ఎమ్మెల్యే జీవీకి బొల్లా బ్రహ్మనాయుడు డిమాండ్ పోలీసులు రెడ్‌బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నారని ఆగ్రహం జిల్లా ఎస్పీ, జిల్లా కలెక్టర్ ఫోన్ కాల్ కూడా ఎత్తడం లేదని ధ్వజం
వినుకొండ: నియోజకవర్గంలో జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ తీరుపై మాజీ శాసనసభ్యుడు బొల్లా బ్రహ్మనాయుడు మండిపడ్డారు. కూటమి ప్రభుత్వంపై, ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు తీరుపై, పోలీసు యంత్రాంగంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ప్రజాబలం ఉంటే పోలీసుల జోక్యం లేకుండా పంచాయతీ ఎన్నికలను ప్రజాస్వామ్యబద్ధంగా నిర్వహించాలని ఆయన ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులుకు సవాల్ విసిరారు. స్థానిక వైఎస్సార్ సీపీ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ... మున్సిపాలిటీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో ప్రతిపక్ష అభ్యర్థులను కనీసం నామినేషన్లు కూడా వేయనివ్వకుండా అడ్డుకున్నారని ఆరోపించారు. తాను వినుకొండలో ఉంటే మున్సిపాలిటీ ఎన్నికల్లో ప్రతిపక్ష అభ్యర్థులు గెలుస్తారనే భయంతోనే ఎమ్మెల్యే ఆంజనేయులు తనను అక్రమంగా హౌస్ అరెస్ట్ చేయించి నరసరావుపేటకు పంపించారని అన్నారు. తన సొంత ఇంటి బెడ్‌రూమ్‌లోకి పది మంది సీఐలు, ఎస్‌ఐలను పంపించి ఇబ్బందులకు గురిచేశారని మండిపడ్డారు. ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహిస్తే కూటమికి కనీసం రెండు సర్పంచ్ స్థానాలు కూడా రావని ఆయన అభిప్రాయపడ్డారు.
పోలీసుల తీరుపై ఆగ్రహం
వినుకొండ సీఐ ప్రభాకర్‌రావు అధికార పార్టీకి తొత్తుగా మారి సర్పంచ్ అభ్యర్థులను కౌన్సెలింగ్ పేరుతో బెదిరిస్తున్నారని ఆరోపించారు. కావాలంటే ఖాకీ దుస్తులు వదిలి తెలుగుదేశం పార్టీ తరఫున ఎన్నికల్లో పోటీ చేసి తనను ఓడించాలని సీఐకి సవాల్ విసిరారు. బొల్లాపల్లి, ఈపూరు, నూజెండ్ల, శావల్యాపురం రూరల్ మండలాల్లో పోటీ చేయాలనుకునే వారికి పోలీసులు ఫోన్లు చేసి బెదిరిస్తున్నారని, నామినేషన్లు వేస్తే స్టేషన్‌కు పిలిపించి ఇబ్బందులకు గురిచేస్తామని హెచ్చరిస్తున్నారని ఆయన ఆరోపించారు. అర్ధరాత్రి వేళల్లో గ్రామాల్లోకి పోలీసులను పంపించి రైతులను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని తెలిపారు. దొండపాడుకు చెందిన వారిని స్టేషన్‌కు పిలిపించి పోటీ నుంచి తప్పుకొంటామని చెబితేనే వదిలిపెట్టారని పేర్కొన్నారు.
రెడ్‌బుక్ పాలన...
రాష్ట్రంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ రాజ్యాంగాన్ని పక్కనపెట్టి రెడ్‌బుక్ పాలన సాగిస్తున్నారని బొల్లా బ్రహ్మనాయుడు విమర్శించారు. బైండోవర్ కేసులు పెట్టి, పోలీసుల సహాయంతో రిగ్గింగ్ చేసుకుని ఏకగ్రీవాలు చేసుకున్నారని ఆరోపించారు. ఈ అక్రమాలపై ఫిర్యాదు చేసేందుకు మాజీ ఎమ్మెల్యేగా తాను పల్నాడు జిల్లా ఎస్పీకి, జిల్లా కలెక్టర్‌కు ఫోన్ చేసినా కనీస స్పందన లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికై నా ముఖ్యమంత్రి చంద్రబాబు, ఎమ్మెల్యే ఆంజనేయులు తమ వైఖరిని మార్చుకుని పోలీసుల జోక్యం లేకుండా ప్రజాస్వామ్యబద్ధంగా పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ పంచాయతీ విభాగం రాష్ట్ర కార్యదర్శి పగడాల వెంకటరామిరెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి ఎంఎన్ ప్రసాదు, పట్టణ కన్వీనర్ కొత్తమాసు శివతో పాటు పలువురు పార్టీ నాయకులు పాల్గొన్నారు.


