ప్రకృతి వ్యవసాయంతో విపత్తులను ఎదుర్కోవచ్చు | - | Sakshi
Sakshi News home page

ప్రకృతి వ్యవసాయంతో విపత్తులను ఎదుర్కోవచ్చు

Nov 14 2026 3:34 AM | Updated on Nov 14 2026 3:34 AM

పెదకూరపాడు: వాతావరణ మార్పులు, ఎల్‌నినో ప్రభావం, అకాల వర్షాలు, బెట్ట పరిస్థితులను తట్టుకుని పంటలను కాపాడుకోవాలంటే ప్రకృతి వ్యవసాయమే సరైన మార్గమని పల్నాడు జిల్లా ప్రకృతి వ్యవసాయ జిల్లా ప్రాజెక్టు మేనేజర్‌ కె.అమలకుమారి అన్నారు. రైతులు రసాయనిక ఎరువులు, పురుగుమందులపై ఆధారపడకుండా ప్రకృతి వ్యవసాయ పద్ధతులను ఆచరించి సాగు పెట్టుబడులను తగ్గించుకోవాలని పిలుపునిచ్చారు. పెదకూరపాడు మండల కేంద్రంలో శుక్రవారం ఆత్మ సౌజన్యంతో జిల్లా వనరుల కేంద్రంలో నిర్వహించిన రైతు శిక్షణ కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఈ ఏడాది ఎల్‌నినో ప్రభావంతో వర్షపాతం తగ్గే పరిస్థితులు ఉన్నందున రైతులు ముందస్తు ప్రణాళికతో సాగు చేపట్టాలని సూచించారు. ప్రతి రైతూ సీడ్‌ పెలెట్స్‌ విధానాన్ని అనుసరించాలని, విత్తనాలను ప్రకృతి సిద్ధమైన పదార్థాలతో పెలెట్స్‌గా తయారు చేసి సుమారు 400 కిలోల ఘనజీవామృతంతో కలిపి పొలంలో విత్తు కోవాలని సూచించారు. అంతర పంటల సాగుకు ప్రాధాన్యమివ్వాలని, భూమి ఖాళీగా కనిపించకుండా పంటలతో కప్పి ఉంచాలని సూచించారు. దీనివల్ల నేలలో తేమ నిల్వ ఉండటంతోపాటు సేంద్రియ కర్బనం పెరిగి భూసారం మెరుగుపడుతుందన్నారు. ప్రధాన పంటతోపాటు అంతర పంటల ద్వారా అదనపు ఆదాయం పొందవచ్చని తెలిపారు. డాట్‌ సెంటర్‌ ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్‌ పి.వి.సత్యగోపాల్‌ మాట్లాడుతూ జీవన ఎరువులు, జీవ శిలీంధ్రనాశినుల వినియోగంతో సాగు ఖర్చులు తగ్గించుకోవడంతోపాటు నాణ్యమైన దిగుబడులు పొందవచ్చన్నారు. ప్రకృతి వ్యవసాయ రైతు దర్శి శేషారావు సాగు చేస్తున్న మిరప పొలాన్ని అధికారులు సందర్శించారు. రైతులకు అగ్నాస్త్రం పంపిణీ చేశారు. కార్యక్రమంలో జిల్లా అదనపు ప్రాజెక్టు మేనేజర్‌ ప్రేమ్‌రాజ్‌, జిల్లా సిబ్బంది సైదయ్య, అప్పలరాజు, శ్రీవల్లి, మండల ప్రకతి వ్యవసాయ సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.

డీపీఎం కె.అమలకుమారి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement