నరసరావుపేట: జిల్లాలోని యల్లమంద, జొన్నలగడ్డ పంచాయతీలు, నరసరావుపేట మున్సిపాలిటీలో నామినేషన్ల స్వీకరణ ప్రక్రియను జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతిక శుక్ల సోమవారం పరిశీలించారు. ఆమె మున్సిపల్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ మున్సిపల్ ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థులు స్వేచ్ఛగా తమ నామినేషన్ వేసుకునే అవకాశం కల్పిస్తున్నామని చెప్పారు. అభ్యర్థులు స్వేచ్ఛగా నామినేషన్ దాఖలు చేసుకోవచ్చన్నారు. ఎక్కడైనా, ఏదైనా ఇబ్బందులు ఉంటే తక్షణమే లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయవచ్చన్నారు. అలాంటి వారికి రక్షణ కల్పిస్తాం, తక్షణమే వారు స్వేచ్ఛగా నామినేషన్ వేయడానికి అన్ని చర్యలు తీసుకుంటామన్నారు. నామినేషన్ల కేంద్రాల వద్ద పటిష్ట పోలీసు బందోబస్తు ఏర్పాటుచేసినట్లు తెలిపారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని పకడ్బందీగా అమలు చేస్తున్నట్లు తెలిపారు. మున్సిపల్ ఎన్నికల నామినేషన్ ప్రక్రియ సోమవారంతో ముగిసిందని, గ్రామ పంచాయతీ రెండో దశ నోటిఫికేషన్ సోమవారం విడుదలైందని అన్నారు. మున్సిపల్ కార్యాలయంలో హెల్ప్ డెస్క్, కౌన్సిలర్, చైర్మన్ అభ్యర్థుల నామినేషన్ ప్రక్రియలను అడిగి తెలుసుకున్నారు. నామినేషన్ పత్రాల స్వీకరణపై ఆరా తీశారు. నామినేషన్ వేయడానికి వచ్చే అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఆర్‌డీఓ కె.బాలకృష్ణ, మున్సిపల్ కమిషనర్ బి.రమ్యకీర్తన, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు.


