దాచేపల్లి: రోడ్డు ప్రమాదంలో కార్మికుడు తీవ్రంగా గాయపడిన సంఘటన శుక్రవారం రాత్రి జరిగింది. దాచేపల్లి నగర పంచాయతీ పరిధిలోని నడికుడి గ్రామానికి చెందిన హనుమంతరావు ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డారు. వివరాలు ఇలా ఉన్నాయి. గామాలపాడు సమీపంలోని ఆంధ్రా సిమెంట్స్ ఫ్యాక్టరీలో ఫిట్టర్‌గా హనుమంతరావు పని చేస్తున్నాడు. విధులు ముగించుకుని ద్విచక్రవాహనంపై ఇంటికి తిరిగి వస్తున్న క్రమంలో గుర్తుతెలియని వాహనం హనుమంతరావుని ఢీకొట్టింది. ఈ ఘటనలో హనుమంతరావు కాళ్లకు తీవ్రగాయాలయ్యాయి. గమనించిన స్థానికులు గాయపడిన హనుమంతరావుని చికిత్స నిమిత్తంగా దాచేపల్లి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన చికిత్స కోసం గుంటూరు తరలించారు.


