నామినేషన్ వేయకుండా గూండాలతో అడ్డుకునే ప్రయత్నం సంప్రదాయానికి విరుద్ధంగా నామినేషన్ కేంద్రాలు మార్చడమేంటి? ఎన్నికలు సజావుగా జరిగితే టీడీపీ గల్లంతు ఖాయం మాజీ ఎమ్మెల్యే నంబూరు శంకరరావు
పెదకూరపాడు: పెదకూరపాడు నియోజకవర్గంలో ఎన్నడూ లేని సంస్కృతిని టీడీపీ తీసుకు వస్తుందని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త నంబూరు శంకరరావు విమర్శించారు. గుంటూరులోని క్యాంప్ కార్యాలయంలో శనివారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను నామినేషన్ దాఖలు చేయకుండా రౌడీలు, గూండాలు అడ్డుకొని దాడులు చేశారన్నారు. క్రోసూరు మండలంలో జనసేన అభ్యర్థి, సీపీఐ అభ్యర్థి నామినేషన్ వేస్తే రిగ్గింగ్ చేసి 33 వేల మెజార్టీ చూపించారన్నారు. పలువురు టీడీపీ కార్యకర్తలు కూడా ఓటు వేయలేని పరిస్థితి ఏర్పడిందని అన్నారు. ఇదే మండలంలోని ఊటుకూరు గ్రామంలో 3,200 ఓట్లు ఉంటే 1600 ఓట్లు పోల్ అయితే సీపీఐ అభ్యర్థికి 400 ఓట్ల మెజారిటీ వచ్చిందని అప్పుడే టీడీపీ ఓడిపోయిందని పేర్కొన్నారు. ఓట్లు అడిగే మార్గం లేక, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టలేక టీడీపీ నాయకులు దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారన్నారు. పంచాయతీ ఎన్నికలలో కూడా నామినేషన్లు అడ్డుకునేలా కుతంత్రాలు చేస్తున్నారన్నారు. ప్రజాస్వామ్యంలో ఎన్నికలు జరగకుండా చేయటం దుర్మార్గమైన ఆలోచన అన్నారు. రాబోయే సార్వత్రిక ఎన్నికలలో ప్రజలు టీడీపీకి బుద్ధి చెబుతారన్నారు. అధికారులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ నియోజకవర్గంలో ఎన్నడూ లేని విధంగా గత 20 సంవత్సరాల నుంచి ఉన్న పంచాయతీ ఎన్నికల నామినేషన్ కేంద్రాలను మార్చడం దారుణమన్నారు. టీడీపీకి పట్టున్న గ్రామాలలో నామినేషన్ కేంద్రాలను ఏర్పాటు చేయటం ఏమిటని ప్రశ్నించారు. నియోజకవర్గంలో జరుగుతున్న అరాచకాలను ఎన్నికల సంఘానికి, గవర్నర్, కలెక్టర్, ఎస్పీకి ఫిర్యాదు చేశామన్నారు. కోర్టును ఆశ్రయించి నామినేషన్లు వేసే దుస్థితి ఈ నియోజకవర్గంలో ఉందని తెలిపారు. ప్రజలు తుఫానుతో అల్లాడుతుంటే వారిని ఆదుకోకుండా టిడిపి నుంచి నుంచునే అభ్యర్థుల నుండి డబ్బులు వసూలు చేసి అధికారులను, రౌడీలను, గుండాలను, ఇతర ప్రాంతం నుంచి వచ్చే టీడీపీ నాయకులను అడ్డుపెట్టుకొని నామినేషన్లను అడ్డుకునే కుట్ట జరుగుతుందన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే టీడీపీకి సహకరించిన ఏ అధికారిని వదలకుండా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజాస్వామ్య బద్ధంగా గెలవని ఎంపీటీసీ, జెడ్పీటీసీలు ఆ సీట్లో కూర్చోవడం సిగ్గుచేటన్నారు.


