నామినేషన్లు అడ్డుకోవడం దుర్మార్గం | - | Sakshi
Sakshi News home page

నామినేషన్లు అడ్డుకోవడం దుర్మార్గం

Nov 17 2026 1:50 AM | Updated on Nov 17 2026 1:50 AM

భవిష్యత్‌లో అన్ని పార్టీలు అనుసరించే ప్రమాదం

ఆఖరి రోజైనా ప్రతిపక్ష మద్దతుదారులతో నామినేషన్లు వేయనివ్వాలి

కలెక్టర్‌, ఎస్పీ, డీఎస్పీలు సహకరించాలి

విలేకర్ల సమావేశంలో డాక్టర్‌ గోపిరెడ్డి

నరసరావుపేట: రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా పంచాయతీ ఎన్నికల్లో వైఎస్సార్‌ సీపీతో సహా ప్రతిపక్ష పార్టీలు బలపర్చిన అభ్యర్థులు నామినేషన్లు వేయనీయకుండా చేస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, మంత్రి లోకేష్‌లు రాసిన పుస్తకం భవిష్యత్‌లో అందరూ పాటిస్తారని పార్టీ జిల్లా కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్‌ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి హెచ్చరించారు. గుంటూరు రోడ్డులోని నియోజకవర్గ పార్టీ కార్యాలయంలో సోమవారం సాయంత్రం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో జిల్లా లీగల్‌సెల్‌ అధ్యక్షురాలు రోళ్ల మాధవి, పలువురు న్యాయవాదులతో కలిసి మాట్లాడారు. మొదటి ఫేజ్‌ నామినేషన్లలో పల్నాడు జిల్లాలోని నరసరావుపేట నియోజకవర్గంలో అత్యంత దారుణంగా టీడీపీ కూటమి పోలీసులతో కుమ్మకై ్క తమ పార్టీ మద్దతుదార్లు సర్పంచ్‌, వార్డు మెంబర్లుగా నామినేషన్లు వేయనీయకుండా అడ్డుకోవటం దారుణమని పేర్కొన్నారు. చంద్రబాబు స్థానిక సంస్థల ఎన్నికలపై నామినేషన్ల దగ్గర నుంచి ఏవిధంగా అక్రమాలు, అన్యాయాలు చేయాలో తెలియచేస్తూ ఒక కొత్త పుస్తకంలో రాశాడన్నారు. ఈ పుస్తకం ప్రజాస్వామ్యానికి ఒక మాయని మచ్చని, పుస్తకంలోని పేజీలు, నియమావళి అందరూ భవిష్యత్‌లో పాటిస్తారన్నారు. ఎన్నికల సంఘం విడుదల చేసిన నియమావళి మాదిరిగానే చంద్రబాబు కూడా తన సొంత నియమాలు ప్రవేశపెట్టారన్నారు.

పోలీసులే అడ్డుకోవటం దారుణం

మొదటి రోజు ఆదివారం జరిగినట్లుగానే సోమవారం కూడా రొంపిచర్ల మండలం మాచవరం గ్రామానికి చెందిన వారు నామినేషన్లు వేసేందుకు 300 మంది పరగటిచర్ల గ్రామంలోని నామినేషన్‌ కేంద్రానికి వెళితే వారిని గ్రామంలోకి ప్రవేశించనీయకుండా పోలీసులు తమ వాహనాన్ని అడ్డుపెట్టి అడ్డుకున్నారన్నారు. నామినేషన్‌ వేయనీయకుండా అడ్డుకోవటానికి వారికి హక్కు ఏముందని ప్రశ్నించారు. కలెక్టర్‌, ఎస్పీ, ఎన్నికల సంఘానికి తాము లెటర్‌ పెట్టినా ఎవరూ స్పందించలేదన్నారు. నరసరావుపేట మండలం చినతురకపాలెం, పెద్దరెడ్డిపాలెం వీరవట్నం, అన్నవరప్పాడు గ్రామాలకు చెందిన వారిని నామినేషన్లు వేయనీయలేదన్నారు.

ప్రతిపక్షాన్ని చూసి భయపడుతున్న ప్రభుత్వం

కూటమి నాయకులు ప్రతిపక్షాన్ని చూసి ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు. కొత్తగా పెన్షన్‌, రేషన్‌కార్డు, ఇళ్లపట్టాలు ఇప్పటివరకు ఇవ్వకపోవటంతో ప్రభుత్వంపై ప్రజల్లో పూర్తి వ్యతిరేకత నెలకొందని, దీంతో పోలీసులతో ఎన్నికల కార్యక్రమం నడిపిస్తున్నారన్నారు. నామినేషన్లకు వైఎస్సార్‌ సీపీ వారు రావట్లేదని, వారు భయపడుతున్నారంటూ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు మాట్లాడటాన్ని ఖండించారు. పంచాయతీ నామినేషన్ల పర్వాన్ని పరిశీలించాలని సూచించారు. మాచవరానికి చెందిన తమ పార్టీ వారు ఉదయం 11 నుంచి సాయంత్రం 4గంటల వరకు వేచి ఉంచి సర్పంచ్‌, కొందరు వార్డు సభ్యులను లోపలికి పంపించి నామినేషన్‌ వేయించారన్నారు. నామినేషన్‌ వేయటానికి ఐదారుగంటలు కూర్చోవాలా అని ప్రశ్నించారు. నామినేషన్లు వేయించి ప్రజాతీర్పును ప్రభుత్వం తెలుసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. నిష్పక్షపాతంగా నామినేషన్లు వేయనిస్తే తమ పార్టీకే పంచాయతీలు అధికంగా వస్తాయన్నారు. రొంపిచర్ల మండలంలో 28 పంచాయతీలకుగాను కేవలం 14 పంచాయతీల్లో నామినేషన్లు వేశారని, మరో 14 పంచాయతీలలో వేయనీట్లేదన్నారు. వేసిన వాటిల్లో కొన్ని రాజీపడి వేశారన్నారు. నరసరావుపేట రూరల్‌ మండలంలో 26 మండలాలకుగాను 12పంచాయతీలకు మాత్రమే వేశారన్నారు. మంగళవారం ఒక్కరోజు మాత్రమే అవకాశం ఉందని, కావున కలెక్టర్‌, ఎస్పీ, డీఎస్పీలు నామినేషన్లు వేయించాలని కోరారు. ప్రజాస్వామ్య విలువలను కాపాడాలని కోరారు. సమావేశంలో పార్టీ లీగల్‌ సెల్‌ న్యాయవాదులు వై.సీతారామిరెడ్డి, శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement