పల్లెపోరులోనూ అదే కుట్ర | - | Sakshi
Sakshi News home page

పల్లెపోరులోనూ అదే కుట్ర

Nov 13 2026 4:11 AM | Updated on Nov 13 2026 4:11 AM

● కూటమి ప్రభుత్వ తీరుపై అనుమానాలు ● సర్పంచ్‌ ఎన్నికల్లో ఏకగ్రీవాల ఎత్తుగడలు ● స్వేచ్ఛాయుత ఎన్నికల నిర్వహణపై తప్పని సందేహాలు

టాస్క్‌ఫోర్స్‌: చిలకలూరిపేట నియోజకవర్గంలో గ్రామ పంచాయతీ ఎన్నికల నగారా మోగడంతో పల్లెల్లో రాజకీయ వేడి మొదలైంది. దీనికంటే ముందే బెదిరింపులు, ఒత్తిళ్లు, ఏకగ్రీవాలకు కుట్రకు కూటమి సర్కార్‌ తెగబడుతుందనే ఆందోళన నెలకొంది. గత స్థానిక సంస్థల ఎన్నికల్లో అనుసరించిన వ్యూహాలనే ఇప్పుడు సర్పంచ్‌ ఎన్నికల్లోనూ అమలు చేసేందుకు అధికార కూటమి నేతలు ప్రయత్నిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. టీడీపీ నాయకులు ఏకగ్రీవాలు చేసేందుకు గత ఎన్నికల మాదిరిగానే వ్యవహరించాలని, తమ వల్ల కాకపోతే పోలీసుల సాయం తీసుకోవాలని నియోజకవర్గ ప్రజాప్రతినిధి హుకుం జారీ చేసినట్లు విశ్వసనీయ సమాచారం. ప్రతిపక్షం బలపరిచిన అభ్యర్థుల నామినేషన్లను అడ్డుకుంటామని, కాదని నామినేషన్లు వేస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించడం, పరిశీలన దశలో నామపత్రాలు తిరస్కరింపజేస్తామంటూ బెదిరింపులకు దిగుతున్నారనే ఆరోపణలు స్థానికంగా చర్చనీయాంశమయ్యాయి. ఎన్నికలు స్వేచ్ఛగా జరిగితే వైఎస్సార్‌ సీపీ మద్దతుదారుల ఆధిపత్యం ఉంటుందన్న భయంతోనే ప్రత్యర్థులను ముందుగానే పోటీకి దూరం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని వైఎస్సార్‌ సీపీ వర్గాలు ఆరోపిస్తున్నాయి.

నియోజకవర్గంలో ఇలా..

చిలకలూరిపేట, నాదెండ్ల, యడ్లపాడు మండలాల్లో 52 గ్రామ పంచాయతీలు, 534 వార్డులు, అన్నే పోలింగ్‌ కేంద్రాలు ఉన్నాయి. మూడు మండలాల్లో మొత్తం 1,19,116 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 57,643 మంది పురుషులు, 61,471 మంది మహిళలు, మరో ఇద్దరు ఇతరులు ఉన్నారు. ఇందులో చిలకలూరిపేట మండలంలో 20 సర్పంచ్‌ స్థానాలు, 192 వార్డు సభ్యుల స్థానాలు, నాదెండ్ల మండలంలో 14 సర్పంచ్‌ స్థానాలు, 152 వార్డు సభ్యుల స్థానాలు, యడ్లపాడు మండలంలో 18 సర్పంచ్‌ స్థానాలు, 190 వార్డు సభ్యుల స్థానాలు ఉన్నాయి.

ప్రజాస్వామ్యబద్ధంగా జరిగేనా?

ఈ నేపథ్యంలో అభ్యర్థులకు భద్రత కల్పించడం, నామినేషన్ల నుంచి పోలింగ్‌ వరకు ప్రతి దశను నిష్పక్షపాతంగా నిర్వహించడం ఎన్నికల యంత్రాంగం ప్రధాన కర్తవ్యం. గ్రామీణ ప్రజాస్వామ్యానికి పునాదులైన పంచాయతీ ఎన్నికలు ఎలాంటి వివాదాలకు తావులేకుండా స్వేచ్ఛగా, పారదర్శకంగా జరిగేలా చూడాల్సిన బాధ్యత పోలీసులది. అయితే, ఈసారి జరిగే సర్పంచ్‌ ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీ అభ్యర్థులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పోటీ బరిలో నిలుస్తారా? ప్రజలు తమ ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకుంటారా? అనేది పల్లెల్లో ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. ప్రస్తుతం గ్రామాల్లో ఇదే చర్చ సాగుతోంది.

ప్రతిపక్ష అభ్యర్థి పేరు ఖరారు కాగానే వారిపై ఒత్తిళ్లు, వేధింపులకు పాల్పడ్డారు. నామినేషన్లు వేయకుండా అడ్డుకోవడం, ఎదిరిస్తే ప్రత్యర్థులపై దాడులు చేయడం వంటి ఘటనలు చోటుచేసుకున్నాయి. ఎన్నికల అధికారుల ముందే అభ్యర్థుల నుంచి నామపత్రాలు లాక్కొని చింపివేశారు. నామినేషన్లు వేస్తే వారిని ఎత్తుకెళ్లి బలవంతంగా ఉపసంహరణలు చేయించారు. పోలింగ్‌ రోజున ప్రతిపక్ష పార్టీ ఏజెంట్లను కూర్చోనీయకుండా భయపెట్టారు. వైఎస్సార్‌ సీపీ ముఖ్య నాయకులను పోలింగ్‌ రోజున పోలీసుల చేత నిర్బంధించడం, సైక్లింగ్‌ పద్ధతిలో పోలింగ్‌ కేంద్రాలకు మూకుమ్మడిగా వెళ్లి దొంగ ఓట్లు వేసుకోవడం.. ఇలా అనేక రూపాల్లో గెలుపు కోసం కూటమి నేతలు కుట్రలు, కుతంత్రాలకు పాల్పడ్డారు. ఇక అధికారులు నో డ్యూ పత్రాలు ఇచ్చేందుకు అందుబాటులో ఉండలేదు. పోలీసులు కూడా ఎన్‌వోసీలు ఇవ్వలేదు. 144 సెక్షన్‌ అంటూ పోలింగ్‌ కేంద్రాలకు రానివ్వలేదు. ఒకరిద్దరుగా వెళ్లిన ప్రతిపక్ష అభ్యర్థులను అడ్డుకున్న టీడీపీ మూకల నుంచి రక్షణ కల్పించలేదు. పైగా బైండోవర్‌ కేసులున్నాయంటూ భయభ్రాంతులకు గురిచేసిన ఘటనలను ప్రజలు ఇంకా మరువలేదు. ప్రతిపక్ష అభ్యర్థులకు రక్షణ కల్పించాల్సిన పరిస్థితి పోలీసులకు ఏర్పడినా, టీడీపీ కార్యకర్తలకే వైఎస్సార్‌ సీపీ కండువాలు కప్పి నామినేషన్లు వేయించిన కొత్త మోసం కలకలం రేపింది. నామినేషన్‌ హక్కు కల్పించాలని యడ్లపాడులో హైవేపై నిరసన తెలిపిన వారిపై పోలీసులు లాఠీచార్జి చేసి కేసులు నమోదు చేయడంతో పాటు, కొందరు ఊరు విడిచి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందన్న విమర్శలూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో సర్పంచ్‌ ఎన్నికల్లోనూ నామినేషన్ల దశ నుంచే ఒత్తిళ్లు, అడ్డంకులు ఎదురవుతాయేమోనని ప్రతిపక్ష మద్దతుదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement