సత్తెనపల్లి: ప్రముఖ సినీ నటుడు గిరిబాబు శుక్రవారం మృతి చెందడంతో ఆయనతో అనుబంధాన్ని స్థానిక ప్రముఖులు గుర్తుచేసుకున్నారు. ఆయనకు పల్నాడు జిల్లా సత్తెనపల్లితో ప్రత్యేక అనుబంధం ఉంది. 2015లో ప్రగతి కళామండలి రాష్ట్ర స్థాయి నాటిక పరిషత్ పోటీలకు ఆయన హాజరై ప్రగతి కళామండలి సత్కారం పొందారు. అప్పట్లో ప్రగతి కళా మండలి గౌరవ అధ్యక్షుడిగా నూతలపాటి సాంబయ్య, అధ్యక్షుడిగా సీనియర్ న్యాయవాది ఇరగంరెడ్డి ఎల్లారెడ్డి, కార్యదర్శిగా అబ్బూరి సత్యనారాయణ ఉన్నారు. ఆ సమయంలో సత్తెనపల్లి వచ్చిన గిరిబాబు పట్టణంలోని ఆర్‌అండ్‌బీ గెస్ట్‌హౌస్‌లో విశ్రాంతి తీసుకున్నారు. ఆయనను స్టేజీ నటులు యర్రా ఆదినారాయణ, పులహరి గోవిందులు ప్రత్యేకంగా కలిశారు. సత్తెనపల్లి మండలం కొమెరపూడి గ్రామానికి చెందిన యర్రా ఆదినారాయణ అంటే ఆయనకు ఎనలేని అభిమానం. గిరిబాబు ప్రత్యేకంగా సన్మానించారు. గిరిబాబు మృతి చెందాడన్న వార్త తెలియడంతో ప్రగతి కళామండలి బాధ్యులు, కళాకారులు ఆవేదన చెందారు. సత్తెనపల్లి ప్రగతి కళా మండలితో, ఈ ప్రాంత కళాకారులతో ఆయనకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. గిరిబాబు పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని, ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.


