పంచాయతీ ఎన్నికలకు పటిష్ట బందోబస్తు | - | Sakshi
Sakshi News home page

పంచాయతీ ఎన్నికలకు పటిష్ట బందోబస్తు

Nov 13 2026 4:11 AM | Updated on Nov 13 2026 4:11 AM

మద్యం మత్తులో డ్రైవర్‌పై దాడి

జిల్లా ఎస్పీ జగదీష్‌ అదహళ్లి

నరసరావుపేట రూరల్‌: పంచాయతీ ఎన్నికలను శాంతియుతంగా నిర్వహించేందుకు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేస్తున్నట్టు జిల్లా ఎస్పీ జగదీష్‌ అదహళ్లి తెలిపారు. పంచాయతీ ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లపై రాష్ట్ర ఎన్నికల కమీషనర్‌ అనిల్‌ చంద్ర పునేఠా గురువారం నిర్వహించిన వీడియో కాన్పరెన్స్‌లో జిల్లా ఎస్పీ పాల్గొన్నారు. ఎన్నికలు పూర్తి పారదర్శకంగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు పోలీస్‌ యంత్రాంగం సర్వసన్నద్దంగా ఉందని తెలిపారు. పోలింగ్‌ కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేశామని, సమస్యాత్మక గ్రామాలపై ప్రత్యేక నిఘా ఉంచి ఎన్నికల నియమావళిని ఉల్లఘించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రజలు భయాందోళనలు లేకుండా నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఎస్పీ కోరారు.

మాచర్ల: ఇద్దరు డ్రైవర్లు బుధవారం రాత్రి మద్యం మత్తులో ఘర్షణ పడ్డారు. టిప్పర్‌ డ్రైవర్‌ రచ్చమల్ల నవీన్‌ తన తోటి డ్రైవర్‌ మల్లేపల్లి నాగేశ్వరరావుపై బ్లేడుతో దాడి చేసి మెడ ముందుభాగాన తీవ్రంగా గాయపరిచాడు. చావుబతుకుల్లో ఉన్న నాగేశ్వరరావును వెంటనే ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వైద్యులు చికిత్స చేసి అతని ప్రాణాన్ని కాపాడారు. రాయవరం గ్రామానికి చెందిన నవీన్‌, పెద్దవూరకు చెందిన నాగేశ్వరరావులు మాచర్ల ప్రాంతంలోని నేషనల్‌ హైవే ఎన్‌సీసీకి చెందిన సంస్థ వాహనాలకు డ్రైవర్ల్‌గా పనిచేస్తున్నారు. నవీన్‌ను వద్దని సంస్థ వారు చెప్పగా దీనికి నాగేశ్వరరావు కారణమని నవీన్‌ అతనిపై కక్ష కట్టారు. బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వారు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

మున్సిపల్‌ మాజీ చైర్మన్‌ గుప్తాపై భూకబ్జా ఆరోపణలు

ఆర్‌డీఓకు బాధితురాలి ఫిర్యాదు

నరసరావుపేట: మున్సిపల్‌ మాజీ చైర్మన్‌, ప్రస్తుత ఎన్నికల్లో టీడీపీ తరపున మరోసారి సీటుకోసం ప్రయత్నిస్తున్న నాగసరపు సుబ్బరాయగుప్తాపై ఓ మహిళ భూకబ్జా ఆరోపణలు చేశారు. ఈ మేరకు ఆర్‌డీఓ కె.బాలకృష్ణకు గురువారం ఆమె ఫిర్యాదు చేసింది. బాధితురాలు దుర్గా పార్వతి మీడియాతో మాట్లాడుతూ తమకు గడియారం స్థంభం వద్ద తన తండ్రి ద్వారా సంక్రమించిన స్థలం ఉందని, ఆ స్థలం విషయంతో తన సోదరుడితో వివాదం ఉందన్నారు. అయితే గుప్తా తన అన్నను పిలిచి బేరం పెట్టి బయానా ఇవ్వటం జరిగిందని, ఆ విషయం తెలిసి తాము తమ సోదరుడిని అడగ్గా అటువంటిదేమీలేదని అబద్ధం ఆడాడన్నారు. తమ వదిన బయానా తిరిగి ఇచ్చారన్నారు. తాము గుప్తాకు లీగల్‌ నోటీసులు పంపించామన్నారు. గుప్తా ఆ స్థలాన్ని 2019లో రిజిస్ట్టర్‌ చేయించుకున్నారన్నారు. తాము కోర్టుకు వెళ్లగా కోర్టు నుంచి గుప్తాకు రెండుసార్లు నోటీసులు వెళ్లాయన్నారు. 2019 కార్తిక మాసంలో ఆ స్థలంలో గుప్తా శంకుస్థాపన చేస్తుండగా తాము అడ్డుకున్నామన్నారు. ఈ స్థలంతో సంబంధం లేదని తమను అక్కడి నుంచి బలవంతంగా పంపించేశారన్నారు. ఇంటికి వెళితే కనీసం తలుపులు కూడా తీయలేదన్నారు. అప్పటి నుంచి వివాదం కొనసాగుతూనే ఉందన్నారు. తమ స్థలాన్ని గుప్తా చెర నుంచి విడిపించి తమకు న్యాయం చేయాలని కోరారు.

విద్యుదాఘాతంతో

వ్యక్తి మృతి

ఈపూరు: ఈపూరు మండలం దుష్మాన్‌పేట తండాలో విద్యుదాఘాతంతో ఓ వ్యక్తి మృతి చెందాడు. తండాకు చెందిన వడితే రమేష్‌ నాయక్‌ మోటార్‌ స్విచ్‌ ఆన్‌ చేస్తుండగా ప్రమాదవశాత్తూ విద్యుత్‌ షాక్‌కు గురై అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు రమేష్‌ నాయక్‌కు భార్యతోపాటు ఇద్దరు కుమారులు ఉన్నారు. కుటుంబానికి పెద్ద దిక్కుగా ఉన్న ఆయన మరణంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. సమాచారం అందుకున్న విద్యుత్‌ శాఖ ఏఈ ఎస్‌ గాంధీబాబు ప్రమాద స్థలాన్ని పరిశీలించారు. పోలీసులు సంఘటన ప్రాంతాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు.

సర్పంచ్‌ పదవికి

టీడీపీ నాయకుల వేలం

– రూ.81 లక్షలు పలికిన ధర

నరసరావుపేట రూరల్‌: మండలంలోని జొన్నలగడ్డ గ్రామంలో సర్పంచ్‌ పదవికి గురువారం రాత్రి టీడీపీ నాయకులు వేలం నిర్వహించారు. పోటాపోటీగా జరిగిన వేలంలో యర్రా శ్రీనివాసరావు రూ.81 లక్షలకు పాట దక్కించుకున్నారు. సర్పంచ్‌ పదవి కోసం మొత్తం ముగ్గురు పోటీ పడ్డారు. కొరిటాల గోపాలరావు రూ.77 లక్షలు చెల్లించేందుకు సిద్ధపడ్డారు. చివరకు శ్రీనివాసరావు పాట దక్కించుకున్నారు. ఆయనను సర్పంచ్‌ అభ్యర్థిగా పోటీలో నిలపాలని గ్రామ పెద్దలు నిర్ణయించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement