యడ్లపాడు: నిశ్శబ్దంగా ఉండే కొండవీడు ఘాట్ రోడ్డు బైక్‌ల గర్జనతో హోరెత్తింది. మోటోస్ట్రోమ్ ఆధ్వర్యంలో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న మోటోస్ట్రోమ్ వెర్టెక్స్ హిల్ కై ్లంబ్ రేస్ శనివారం ప్రారంభమైంది. కొండవీడును మోటార్‌స్పోర్ట్స్, అడ్వెంచర్ టూరిజం కేంద్రంగా తీర్చిదిద్దాలన్నది నిర్వాహకుల లక్ష్యం. రెండు రోజుల పాటు సాగనున్న ఈ మోటార్‌స్పోర్ట్స్ పోటీల్లో తొలిరోజు బైక్ రైడర్లు ఉత్సాహంగా బరిలోకి దిగారు. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి బైక్ రైడర్లు ఈ పోటీల్లో పాల్గొనేందుకు శనివారం తరలివచ్చారు. తొలిరోజు సుమారు 20 మంది బైక్ రైడర్లు ఉదయాన్నే కొండవీడుకు చేరుకున్నారు. అయితే, అటవీశాఖ అనుమతులు లభించకపోవడంతో సాయంత్రం వరకు ఘాట్‌రోడ్డు చెక్‌పోస్టు వద్దే నిరీక్షించాల్సి వచ్చింది. సందర్శకుల వాహనాలను ఘాట్‌రోడ్డు చెక్‌పోస్టు వరకు మాత్రమే అనుమతిస్తున్నారు. అక్కడి నుంచి కొండపైకి వెళ్లేందుకు అనుమతి లేదని అధికారులు స్పష్టం చేశారు. నరసరావుపేట రేంజ్ ఆఫీసర్ దేవరకొండ వెంకటరమణ, కొండవీడు బీట్ ఆఫీసర్ వెంకటేశ్వరరావు, నకిరేకల్ డీఆర్వో వీవీఎల్ నాయుడు పోటీలను పర్యవేక్షించారు.


