అమరావతి: మండల పరిదిలోని నెమలికల్లు గ్రామంలో బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించిన యువకుడిని పోలీసులు శనివారం అరెస్టు చేఽశారు. రెండు రోజుల కిందట నెమలికల్లు గ్రామానికి చెందిన బుల్లా ఇంద్రసేన అదే గ్రామానికి చెందిన బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. ఈనేపథ్యంలో శనివారం అమరావతి పోలీసులు నిందితుడు ఇంద్రసేనను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి సత్తెనపల్లి డీఎస్పీ చైతన్య నేతృత్వంలో కోర్టులో హజరుపరిచారు. నిందితునికి ఏడు రోజులు రిమాండ్ విధించారు.
పెదకూరపాడు (అచ్చంపేట): ఓ ఇంట్లో బంగారం, నగదు దొంగతనం జరిగిన ఘటన శనివారం పెదకూరపాడు నియోజకవర్గం అచ్చంపేట గ్రామంలో చోటుచేసుకుంది. పోలీసులు, బాధితుల కథనం మేరకు... అచ్చంపేట గ్రామానికి చెందిన బూర్ల నరసింహారావు, అంజలి దంపతులకు ఇద్దరు మగసంతానం, కుమార్తె ఉన్నారు. కుమారులు వ్యాపార నిమిత్తం ఒంగోలులో స్థిరపడ్డారు. కుమార్తె విజయవాడలో స్థిరపడింది. విజయవాడలో మనవరాలు వివాహానికి దంపతులు వెళ్లారు. శనివారం రాత్రి ఇంటికి రాగా తాళం పగలగొట్టి ఉంది. బీరువాలో భద్రపరిచిన 144 గ్రాముల బంగారం, రూ.లక్ష నగదు చోరీకి గురైనట్లు గుర్తించారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
సత్రశాల(రెంటచింతల): శ్రీగంగా భ్రమరాంబ సమేత మల్లికార్జునస్వామి దేవస్థానంలోని అంతరాలయంలో ప్రతిష్ఠించిన నంది విగ్రహం చోరీ విషయమై విచారించేందుకు పల్నాడు జిల్లా దేవదాయ శాఖ అధికారి జి.ఎ.వి. శ్రీనివాస్ ఈ నెల 16వ తేదీన రానున్నట్లు ఈఓ గాదె రామిరెడ్డి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. మధ్యాహ్నం 12 గంటలకు దేవస్థానాన్ని సందర్శించి నంది విగ్రహం మారిన విషయంపై విచారించనున్నట్లు ఆయన వెల్లడించారు. దేవస్థానం ట్రస్ట్ బోర్డు చైర్మన్ గుండా వెంకట శివయ్య, దేవస్థానం ప్రధాన అర్చకులు, బోర్డు సభ్యులు తప్పనిసరిగా హాజరు కావాలని ఆయన కోరారు.
యడ్లపాడు: మురసు తుఫాన్ ప్రభావంతో గ్రామాల్లోని సురక్షిత ప్రాంతాలకు తరలించిన 5 గ్రామాల్లోని 233 కుటుంబాలకు బియ్యం నిత్యావసరాలతో పాటు రూ.7.93 లక్షల నగదు పంపిణీ చేసినట్లు తహసీల్దార్ జెట్టి విజయశ్రీ తెలిపారు. వరద సాయంలోనూ అధికారులు ఏకపక్ష ధోరణిని అవలంబిస్తున్నారని మాజీ ఎంపీపీ ఎంవీ బాలచంద్రారెడ్డి విమర్శించారు. శనివారం సొలస గ్రామంలో టీడీపీ వారికే వీటిని అందించినట్లు ఆరోపించారు. సర్పంచ్ ఎన్నికలకు ముందే పరిహారం పేరిట ఇలా నగదు పంపిణీ చేస్తున్నట్లు ఆరోపించారు. నష్టపోయిన అన్ని కుటుంబాలకు ఇవ్వాల్సిన బాధ్యత అధికారులకు లేదా అని ప్రశ్నించారు. రెవెన్యూ అధికారుల వివక్షపై జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేయనున్నట్లు చెప్పారు. ఈ విషయంపై తహసీల్దార్‌ను విజయశ్రీను వివరణ కోరగా... బాధిత కుటుంబాలు ఎవరైన ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని, ఆ వివరాలను కలెక్టర్‌కు పంపించి న్యాయం చేస్తామని చెప్పారు.
చిలకలూరిపేట టౌన్: పట్టణంలో పాన్ బ్రోకర్ షాపులో చోరీ జరిగింది. శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత దుకాణం తాళాలు పగులగొట్టి లోపలికి ప్రవేశించిన దుండగులు సుమారు రూ.లక్ష నగదుతో పాటు 16 గ్రాముల బంగారాన్ని చోరీ చేశారు. లాకర్‌ను పగులగొట్టేందుకు ప్రయత్నించినప్పటికీ విఫలమై అక్కడి నుంచి పరారయ్యారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణంలోని విశ్వబ్రాహ్మణ వీధిలో నివాసం ఉంటున్న తంగెళ్ల రామ్‌మోహన్ సాయి అనే వ్యక్తి కళామందిర్ సెంటర్‌లోని పెద్ద శివాలయం వెనుక భాగంలో పాన్ బ్రోకర్ దుకాణం నిర్వహిస్తున్నారు. శుక్రవారం రాత్రి 9 గంటల సమయంలో దుకాణానికి తాళం వేసి ఇంటికి వెళ్లారు. శనివారం ఉదయం షాపు వద్దకు చేరుకోగా, దుకాణం ముందు గ్రీన్ మ్యాట్ అడ్డుగా కట్టి ఉండటాన్ని గమనించారు. అనుమానం వచ్చి పరిశీలించగా తాళాలు పగులగొట్టి ఉండటాన్ని గుర్తించారు. లోపలికి వెళ్లి చూడగా సెల్ కౌంటర్‌లో ఉంచిన సుమారు 16 గ్రాముల బంగారం కనిపించలేదు. దీంతోపాటు నగదు సైతం చోరీకి గురైనట్లు గుర్తించారు. దుండగులు లాకర్‌ను పగులగొట్టేందుకు ప్రయత్నించారు. అర్బన్ సీఐ పి.రమేష్ కేసు దర్యాప్తు చేపట్టారు.


