పల్లెల్లో సర్పంచ్ల గెలుపునకు అడ్డదారిలో ప్రణాళికలు ప్రతిపక్ష వైఎస్సార్ సీపీ మద్దతుదారులు గెలిస్తే ఇబ్బందే ఓటమి భయంతో కూటమి నేతల నానా పాట్లు
సత్తెనపల్లి: జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికలు ఎమ్మెల్యేలకు పరీక్ష పెడుతున్నాయి. ప్రజాప్రతినిధులుగా గెలిచిన తర్వాత జరుగుతున్న ఎన్నికలు కావడంతో ఇవి ప్రతిష్ఠాత్మకంగా మారాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా మున్సిపల్, నగర పంచాయతీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో అన్ని స్థానాలను కై వసం చేసుకోవాలనే ఉద్దేశంతో ఎక్కడికక్కడ నామినేషన్ పత్రాలను చించివేయడం, బెదిరింపులు, దాడులకు పాల్పడ్డారు. ఎన్నికల ప్రక్రియ రోజున ఏజెంట్లను బయటకు లాగివేయడం, పోలీసులు ప్రివెంటివ్ అరెస్టుల పేరుతో వైఎస్సార్ సీపీ వారిని అదుపులోకి తీసుకోవడం వంటి చర్యలతో కూటమి నేతలు ఏకపక్షంగా ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారు. అడ్డగోలుగా ఎన్నికలు నిర్వహించుకునేలా ఎమ్మెల్యేలు వెనుక ఉండి యంత్రాంగాన్ని నడిపించారు. గురజాల నియోజకవర్గంలో అయితే ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు పోలీసుల సహకారంతో ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాకుండా అన్ని స్థానాలను ఏకగ్రీవం చేయించుకున్నారు. అయినప్పటికీ పలు చోట్ల వైఎస్సార్ సీపీ అభ్యర్థులు పోటీ చేసి తమ సత్తా చాటారు.
తప్పని ఎదురుగాలి
మున్సిపల్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ఫలితాల ఆధారంగా గ్రామాల్లో తమ ఓటు బ్యాంకు పదిలంగా లేదనే అంచనాకు ఎమ్మెల్యేలు వచ్చారు. ప్రభుత్వంపై పల్లెల్లో ప్రజానుకూలత లేదనే విషయాన్ని ఇప్పటికే గ్రహించారు. పల్లెల్లో గ్రూపు రాజకీయాలు, ఒకే పార్టీలో నాయకుల మధ్య విభేదాలు తదితర కారణాలు అధికార పార్టీ ఎమ్మెల్యేలకు తలనొప్పిగా మారాయి. ఇటీవల నిర్వహించిన స్థానిక సంస్థల ఎన్నికల్లో అవకాశాలు రాని వారు, రిజర్వేషన్లు కలిసిరాని నాయకులు, సీనియర్లు, పాత, కొత్త నాయకుల మధ్య ప్రస్తుత పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసే విషయమై విభేదాలు తలెత్తుతున్నాయి. ఒక్కో చోట ఇద్దరి కంటే ఎక్కువ మంది ఆసక్తి చూపుతున్న నేపథ్యంలో అభ్యర్థుల ఎంపిక కోసం తర్జనభర్జన పడుతున్నారు. ఈ క్రమంలో ప్రతిపక్ష వైఎస్సార్ సీపీ ఎక్కడ పుంజుకుంటుందోననే ఆందోళన ఎమ్మెల్యేలకు తిప్పలు తెచ్చిపెడుతోంది.
ఏకగ్రీవాల కోసం తంటాలు...
పార్టీ గుర్తుపై పోటీ లేకున్నా పల్లెల్లో కూటమిలోని నాయకులు, కార్యకర్తలు, అనుచర వర్గాలు, వారి కుటుంబాల నుంచే మహిళలు బరిలో నిలవనున్నారు. ఈ తరుణంలో ఆయా సర్పంచ్ అభ్యర్థులు గెలిచినా, ఓడినా ఆ ఫలితం కూటమి పార్టీల ఖాతాలోనే పడనుంది. దీంతో గెలుపు గుర్రాలను ఎంపిక చేస్తున్నారు. ముఖ్యంగా ప్రజాబలంతో పాటు ఆర్థిక బలం ఉందా లేదా? ప్రత్యర్థులతో పోలిస్తే పార్టీ మద్దతు ఇస్తున్న అభ్యర్థుల పరిస్థితి ఎలా ఉంది? అనే అంశాలపై ఆరా తీసి బరిలో దింపుతున్నారు. చివరికి పార్టీ తరఫున నిలబెట్టిన వారిలో ఎవరైనా ఓడిపోతే, గెలిచిన వారిని తమ పార్టీలో చేర్చుకునే అంశాలను కూడా పరిశీలిస్తున్నారు. ఇది ఇలా ఉంటే, అసలు ఖర్చే లేకుండా ఉండేలా ఏకగ్రీవాల కోసం అడ్డదారుల్లో విశ్వప్రయత్నాలు చేసేలా ప్రణాళికలు రచిస్తున్నారు. ప్రతిపక్ష వైఎస్సార్ సీపీ నుంచి బరిలోకి దిగి గెలుస్తారనుకునే స్థానాల్లో ఆ పార్టీ అభ్యర్థులు పోటీ చేయకుండా ఉండేలా ఇప్పటికే పోలీసుల ద్వారా హెచ్చరికలు, బెదిరింపులకు గురిచేయడం వంటి చర్యలు చోటుచేసుకుంటున్నాయి. వైఎస్సార్ సీపీ అభ్యర్థులు ఎట్టి పరిస్థితుల్లోనూ నామినేషన్ వేయడానికి వీల్లేదని, ఒకవేళ వేసినా ముందస్తుగా అరెస్టు చేస్తామని హెచ్చరిస్తున్నారు.
కూటమిలో జాబితాల వడపోత...
జిల్లాలో పంచాయతీ ఎన్నికలు మూడు విడతల్లో జరగనున్నాయి. మొదటి విడతలో నరసరావుపేట, వినుకొండ నియోజకవర్గాల్లోని 173 పంచాయతీలతో పాటు నరసరావుపేట మున్సిపాలిటీలోనూ ఎన్నికలు నిర్వహించనున్నారు. రెండో విడతలో సత్తెనపల్లి, పెదకూరపాడు నియోజకవర్గాల్లోని 150 పంచాయతీలకు జరగనున్నాయి. మూడో విడతలో గురజాల, మాచర్ల, చిలకలూరిపేట నియోజకవర్గాల్లోని 189 పంచాయతీలకు ఎన్నికలు ఉంటాయి. మొత్తం 512 గ్రామ పంచాయతీలు, 7,286 వార్డు సభ్యుల స్థానాలకు మూడు విడతల్లో ఈ నెల 26, 29, డిసెంబర్ 2 తేదీల్లో ఎన్నికలు జరగనున్నాయి. తొలి విడత పంచాయతీలకు ఈ నెల 15 నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. ఇందుకోసం 58 క్లస్టర్ కేంద్రాల్లో నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ చేపట్టనున్నారు. దీంతో ఇప్పటికే సిద్ధం చేసిన పోటీ చేసే అభ్యర్థుల జాబితాలను ఎక్కడికక్కడ వడపోస్తున్నారు. ఎవరిని బరిలోకి దించాలనే కోణంలో పలు సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఆశావహులతో చర్చిస్తున్నారు. ఈ నేపథ్యంలో అధికార పార్టీ ఎమ్మెల్యేలు తమకు ఆర్థికంగా కొంత సాయం చేయాలని అభ్యర్థుల నుంచి వినతులు వస్తున్నాయి. రియల్ ఎస్టేట్, వ్యాపార రంగాలు అంతంతమాత్రంగానే ఉండటంతో చాలా మందికి డబ్బుల కొరత ఉంది. ఇప్పటికే ఎమ్మెల్యేలపై ఆశలు పెట్టుకున్న ఆర్థికంగా బలంగా లేని అభ్యర్థులకు నాయకులు సాయం చేయాలని కోరుతున్నారు. నామినేషన్ల ప్రక్రియ పూర్తయి, తుది జాబితాలో బరిలో ఉండే అభ్యర్థులు తేలాక ఒక అంచనాకు వస్తే, ఎమ్మెల్యేలు సర్దుబాటు చేసే అవకాశాలున్నాయి.


