పల్లెల్లో పచ్చ పగల చిచ్చు | - | Sakshi
Sakshi News home page

పల్లెల్లో పచ్చ పగల చిచ్చు

Nov 16 2026 2:50 AM | Updated on Nov 16 2026 2:50 AM

పల్లెల్లో పచ్చ పగల చిచ్చు

ఫ్యాక్షన్‌ పగలు రగిల్చే పనిలో టీడీపీ మూకలు పదిహేనేళ్లుగా శాంతియుతంగా ఉన్న పల్లెల్లోనూ అరాచకాలు విప్పర్లలో పెట్రోల్‌ బాంబులతో రెచ్చిపోయిన టీడీపీ గూండాలు అధికార పార్టీకి నిస్సిగ్గుగా కొమ్ముకాస్తున్న ఖాకీలు

ఈ ప్రాంతాల్లో మరీ ఎక్కువ...

దశాబ్దాలుగా ప్రశాంతంగా ఉన్న పల్నాడు పల్లెల్లో తిరిగి చిచ్చు రేపుతున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రెడ్‌బుక్‌ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ పచ్చగా ఉన్న పల్లెల్లో నెత్తుటి ఏరులు పారిస్తున్నారు. ఫ్యాక్షన్‌కు దూరంగా ఉంటున్న గ్రామాల్లో సైతం అరాచకాలు సృష్టిస్తూ కక్షలు, కార్పణ్యాలకు ఉసిగొల్పుతున్నారు. పిల్లలను చదివించుకుని హాయిగా జీవిస్తున్న గ్రామాల్లో ఎన్నికల పేరుతో గొడవలు సృష్టిస్తూ తిరిగి ఫ్యాక్షన్‌ వైపు పల్లె ప్రజలను ఉసిగొల్పుతున్నారు.

సాక్షి ప్రతినిధి, గుంటూరు: కూటమి నేతల దౌర్జన్యాలు, అరాచకాలు ఒకవైపు... పోలీసుల బెదిరింపులు, వేధింపులతో మరోవైపు... వెరసి పల్లె ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. తమను తాము కాపాడుకునేందుకు, ఆత్మాభిమానాన్ని నిలబెట్టుకునేందుకు గొడవలకు దిగాల్సిన దుస్థితిని తీసుకొస్తున్నారు. ఎంత హింసించినా, వేధించినా శాంతియుతంగా ఉందామనుకున్నా వైఎస్సార్‌ సీపీ నాయకులు, కార్యకర్తలపై పోలీసులు తప్పుడు కేసులు పెట్టి అక్రమంగా నిర్బంధిస్తున్నారు. దౌర్జన్యాలకు దిగుతూ దాడులకు తెగబడటం కూటమి నేతలకు పరిపాటిగా మారింది. రొంపిచర్ల మండలం విప్పర్ల గ్రామంలో తాజాగా టీడీపీ గూండాలు రెండు గ్రూపులుగా విడిపోయి ఒకరిపై ఒకరు దాడులకు తెగబడిన వైనంతో పల్నాడు ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఏకంగా బాంబుల సంస్కృతిని మరోసారి ప్రవేశపెట్టిన టీడీపీ నేతలు పెట్రోల్‌ బాంబులతో దాడులు చేసుకున్నారు. పంచాయతీ ఎన్నికల నామినేషన్ల సందర్భంగా రెండు గ్రూపులుగా విడిపోయి కర్రలు, రాడ్లు, కత్తులతో ఒకరిపై ఒకరు దాడులకు దిగారు. ఈ సందర్భంగా ఇరు వర్గాలను చెదరగొట్టేందుకు ప్రయత్నించిన పోలీసులపై సైతం దాడులకు తెగబడ్డారు. పలువురు పోలీసులకు సైతం గాయాలైనట్లు సమాచారం. దాడులకు తెగబడింది టీడీపీ కార్యకర్తలే కావడంతో పోలీసులు సైతం ఏమీ చేయలేక సంయమనం పాటించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇదే సమయంలో పోలీసు శాఖ సైతం ఉలిక్కిపడేలా గ్రామంలో పెట్రోల్‌ బాంబులు, పెట్రోల్‌ వంటి ప్రాణాంతక పదార్థాల నిల్వ బయటపడింది. వీటిని స్వాధీనం చేసుకున్న పోలీసులు.. గ్రామంలో పికెట్‌ ఏర్పాటు చేశారు. వైఎస్సార్‌సీపీ బలంగా ఉన్న గ్రామాల నుంచి అభ్యర్థులు టీడీపీ బలంగా ఉండే గ్రామాలకు వెళ్లి నామినేషన్లు వేసేలా అధికార పార్టీ ఎమ్మెల్యేలు, అధికారులు కుట్రలు పన్నుతుండటంతో ఇది ఎటు దారితీస్తుందోననే భయం పల్లె ప్రజలకు నిద్ర పట్టనివ్వడం లేదు. ఇప్పటికై నా అధికారులు పరిస్థితిని గమనించి ఏ గ్రామానికి ఆ గ్రామంలోనే నామినేషన్లు వేసుకునేలా చర్యలు చేపట్టకపోతే పల్నాడులో ఫ్యాక్షన్‌ రక్కసి మరోసారి పురివిప్పే ప్రమాదం పొంచి ఉంది.

పచ్చ చొక్కాలు వేసుకున్న ఖాకీలు

సమాజంలో శాంతిభద్రతలను కాపాడాల్సిన ఖాకీలు ఆ ఊసే మరిచారు. గ్రామాల్లో ఫ్యాక్షన్‌ను తరిమికొట్టి శాంతిని నెలకొల్పాల్సిన వారే ఉద్రిక్తతలు సృష్టించి పచ్చని పల్లెల్లో చిచ్చురేపుతున్నారు. అధికార పార్టీ నేతల అడుగులకు మడుగులొత్తుతూ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నేతలు, కార్యకర్తలపై పోలీసులు వ్యవహరిస్తున్న తీరుతో పల్లె జనం రగిలిపోతున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రశాంతంగా ఎన్నికల ప్రక్రియ జరిగేలా చూడాల్సిన పోలీసులే ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు. నామినేషన్లు వేసేందుకు వెళ్తున్న వైఎస్సార్‌ సీపీ అభ్యర్థులను అడ్డుకుంటున్న పరిస్థితి నెలకొంది. ఆదివారం నరసరావుపేట రూరల్‌ మండలంలోని ములకలూరు గ్రామానికి చెందిన వైఎస్సార్‌ సీపీ సర్పంచ్‌, వార్డు మెంబర్‌ అభ్యర్థులు నామినేషన్లు వేసేందుకు విస్సపాలెం గ్రామానికి వెళ్తుండగా ఎస్‌ఐ కిషోర్‌తో కూడిన పోలీసు బృందం వారిని అడ్డుకుంది. నామినేషన్లు వేయడానికి వీల్లేదంటూ వెనక్కి పంపే ప్రయత్నం చేసింది. వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు ఎస్‌ఐతో పాటు పోలీసులను చేతులు జోడించి వేడుకున్నా ఖాకీల మనసు కరగలేదు. దీంతో చేసేదేమీ లేక రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేయాల్సిన దుస్థితి ఏర్పడింది. పచ్చపార్టీ నేతల ఇళ్లల్లో పని చేసే వారికంటే హీనంగా కొందరు పోలీసులు దిగజారి వ్యవహరిస్తున్నారని సామాన్య ప్రజలు మండిపడుతున్నారు.

జిల్లాలోని గురజాల, నరసరావుపేట, మాచర్ల నియోజకవర్గాల్లో గతంలో ఫ్యాక్షన్‌తో అట్టుడికిన గ్రామాల్లో సుమారుగా రెండు దశాబ్దాలుగా అందరూ గతాన్ని మరిచిపోయి శాంతియుతంగా జీవనం సాగిస్తున్నారు. అయితే, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు గడిచిన తరువాత స్థానిక సంస్థల ఎన్నికల పేరుతో టీడీపీ నేతలు చేస్తున్న అరాచకాలు, పోలీసులు బరితెగిస్తున్న తీరు కారణంగా పల్లెల్లో తిరిగి ఫ్యాక్షన్‌ రక్కసి పురుడు పోసుకుంటుందనే భయాందోళనలతో పల్లె జనం బిక్కుబిక్కుమంటున్నారు. ఇటీవల జరిగిన మున్సిపల్‌, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో అధికారాన్ని అడ్డంపెట్టుకుని కూటమి ఎమ్మెల్యేలు తమ గూండాలతో అరాచకం సృష్టించారు. దాడులకు తెగబడటం, పోలీసులు వారికి ఉడిగం చేస్తూ పచ్చ చొక్కాలు వేసుకుని ఉద్యోగాలు చేస్తున్నట్లుగా వ్యవహరించడంతో పల్లె జనంలో తిరుగుబాటు మొదలైంది. అనేక పల్లెల్లో ఇప్పటికే గొడవలు జరుగుతున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement