● పెండింగ్ బిల్లుల పేరుతో ఆటోమేటిక్‌గా విద్యుత్ కట్ ● నవంబర్ నుంచి అమల్లోకి నూతన విధానం ● సమాచారం ఇవ్వకుండా సరఫరా నిలిపివేతపై ఆగ్రహం
నూజెండ్ల: విద్యుత్ శాఖ ఏర్పాటు చేసిన స్మార్ట్ మీటర్లు వినియోగదారులను షాక్‌కు గురిచేస్తున్నాయి. ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండానే ఈ నెల 10వ తేదీన బకాయిల పేరుతో 106 మీటర్లకు విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. పట్టణాల్లో అమలవుతున్న ఈ విధానాన్ని గ్రామాల్లోనూ అమలు చేయడంతో దుకాణదారులు, చేతివృత్తుల వారు, చిన్నపాటి కుటీర పరిశ్రమల నిర్వాహకులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. విద్యుత్‌పై ఆధారపడి వ్యాపారాలు నిర్వహించే వారికి ఈ విధానం తీవ్ర ఆర్థిక నష్టాన్ని కలిగిస్తోంది. మండలంలో 430 స్మార్ట్ మీటర్లు ఉన్నాయని అధికారులు తెలిపారు.
సమాచారం ఇవ్వకుంటే ఎలా...?
సెల్‌ఫోన్లకు ఎస్‌ఎంఎస్ లేదా ఇతర మార్గాల ద్వారా సమాచారం ఇవ్వకుండా విద్యుత్ సరఫరా నిలిపివేయడంపై వినియోగదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటివరకు విద్యుత్ సిబ్బంది గ్రామాలకు వచ్చి బిల్లులు వసూలు చేసేవారు. రాబోయే రోజుల్లో డిజిటల్ చెల్లింపులకు ప్రజలు అలవాటు పడటానికి కొంత సమయం పట్టే అవకాశం ఉంది. ఆన్‌లైన్ విధానంలో బిల్లులు చెల్లించడం అందరికీ సాధ్యపడకపోవచ్చని కొందరు అభిప్రాయపడుతున్నారు. వినియోగదారులకు ఎలాంటి అవగాహన కల్పించకుండా విద్యుత్ సరఫరా నిలిపివేయడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
పునరుద్ధరణలోనూ జాప్యమే...
విద్యుత్ సరఫరా నిలిచిపోయిన వినియోగదారులు బిల్లులను తప్పనిసరిగా ఆన్‌లైన్ ద్వారా లేదా కార్యాలయంలో చెల్లించాల్సి ఉంది. యూపీఐ చెల్లింపులపై అందరికీ అవగాహన లేకపోవడం కొంత సమస్యగా మారనుంది. కొంతమంది మొబైల్ ఫోన్లలో మీటర్ స్థితి, దాని వివరాలు కనిపించడం లేదని వాపోతున్నారు. కార్యాలయంలో నేరుగా బిల్లు చెల్లించినా వెంటనే విద్యుత్ సరఫరా పునరుద్ధరణ జరగదని అధికారులు చెబుతున్నారని వినియోగదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వినియోగదారులకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించకుండా ప్రభుత్వం ఈ విధానాన్ని అమల్లోకి తీసుకురావడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం సంబంధిత శాఖాధికారులు ప్రత్యామ్నాయ మార్గాలు చూపాలని కోరుతున్నారు. ఈ సమస్యపై అసిస్టెంట్ ఇంజనీర్ సీహెచ్ కొండలు మాట్లాడుతూ.. మండల పరిధిలో స్మార్ట్ మీటర్లు కలిగిన వినియోగదారుల నుంచి రూ.6 లక్షల బకాయిలు రావాల్సి ఉందన్నారు. ఇందులో భాగంగా కేంద్ర కార్యాలయం నుంచి అటువంటి వినియోగదారులకు నేరుగా విద్యుత్ సరఫరా నిలిపివేయడం జరిగిందని తెలిపారు. విద్యుత్ సరఫరా నిలిచిపోయిన వినియోగదారులు బకాయిలు చెల్లిస్తేనే తిరిగి సరఫరాను పునరుద్ధరించడం సాధ్యమవుతుందని స్పష్టం చేశారు.


