.

నామినేషన్లు తిరస్కరణకు గురైన అభ్యర్థులు

వైఎస్సార్‌ సీపీకి చెందిన 14వ వార్డు అభ్యర్థి చింతా వెంకటవీరమ్మ, 24వ వార్డు అభ్యర్థి షేక్‌ కాలేషావలి, 33వ వార్డు అభ్యర్థి వేముల అంకమ్మరావు, టీడీపీకి చెందిన 30వ వార్డు అభ్యర్థి బోడపాటి వెంకటరమణమ్మ, 37వ వార్డు అభ్యర్థి చల్లా పెద్దిరాజు నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. చైర్‌పర్సన్‌ అభ్యర్థులైన కనకగిరి అనిరుధ్‌ ఫణిభార్గవ, కొలిశెట్టి గీతా చరణ్‌ల నామినేషన్లు కూడా తిరస్కరించినట్లు కమిషనర్‌ వెల్లడించారు. నామినేషన్లను ఈ నెల 18, 19 తేదీల్లో ఉపసంహరించుకోవచ్చని తెలిపారు. అధికారులకు ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఉపసంహరణ పత్రాలను సమర్పించవచ్చని పేర్కొన్నారు. అనంతరం పోటీలో ఉన్న తుది అభ్యర్థుల వివరాలను వెల్లడిస్తామని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement