పారదర్శకంగా ఎంపీపీ, జెడ్పీ ఎన్నికలు | - | Sakshi
Sakshi News home page

పారదర్శకంగా ఎంపీపీ, జెడ్పీ ఎన్నికలు

Nov 18 2026 2:13 AM | Updated on Nov 18 2026 2:13 AM

జెడ్పీ ఎన్నికలు

ఎన్నికల షెడ్యూల్‌..

జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ కృతికా శుక్లా

నరసరావుపేట: జిల్లాలో నవంబర్‌ 19, 20 తేదీల్లో నిర్వహించనున్న మండల ప్రజా పరిషత్‌ (ఎంపీపీ), జిల్లా ప్రజా పరిషత్‌ (జెడ్పీ) అధ్యక్ష, ఉపాధ్యక్షులు, కో–ఆప్టెడ్‌ సభ్యుల పరోక్ష ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో, పారదర్శకంగా, నిబంధనలకు అనుగుణంగా నిర్వహించేందుకు అవసరమైన అన్నిఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టాలని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ కృతికా శుక్లా అధికారులను ఆదేశించారు. ఎన్నికల నిర్వహణకు సంబంధించి మంగళవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్సు ద్వారా ఎన్నికల సన్నద్ధత, విధి విధానాలు, ఏర్పాట్లపై కలెక్టర్‌ సమగ్రంగా సమీక్షించారు. ప్రిసైడింగ్‌ అధికారులు, రిటర్నింగ్‌ అధికారులు, ఎంపీడీఓలు, జడ్పీ అధికారులకు ఎన్నికల నిర్వహణలో పాటించాల్సిన నిబంధనలు, విధులపై దిశానిర్దేశం చేశారు. నవంబర్‌ 19వ తేదీన మండల ప్రజా పరిషత్‌ అధ్యక్ష, ఉపాధ్యక్షులు, కోఆప్టెడ్‌ సభ్యుల ఎన్నికలు, నవంబర్‌ 20వ తేదీన జిల్లా ప్రజా పరిషత్‌ చైర్‌పర్సన్‌, వైస్‌ చైర్‌పర్సన్‌, కోఆప్టెడ్‌ సభ్యుల ఎన్నికలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ ఎన్నికల్లో అర్హులైన సభ్యులు చేతులెత్తే విధానం ద్వారా తమ ఓటు హక్కును వినియోగించుకుంటారని వివరించారు. నిర్ణీత సమయానికి కోరం లేని పక్షంలో ఒక గంట వరకు వేచి చూడాలని, అప్పటికీ కోరం సమకూరకపోతే ఎన్నికను మరుసటి రోజుకు వాయిదా వేయాలని సూచించారు. ఎన్నికల ప్రక్రియలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు, లోటుపాట్లకు తావులేకుండా సంబంధిత శాఖల అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేయాలని స్పష్టం చేశారు.

కోఆప్టెడ్‌ సభ్యుల ఎన్నికకు అర్హతలు

ఎన్నికల ప్రక్రియలో ముందుగా కో–ఆప్టెడ్‌ సభ్యులను ఎన్నుకోవడం జరుగుతుందని కలెక్టర్‌ తెలిపారు. మతపరమైన మైనారిటీలైన ముస్లిం, క్రైస్తవ, బౌద్ధ, సిక్కు మతాలకు చెందినవారు, అలాగే తెలుగు భాష మినహా ఇతర భాషలను మాతృ భాషగా కలిగిన వారు భాషాపరమైన మైనార్టీలుగా అర్హులవుతారని వివరించారు. కోఆప్టెడ్‌ సభ్యులుగా పోటీ చేయదలచిన వారు తమ మైనారిటీ అర్హతను ధ్రువీకరించే పత్రాన్ని ఎంపీ, ఎమ్మెల్యే, గెజిటెడ్‌ అధికారి నుంచి పొంది సమర్పించాల్సి ఉంటుందని తెలిపారు.

అదేవిధంగా నవంబర్‌ 20వ తేదీన నిర్వహించే జెడ్పీ కోఆప్టెడ్‌ సభ్యులు, చైర్‌పర్సన్‌, వైస్‌ చైర్‌పర్సన్‌ ఎన్నికలకు కూడా ఇదే విధమైన సమయపాలన పాటించాలని కలెక్టర్‌ సూచించారు. ఉదయం 10 గంటలలోపు నామినేషన్ల స్వీకరణ, మధ్యాహ్నం 12 గంటలలోపు పరిశీలన, ఒంటి గంటలోపు ఉపసంహరణ ప్రక్రియ పూర్తి చేస్తారని, మధ్యాహ్నం ఒంటి గంటకు కో– ఆప్టెడ్‌ సభ్యుల ఎన్నిక, మధ్యాహ్నం మూడు గంటలకు జెడ్పీ చైర్‌పర్సన్‌, వైస్‌ చైర్‌పర్సన్‌ ఎన్నిక నిర్వహిస్తారన్నారు.

నవంబర్‌ 19వ తేదీన నిర్వహించే ఎంపీపీ అధ్యక్ష, ఉపాధ్యక్షులు, కోఆప్టెడ్‌ సభ్యుల ఎన్నికలకు సంబంధించి ఉదయం 10 గంటలలోపు నామినేషన్లు లేదా ఫారం ఏ, బీ స్వీకరిస్తారన్నారు. మధ్యాహ్నం 12 గంటలలోపు నామినేషన్ల పరిశీలన పూర్తి చేస్తారని, మధ్యాహ్నం ఒంటి గంటలోపు నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ముగుస్తుందన్నారు. అనంతరం మధ్యాహ్నం ఒంటి గంటకు కోఆప్టెడ్‌ సభ్యుల ఎన్నిక, మధ్యాహ్నం మూడు గంటలకు ఎంపీపీ అధ్యక్ష, ఉపాధ్యక్షుల ఎన్నిక నిర్వహిస్తారన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement