● మాజీ మంత్రి విడదల రజిని ● వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలతో సమావేశం
చిలకలూరిపేట: గ్రామ పంచాయతీ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల విజయమే లక్ష్యంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని మాజీ మంత్రి విడదల రజిని పిలుపునిచ్చారు. చిలకలూరిపేట పట్టణంలోని మాజీ మంత్రి నివాస ప్రాంగణంలో పంచాయతీ ఎన్నికల సన్నాహక సమావేశం బుధవారం నిర్వహించారు. ఈ సమావేశంలో పార్టీ నాయకులు, ముఖ్య కార్యకర్తలు పాల్గొని రానున్న ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, కార్యాచరణపై విస్తృతంగా చర్చించారు. రజిని మాట్లాడుతూ రానున్న పంచాయతీ ఎన్నికలను పార్టీ శ్రేణులు ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని, ప్రతి గ్రామంలో పార్టీని మరింత బలోపేతం చేయడంతో పాటు ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. చిలకలూరిపేట, నాదెండ్ల, యడ్లపాడు మండలాల్లోని ప్రతి గ్రామంలో నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేస్తూ ఎన్నికలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.
అరాచక రాజకీయాలు...
ఇటీవల జరిగిన మున్సిపల్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల సందర్భంగా టీడీపీ అధికారాన్ని అడ్డుపెట్టుకుని నియోజకవర్గంలో అరాచక రాజకీయాలకు పాల్పడిందని విమర్శించారు. ఎంపీటీసీ ఎన్నికల సమయంలో నామినేషన్లు దాఖలు చేయడానికి వెళ్లిన వైఎస్సార్ సీపీ అభ్యర్థులను నామినేషన్ కేంద్రాల వద్ద టీడీపీకి చెందిన వారు అడ్డుకుని, నామినేషన్లు వేయకుండా ఆటంకాలు సృష్టించారని గుర్తు చేశారు. మున్సిపల్ ఎన్నికల సందర్భంగా పోలింగ్ బూత్‌ల వద్ద రౌడీ మూకలతో దాడులు చేయించి వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలపై భౌతిక దాడులకు పాల్పడుతూ వారిని భయభ్రాంతులకు గురిచేశారని, రిగ్గింగ్, దొంగ ఓట్లతో గెలిచారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికార పార్టీ పోలీసు యంత్రాంగాన్ని తమ రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకుంటూ ప్రతిపక్ష నాయకులు, కార్యకర్తలపై ఒత్తిళ్లు, బెదిరింపులకు పాల్పడిందని విమర్శించారు. ఎన్నికల్లో ప్రజల మద్దతుతో గెలవాల్సిన పార్టీ, అధికార బలాన్ని ఉపయోగించుకుని ప్రతిపక్షాన్ని అణచివేయాలని చూడటం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని అన్నారు. ఇలాంటి దాడులు, బెదిరింపులు, అడ్డంకుల ద్వారా నియోజకవర్గంలో ఒక చెడు రాజకీయ సంస్కృతికి తెరలేపారని ఆవేదన వ్యక్తం చేశారు.
గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని...
గత ఎన్నికల్లో ఎదురైన అనుభవాలను దృష్టిలో పెట్టుకుని రానున్న పంచాయతీ ఎన్నికల్లో పార్టీ శ్రేణులు మరింత అప్రమత్తంగా ఉండాలని, ఎలాంటి బెదిరింపులకు, ప్రలోభాలకు భయపడకుండా ఐక్యంగా ముందుకు సాగాలని సూచించారు. ఎన్నికల సంఘం, పోలీసు అధికారులు ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గకుండా వ్యవహరించి, అన్ని పార్టీల అభ్యర్థులకు సమాన అవకాశాలు కల్పిస్తూ రానున్న పంచాయతీ ఎన్నికలను స్వేచ్ఛగా, ప్రశాంతంగా, నిష్పక్షపాతంగా నిర్వహించాలని కోరారు. ప్రజల అండదండలతో, కార్యకర్తల ఐక్యతతో పంచాయతీ ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ సత్తా చాటుదామని, ప్రజల పక్షాన నిలబడి ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం పోరాడుదామని విడదల రజిని స్పష్టం చేశారు.


