పార్టీ కోసం కష్టపడ్డ ప్రతి ఒక్కరికీ తగిన గుర్తింపు | - | Sakshi
Sakshi News home page

పార్టీ కోసం కష్టపడ్డ ప్రతి ఒక్కరికీ తగిన గుర్తింపు

Nov 14 2026 3:34 AM | Updated on Nov 14 2026 3:34 AM

● మాజీ మంత్రి విడదల రజిని ● మున్సిపల్‌ కౌన్సిలర్‌ అభ్యర్థులతో సమీక్ష సమావేశం

చిలకలూరిపేట: కష్టకాలంలో పార్టీ కోసం అండగా నిలిచిన ప్రతి కార్యకర్తకు అండగా ఉంటామని వైఎస్సార్‌ సీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి, మాజీ మంత్రి విడదల రజిని చెప్పారు. పట్టణంలోని ఎన్‌ఆర్‌టీ రోడ్డులో ఉన్న మాజీ మంత్రి నివాస ప్రాంగణంలో మున్సిపల్‌ ఎన్నికల్లో పోటీ చేసిన కౌన్సిలర్‌ అభ్యర్థులతో సమీక్షా సమావేశం శుక్రవారం నిర్వహించారు. పట్టణంలోని 48 వార్డుల్లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ తరఫున పోటీ చేసిన అభ్యర్థులు, బూత్‌ ఏజెంట్లు పాల్గొన్నారు. ఎన్నికల ప్రక్రియలో చోటుచేసుకున్న పరిణామాలను అభ్యర్థులు, బూత్‌ ఏజెంట్లు విడదల రజినికి వివరించారు. రజిని మాట్లాడుతూ చిలకలూరిపేట మున్సిపల్‌ ఎన్నికల్లో టీడీపీ అరాచకాలకు, దౌర్జన్యాలకు అడ్డూ అదుపూ లేకుండా పోయిందని మండిపడ్డారు. పోలీసుల అండతో బూత్‌ ఏజెంట్లను పోలింగ్‌ కేంద్రాల నుంచి బయటకు లాగి, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థులను బెదిరించి, అధికారాన్ని అడ్డుపెట్టుకుని అన్ని రకాలుగా అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని విమర్శించారు. ఇన్ని అరాచకాలు చేసి సాధించిన గెలుపు మీ గొప్పతనం కాదు.. ప్రజల మనసులు గెలుచుకున్న గెలుపు అంతకన్నా కాదని అన్నారు. ఈ ఎన్నికల్లో ఫలితాల పరంగా ఓటమిని ఎదుర్కొన్నప్పటికీ, నైతికంగా వైఎస్సార్‌ సీపీ అభ్యర్థులే విజయం సాధించారన్నారు. పదవులు, అధికారాలు తాత్కాలికమని, ప్రజల కోసం నిలబడే నాయకత్వం, కార్యకర్తల నిబద్ధత శాశ్వతమని అన్నారు. ఈ పోరాటంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు చూపించిన ధైర్యాన్ని, తెగువను ఎప్పటికీ మర్చిపోనని, కష్టకాలంలో పార్టీ కోసం నిలిచిన ప్రతి ఒక్కరికీ అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. ప్రజల మనసుల్లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఉందని, పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై ప్రజలకు అభిమానం, విశ్వాసం ఉన్నాయని చెప్పారు. పార్టీ కోసం కష్టపడిన ప్రతి ఒక్కరికీ రానున్న మన ప్రభుత్వంలో తగిన గుర్తింపు, మంచి అవకాశాలు కల్పిస్తానని హామీ ఇచ్చారు.

అభివృద్ధి శూన్యం....

అభివృద్ధి పేరుతో ప్రజలకు అధికార పార్టీ చూపిస్తున్న ప్రగతి ఏమిటని ప్రశ్నించారు. పేకాట క్లబ్బుల నిర్వహణ, అసాంఘిక కార్యకలాపాలకు ప్రోత్సాహం ఇవ్వడమే వీళ్ల అభివృద్ధికి నమూనానా? అని నిలదీశారు. ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించడం, పట్టణాన్ని అభివృద్ధి పథంలో నడిపించడం పక్కనపెట్టి, అధికారాన్ని అడ్డుపెట్టుకుని అరాచకాలు, దౌర్జన్యాలకు పాల్పడటమే పరిపాలన విధానంగా మారిందని విమర్శించారు. ఓటమి భయంతోనే టీడీపీ నిష్పక్షపాత ఎన్నికలకు భయపడి, అధికార దుర్వినియోగానికి పాల్పడిందని విమర్శించారు. 2029 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీకి తగిన సమాధానం చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని స్పష్టం చేశారు. అనంతరం అన్ని 48 వార్డుల్లో పార్టీ తరఫున పోటీ చేసిన అభ్యర్థులను విడదల రజిని సత్కరించి అభినందించారు. కార్యక్రమంలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ చిలకలూరిపేట పట్టణ అధ్యక్షుడు షేక్‌ దరియావలి, పార్టీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు కందుల శ్రీకాంత్‌, కౌన్సిలర్లు పోతుల దీపిక, సుదర్శనం సుమలత తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement