ముగిసిన సెంట్రల్ జోన్ మహిళా వాలీబాల్ పోటీలు రెండు రోజులపాటు నిర్వహణ వర్సిటీ మహిళా కళాశాల జట్టు ఎంపిక
నరసరావుపేట రూరల్: జేఎన్టీయూ సెంట్రల్ జోన్ మహిళల అంతర కళాశాలల వాలీబాల్ పోటీల విన్నర్‌గా చీరాల సెయింట్ ఆన్స్ ఇంజినీరింగ్ కళాశాల, రన్నర్‌గా భీమవరం విష్ణు ఇంజినీరింగ్ కళాశాల జట్టు నిలిచాయి. తృతీయ బహుమతిని కందుకూరు ప్రకాశం ఇంజినీరింగ్ కళాశాల, బుడంపాడు సెయింట్ మేరీస్ ఇంజినీరింగ్ కళాశాల జట్లు సాధించాయి. తిరుమల ఇంజినీరింగ్ కళాశాలలో రెండు రోజులపాటు నిర్వహించిన జేఎన్టీయూ సెంట్రల్ జోన్ మహిళలు వాలీబాల్ పోటీలు, యూనివర్సిటీ జట్టు ఎంపిక పోటీలు శనివారం ముగిశాయి. 25 కళాశాలల నుంచి 300మంది క్రీడాకారిణులు పోటీలలో పాల్గొన్నారు. పోటీలు ఉత్సాహభరితంగా సాగాయి. హోరాహోరీగా సాగిన మ్యాచ్‌లో చీరాల సెయింట్ ఆన్స్ కళాశాల జట్టు ప్రథమ బహుమతిని సాధించింది. పోటీల అనంతరం నిర్వహించిన బహుమతి ప్రధానోత్సవ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా తిరుమల ఇంజినీరింగ్ కళాశాల కార్యదర్శి రావెల సత్యనారాయణ పాల్గొన్నారు. విజేతలుగా నిలిచిన జట్లుకు అభినందనలు తెలిపారు. పోటీల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరిని ఆయన ప్రశంసించారు. కార్యక్రమంలో వర్సిటీ అంతర కళాశాలల టోర్నమెంట్ కార్యదర్శి డాక్టర్ జీపీ రాజు, జట్టు ఎంపిక కమిటి సభ్యులు జి.లోహిత, కృష్ణ పాల్గొన్నారు.


