బైకులు, కార్లతో దద్దరిల్లిన ఘాట్ దేశం నలుమూలల నుంచి వచ్చిన రేసర్లు కోట సాక్షిగా.. ఘాట్ రోడ్డుపై స్పీడ్ వార్
యడ్లపాడు: పర్యాటక కేంద్రంగా ప్రసిద్ధిగాంచిన ఈ ప్రాంతం తొలిసారిగా రేసింగ్ వేదికగా కొత్త అవతారం ఎత్తింది. మోటోస్ట్రోమ్ ఆధ్వర్యంలో నిర్వహించిన వెర్టెక్స్ హిల్‌క్‌లైంబ్ రేస్–2026 ఆదివారం కార్ల పోటీలతో ఉత్కంఠభరితంగా ముగిసింది.
రెండో రోజు కార్ల హోరు
రెండు రోజుల పాటు సాగిన స్పీడ్‌వార్‌లో తొలిరోజు బైక్ రైడర్లు తమ ప్రతిభను చాటుకోగా, రెండోరోజు కార్ రేసర్లు రోడ్డుపై రయ్‌రయ్‌మంటూ దూసుకెళ్లారు. ఒక్కో విభాగంలో 20 రకాల పోటీలు నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, చైన్నె, కర్ణాటక, మహారాష్ట్ర తదితర ప్రాంతాల నుంచి సుమారు 60 మంది బైక్ రైడర్లు, 40 మంది కార్ రేసర్లు పాల్గొన్నారు.
కొండవీడుకు అంతర్జాతీయ క్రీడా గుర్తింపే లక్ష్యం
గతంలో కుప్పం, పెనుకొండ ప్రాంతాల్లో మోటార్ స్పోర్ట్స్ ఈవెంట్లను విజయ వంతంగా నిర్వహించిన మోటోస్ట్రోమ్..ఈసారి కొండవీడును వేదికగా ఎంచుకుంది. చారిత్రక ప్రాధాన్యం, ప్రకృతి అందాలు, సవాళ్లతో కూడిన ఘాట్ రోడ్డు ఈ పోటీలకు అనువైన వేదికగా నిలిచాయని నిర్వాహకుడు ఎం.నాగచైతన్య తెలిపారు. ఈ తరహా పోటీల ద్వారా కొండవీడును రేసింగ్ స్పోర్ట్స్ హబ్‌గా ప్రపంచానికి పరిచయం చేయాలన్నదే తమ ఉద్దేశమన్నారు. పోటీల నిర్వహణలో భద్రతకు అత్యంత ప్రాధాన్యమిచ్చినట్లు నిర్వాహకులు తెలిపారు. ఎస్‌ఎఫ్‌ఎస్‌సీఐ సర్టిఫికెట్ కలిగిన ప్రొఫెషనల్ రేసర్లకు మాత్రమే అవకాశం కల్పించామని వెల్లడించారు. ప్రమాదాల నివారణలో భాగంగా సందర్శకుల వాహనాలను అటవీశాఖ చెక్‌పోస్టు వరకే అనుమతించి, కొండపైకి పర్యాటకుల ప్రవేశాన్ని నిలిపివేసినట్లు వెల్లడించారు. ఘాట్‌రోడ్డులో పోటీల నిర్వహణకు అనుమతులు ఆలస్యంగా లభించడంతో ఆర్థికంగా కొంత నష్టం వాటిల్లిందని అసంతృప్తి వ్యక్తం చేశారు.


