అమరేశ్వరుడి దర్శనానికి కష్టాలు | - | Sakshi
Sakshi News home page

అమరేశ్వరుడి దర్శనానికి కష్టాలు

Nov 16 2026 2:44 AM | Updated on Nov 16 2026 2:44 AM

భక్తులకు విజయవాడ–అమరావతి ప్రయాణ సౌకర్యం కరువు పెదమద్దూరు రోడ్డు కొట్టుకుపోవడంతో సమస్య కనీసం ప్రత్యామ్నాయం కూడా ఆలోచించని ఆర్టీసీ అధికారులు

అమరావతి: ప్రఖ్యాత పర్యాటక కేంద్రం, ఆధ్యాత్మిక క్షేత్రం, వారసత్వ నగరమైన అమరావతికి వస్తున్న పర్యాటకులకు కష్టాలు తప్పడం లేదు. విజయవాడ నుంచి అమరావతికి రావాలంటే నానా ఇబ్బందులు పడాల్సి వస్తోంది. మురుసు తుఫాన్‌ కారణంగా వచ్చిన వరద నీటికి పెదమద్దూరు బ్రిడ్జి సమీపంలో రోడ్డు కొట్టుకుపోవడంతో బస్సు సౌకర్యం లేకుండా పోయింది. ప్రస్తుతం భక్తులు విజయవాడ నుంచి అమరావతి చేరుకోవాలంటే పెదమద్దూరు వద్ద దిగి, అక్కడి నుంచి ఆటోలో వెళ్లాల్సి వస్తోంది.

సమస్య పరిష్కరించని యంత్రాంగం

గతంలో అమరావతి ఆలయం నుంచి విజయవాడకు ప్రతి 20 నిమిషాలకు ఒక బస్సు సర్వీసు ఉండేది. వరదలు, భారీ వర్షాల కారణంగా రాకపోకలకు రహదారి అనువుగా లేకపోవడంతో అధికారులు ఆర్టీసీ సర్వీసులను నిలిపివేశారు. ప్రయాణికులు విజయవాడ వెళ్లాలంటే అమరావతి నుంచి గుంటూరు వెళ్లి, అక్కడి నుంచి విజయవాడ చేరుకోవాల్సి వస్తోంది. అంటే సుమారు 30 కిలోమీటర్లు చుట్టూ తిరిగి వెళ్లాల్సి వస్తోంది. లేకుంటే ద్విచక్ర వాహనంపై గానీ, ఆటోలో గానీ ఎండ్రాయి, చావపాడు మీదుగా పెదమద్దూరు వెళ్లి, అక్కడి నుంచి విజయవాడ బస్సు ఎక్కాలి. విజయవాడ బస్సు ఎక్కాలంటే సుమారు 12 కిలోమీటర్లు చుట్టూ తిరిగి పెదమద్దూరు చేరుకోవాల్సి వస్తోంది. గతంలో పెదమద్దూరు వాగు పొంగి ప్రవహించినప్పుడు చావపాడు, ఎండ్రాయి, నరుకుళ్లపాడు మీదుగా అదనపు బస్సు చార్జీతో సర్వీసులు నడిపేవారు. ప్రస్తుతం అధికారులు ప్రత్యామ్నాయ మార్గాన్ని ఆలోచించకుండా పెదమద్దూరు వరకు మాత్రమే విజయవాడ–అమరావతి బస్సులను నడపడంతో ప్రయాణికులు, యాత్రికులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికై నా సంబంధిత అధికారులు యాత్రికుల సమస్యపై దృష్టి సారించి పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement