వైఎస్సార్ సీపీ పల్నాడు జిల్లా అధ్యక్షురాలు డాక్టర్ గీతా హసంతి
సత్తెనపల్లి: మహిళలు, తల్లులపై వ్యక్తిత్వ హననానికి పాల్పడుతూ ఆంధ్రప్రదేశ్‌ను అత్యంత దారుణమైన పరిస్థితిలోకి నెట్టారని వైఎస్సార్ సీపీ మహిళా విభాగం పల్నాడు జిల్లా అధ్యక్షురాలు డాక్టర్ గీతా హసంతి ఆవేదన వ్యక్తం చేశారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో శనివారం ఆమె ఓ వీడియోను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విడాకుల విషయంపై సోషల్ మీడియాలో వివిధ రకాలుగా చర్చలు జరుగుతున్నాయన్నారు. ఈ విషయంలో ప్రతి ఒక్కరూ హుందాగా వ్యవహరించాలని, ఎవరూ దీనిపై స్పందించవద్దని వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారన్నారు. ఆ ఆదేశాలకు కట్టుబడి ఎలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయలేదన్నారు. కానీ, ఇప్పుడు ఏం జరుగుతోందని ఆమె ప్రశ్నించారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో మహిళలపై వికృతమైన దాడి జరిగిందన్నారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సతీమణి వైఎస్ భారతి, ఆయన చెల్లెలు వైఎస్ షర్మిలతో పాటు పలువురిపై దాడికి దిగారన్నారు. ఈ చర్యలను ప్రతి ఒక్కరూ పార్టీలకు అతీతంగా ఖండించాలన్నారు. ప్రజలంతా గమనిస్తున్నారని, సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోవడం ఖాయమన్నారు. అందుకు కొంత సమయం వేచి చూడాల్సి ఉందన్నారు.


