ఎన్నికలకు కపిలవాయి వర్గం దూరం! | - | Sakshi
Sakshi News home page

ఎన్నికలకు కపిలవాయి వర్గం దూరం!

Nov 18 2026 2:13 AM | Updated on Nov 18 2026 2:13 AM

ఎన్నికలకు కపిలవాయి వర్గం దూరం!

పార్టీ కోసం పనిచేసిన వారిని కాదని ఇష్టారాజ్యంగా సీట్ల కేటాయింపు రెబల్స్‌గా బరిలోకి దిగేందుకు సిద్ధమైన టీడీపీ నేతలు చైర్మన్‌ పదవి దక్కకపోవడంతో కపిలవాయి విజయకుమార్‌ వర్గం దూరం జనసేన అభ్యర్థుల్లోనూ గందరగోళం నేటికీ ఫైనల్‌ కాని కూటమి తుది అభ్యర్థుల జాబితా

నరసరావుపేట టౌన్‌: నరసరావుపేట పురపాలక సంఘానికి సుదీర్ఘ కాలం తర్వాత ఎన్నికలు జరుగుతుండటంతో ఈసారి రాజకీయ పార్టీల్లో పోటీ తీవ్రంగా నెలకొంది. మొత్తం 48 వార్డులకు కౌన్సిలర్లను ఎన్నుకోనున్నారు. అయితే కూటమి పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు, అభ్యర్థుల ఎంపిక వ్యవహారం నేటికి కొలిక్కి రాకపోవడం ఆ పార్టీలో కొత్త సమస్యలకు దారితీస్తోంది. తెలుగుదేశం పార్టీలోని పలు వార్డుల్లో ఇద్దరు, ముగ్గురు చొప్పున ఆశావహులు నామినేషన్లు దాఖలు చేశారు. మొత్తం 48 వార్డులకు 337 నామినేషన్లు దాఖలు కాగా అందులో టీడీపీ నుంచి 135, జనసేన నుంచి 33, బీజేపీ నుంచి 7 నామినేషన్లు దాఖలయ్యాయి. అయితే ఎమ్మెల్యే కార్యాలయం నుంచి కొందరికి బీఫారాలు అందించడంతో మిగిలిన ఆశావహులు అసంతృప్తికి గురయ్యారు. బీఫారాల కోసం రూ.లక్షలు చేతులు మారాయంటూ కొందరు ఆశావాహులు ఆరోపణలు చేశారు. మొదట నామినేషన్లు వేయాలని ప్రోత్సహించి, ఇప్పుడు బీఫారం పొందిన అభ్యర్థి కోసం మిగిలిన వారు ఉపసంహరించుకోవాలని ఒత్తిడి చేయటంతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నామినేషన్‌ వేయడానికి ఇప్పటికే రూ.వేలు ఖర్చు చేశామని, చివరి నిమిషంలో ఎలా తప్పుకోవాలని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అవసరమైతే టీడీపీ రెబల్‌ అభ్యర్థులుగా బరిలో దిగుతామని స్పష్టం చేస్తున్నారు. మంగళవారం జరిగిన నామినేషన్ల పరిశీలన సందర్భంగా ఈ వ్యవహారం మరింత చర్చనీయాంశమైంది. ఏ వార్డులో ఎవరు అధికారిక అభ్యర్థి అనే విషయంలో స్పష్టత లేకపోవడంతో ఆశావహుల్లో ఉత్కంఠ నెలకొంది. పార్టీ నిర్ణయం కోసం ఎదురుచూడాలా? లేక స్వతంత్రంగా పోటీ చేయాలా? అన్న సందిగ్ధంలో పలువురు ఉన్నారు.

జనసేనలోనూ అదే గందరగోళం

కూటమిలో భాగస్వామ్య పక్షమైన జనసేనలోనూ అభ్యర్థుల ఎంపిక వ్యవహారం గందరగోళంగా మారింది. ఆ పార్టీ తరఫున పలువురు కౌన్సిలర్‌ అభ్యర్థులుగా నామినేషన్లు దాఖలు చేసినప్పటికీ, ఏ వార్డుకు ఎవరిని ఖరారు చేశారన్న దానిపై స్పష్టత లేదని ఆశావహులు చెప్పి వాపోతున్నారు. టీడీపీకి 37, జనసేనకు ఎనిమిది, బీజేపీకి మూడు వార్డులు కేటాయించినట్లు ఎమ్మెల్యే డాక్టర్‌ అరవిందబాబు ప్రకటించినప్పటికీ తుది అభ్యర్థుల జాబితా వెల్లడికాకపోవడంతో ఆశావహులు వారి ఇష్టారాజ్యంగా నామినేషన్లు దాఖలు చేశారు. తమకు అనుకూలమైన నేతల ద్వారా బీఫారాలు పొందేందుకు కొందరు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు.

అభ్యర్థుల నేర చరిత్ర పై చర్చ..

మరోవైపు టీడీపీ తరఫున బరిలో నిలిచిన కొందరు కౌన్సిల్‌ అభ్యర్థుల ఎంపికపైనా వివాదాలు తెరపైకి వస్తున్నాయి. బీసీ కాలనీ, చంద్రబాబునాయుడు కాలనీ, ఇస్లాంపేట, రామిరెడ్డిపేట ప్రాంతాలకు చెందిన కొందరు అభ్యర్థులు, వారి కుటుంబ సభ్యులపై గతంలో నేర సంబంధిత కేసులు ఉన్నాయంటూ ఆ పార్టీలోని నాయకులే ఆరోపణలు చేస్తున్నారు. సమాజంలో రౌడీషీటర్లుగా గుర్తింపు ఉన్న వ్యక్తులు మరియు వారి కుటుంబ సభ్యులకు టికెట్లు ఇచ్చారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్నికల సమయంలో స్థానికంగా రాజకీయ ప్రత్యర్థుల మధ్య ఘర్షణలు తలెత్తే అవకాశం ఉందని కొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

మున్సిపల్‌ చైర్మన్‌ పదవిని ఆశించిన బంగారు వ్యాపారవేత్త కపిలవాయి విజయకుమార్‌కు టీడీపీ నిర్ణయం నిరాశ కలిగించింది. చైర్మన్‌ అభ్యర్థిగా అవకాశం దక్కుతుందని ఆశించిన ఆయన, సోమవారం నామినేషన్‌ దాఖలు చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. అయితే చివరి నిమిషంలో అధిష్టానం మాజీ మున్సిపల్‌ చైర్మన్‌ నాగసరపు సుబ్బరాయ గుప్తా కుమారుడు రూపేష్‌ గుప్తాకు అవకాశం కల్పించడంతో విజయకుమార్‌ వర్గంలో అసంతృప్తి వ్యక్తమవుతోంది. రూపేష్‌ గుప్తా నామినేషన్‌ కార్యక్రమానికి సైతం విజయకుమార్‌ దూరంగా ఉన్నారు. పార్టీ కార్యక్రమాలకు హాజరుకాకపోవడం ద్వారా తన అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారన్న చర్చ కొనసాగుతోంది. ఎంపీ, ఎమ్మెల్యేలు కపలవాయిని బుజ్జగించేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేనట్లుగా సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement