ప్రజాస్వామ్యం ఖూనీ | - | Sakshi
Sakshi News home page

ప్రజాస్వామ్యం ఖూనీ

Nov 18 2026 2:13 AM | Updated on Nov 18 2026 2:13 AM

నామినేషన్ల చివరిరోజూ కొనసాగిన టీడీపీ దాడులు, దౌర్జన్యాలు ఇస్సపాలెంలో దుశ్శాసన పర్వం

చివరి రోజూ

అదే బరితెగింపు

ఇస్సపాలెంలో వైఎస్సార్‌ సీపీ అభ్యర్థులపై నామినేషన్‌ కేంద్రంలోనే దాడి

నామినేషన్‌ పత్రాలు చించివేత, మహిళా అభ్యర్థులకు గాయాలు

నామినేషన్‌కు అవకాశం కల్పించాలని రాస్తారోకోకు దిగిన అభ్యర్థులు

హైకోర్టు ఆదేశాలతో నాలుగు గ్రామాల సర్పంచ్‌ అభ్యర్థుల నామినేషన్లు

వార్డు సభ్యుల నామినేషన్లకు అనుమతించని పోలీసులు

నామినేషన్ల చివరిరోజూ కొనసాగిన టీడీపీ దాడులు, దౌర్జన్యాలు

నరసరావుపేట రూరల్‌: పంచాయతీ ఎన్నికల నామినేషన్‌ చివరి రోజు కూడా పచ్చమూకల దాడులు కొనసాగాయి. నామినేషన్‌ దాఖలు చేసేందుకు వెళ్లిన వైఎస్సార్‌ సీపీ బలపరిచిన అభ్యర్థుల నామినేషన్లు చించివేసారు. మహిళా అభ్యర్ధులపై సైతం దాడికి పాల్పడ్డారు. అభ్యర్థులకు రక్షణగా నిలవాల్సిన పోలీసులు టీడీపీ గూండాలకు అండగా నిలిచారు. మరో వైపు హైకోర్టు ఆదేశాలతో సర్పంచ్‌ అభ్యర్థులు పోలీసు ప్రత్యేక భద్రతతో నామినేషన్లు దాఖలు చేశారు.

హైకోర్టు ఆదేశాలతో నామినేషన్లు

గ్రామాల్లో తమకు నామినేషన్‌ వేసే అవకాశం లేకుండా భయభ్రాంతులకు గురిచేస్తున్నారంటూ పలు గ్రామాలకు చెందిన వారు హైకోర్టులో పిటిషన్‌ వేశారు. ఆయా గ్రామాల్లో సర్పంచ్‌ ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులకు రక్షణ కల్పించి నామినేషన్‌ వేయించాలని హైకోర్టు ఆదేశించింది. దీంతో నరసరావుపేట మండలంకు చెందిన పెద్దరెడ్డిపాలెం, ములకలూరు, పెద్దతురకపాలెం వైఎస్సార్‌ సీపీ బలపరిచిన సర్పంచ్‌ అభ్యర్థులు మండల పరిషత్‌ కార్యాలయంలో నామినేషన్లు దాఖలు చేశారు. ఆయా గ్రామాల వార్డు సభ్యులను పోలీసులు కార్యాలయాల్లోకే అనుమతించలేదు. సర్పంచ్‌ అభ్యర్థుల వరకే న్యాయస్థానం అనుమతించిందని పోలీసులు తెలిపారు. దీంతో మూడు గ్రామాల వార్డు అభ్యర్థులు నామినేషన్లు వేయలేకపోయారు.

దొండపాడులో నామినేషన్‌ పత్రాలు చించివేత

వినుకొండ: వినుకొండ మండలం దొండపాడు గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. నామినేషన్‌ వేసేందుకు వెళ్లిన వార్డు సభ్యుడి అభ్యర్థిపై ప్రత్యర్థి వర్గం దాడి చేసి, నామినేషన్‌ పత్రాలను చించివేయడంతో గ్రామంలో ఘర్షణ వాతావరణం నెలకొంది. దొండపాడు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో వార్డు సభ్యుడిగా పోటీ చేసేందుకు అభ్యర్థి కరవు కొండలు, తన ప్రతిపాదకుడు వీరాంజనేయులుతో కలిసి నామినేషన్‌ కేంద్రం వద్దకు వెళ్లారు. ఈ క్రమంలో టీడీపీ కార్యకర్తలు వారిని అడ్డుకుని దాడికి పాల్పడ్డారు. కరవు కొండలు చేతిలోని నామినేషన్‌ పత్రాలను బలవంతంగా లాక్కొని చించివేశారు.

గ్రామస్తులపైనా దాడి

నామినేషన్లను అడ్డుకోవడంపై స్థానిక గ్రామస్తులు నిలదీయడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. ఎండ్రపల్లి వెంకట్రావు ఆధ్వర్యంలో సుమారు 50 మంది గ్రామస్తులపై దాడికి దిగారు. దాడిలో సుబ్బారావు అనే కార్యకర్తకు గాయాల య్యాయి. సమాచారం అందుకున్న వినుకొండ ఎస్‌ఐ ఉదయలక్ష్మి ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.

నరసరావుపేట: రొంపిచర్ల మండలంలో నామినేషన్లకు చివరి రోజైన మంగళవారం కూడా వైఎస్సార్‌ సీపీ బలపరిచిన అభ్యర్థులను నామినేషన్‌ సెంటర్‌లకు రాకుండా టీడీపీ గూండాలు, పోలీసులు అడ్డుకున్నారు. అలవాల గ్రామస్తులు గోగులపాడులోని నామినేషన్‌ కేంద్రం వద్దకు చేరకోకముందే కొనకంచివారిపాలెం గ్రామ సమీపంలో నిలువరించారు. కొద్దిసేపు వాదనలు, సంప్రదింపులు జరిగిన తర్వాత ఆ గ్రామస్తులు చేసేదిలేక తిరిగి వెళ్లారు. అలాగే విప్పర్లపల్లి గ్రామస్తులు ముత్తనపల్లిలోని నామినేషన్‌ కేంద్రం వద్దకు చేరుకోగానే గ్రామం వెలుపలే కిరాయిగూండాలు అడ్డగించారు. ప్రభుత్వం మాది, అధికారం ఉన్నన్ని రోజులు మేమే సర్పంచ్‌లం, వచ్చినదారిన తిరిగి వెళ్లకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. అయితే ముందుగా నామినేషన్‌ కేంద్రంలోకి చేరిన ముగ్గురు వార్డు మెంబర్లు భయం భయంగా నామినేషన్లు వేశారు. చాకలికుంట గ్రామస్తులు మొదటిరోజు సర్పంచ్‌కు, నాలుగు వార్డు మెంబర్లకు నామినేషన్లు వేయగలిగారు. ఎడ్వర్డ్‌పేటలో ఒక సర్పంచ్‌, ఇద్దరు వార్డు మెంబరు అభ్యర్థులు మొదటి రోజు నామినేషన్‌ దాఖలు చేశారు. రెండవ రోజు టీడీపీ గూండాలు అడ్డగించారు. చివరి రోజు చాకలిగుంట తండా, ఎడ్వర్డ్‌పేట గ్రామానికి చెందిన వైఎస్సార్‌ సీపీ మద్దతుదారులు నామినేషన్లు వేసేందుకు వెళ్లగా అధికారపార్టీ నాయకులు, పోలీసులు నామినేషన్లు వేయటానికి వీలులేదని కేంద్రానికి దూరంగానే అడ్డగించి తిప్పి పంపారు. అయితే పరగటిచర్ల నామినేషన్‌ కేంద్రంలో కూడా చివరిరోజు మాచవరం గ్రామస్తులను అనుమతించలేదు.

కోర్టు ఉత్తర్వులతో నామినేషన్లు

రొంపిచర్ల మండలంలో రామిరెడ్డిపాలెం, కర్లకుంట గ్రామాలకు చెందిన సర్పంచ్‌ అభ్యర్థులు హైకోర్టు ఉత్తర్వులతో నరసరావుపేటలోని ఆర్డీఓ కార్యాలయంలో మంగళవారం సాయంత్రం నామినేషన్లు దాఖలు చేశారు. సంతగుడిపాడు గ్రామంలోని వైఎస్సార్‌ సీపీ మద్దతుదారులు కూడా ఆర్డీఓ ఆఫీసులో తమ నామినేషన్‌ పత్రాలను దాఖలు పరిచారు.

ఇస్సపాలెంలోని నామినేషన్‌ కేంద్రంలో మంగళవారం టీడీపీ గూండాలు, కిరాయి మూకలు రెచ్చిపోయారు. ఇస్సపాలెం సర్పంచ్‌ పదవికి వైఎస్సార్‌ సీపీ బలపరిచిన సర్పంచ్‌ అభ్యర్థి జల్లి సరోజినితో పాటు వార్డు సభ్యులు నామినేషన్‌ దాఖలు చేసేందుకు కేంద్రానికి వచ్చారు. కేంద్రం సమీపంలోనే పచ్చమూకలు వారిని అడ్డగించేందుకు ప్రయత్నించాయి. వారి నుంచి తప్పించుకుని సర్పంచ్‌ అభ్యర్థితో పాటు వార్డు అభ్యర్థులు నామినేషన్‌ కేంద్రంలోకి వెళ్లారు. అప్పటికే కేంద్రంలో తిష్టవేసిన కిరాయి మూకలతో పాటు టీడీపీ గూండాలు వీరిపై దాడికి పాల్పడ్డారు. అభ్యర్థుల వద్ద నుంచి బలవంతంగా నామినేషన్లు లాక్కుని చించివేశారు. ఈ ఘటనలో పలువురు మహిళా అభ్యర్థులకు గాయాలయ్యాయి. వీరి చీరెలు, జాకెట్లు చినిగిపోయాయి. రూరల్‌ ఎస్‌ఐ కిషోర్‌బాబు నామినేషన్‌ కేంద్రం వద్దే ఉన్నా దాడిని ఆపే ప్రయత్నం చేయలేదు. అనంతరం వైఎస్సార్‌ సీపీ శ్రేణులతో కలిసి అభ్యర్థులు మెయిన్‌రోడ్డుపై నిరసనకు దిగాయి. తమకు నామినేషన్‌ వేసే అవకాశం కల్పించాలని కోరారు. పోలీసులు అక్కడికి చేరుకుని బలవంతంగా పక్కకు పంపించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement