నరసరావుపేట ఈస్ట్: స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి ప్రభుత్వ అక్రమాలు, దౌర్జన్యాలను నిరసిస్తూ బుధవారం వామపక్ష పార్టీల ఆధ్వర్యాన పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. ఆయా పార్టీల నాయకులు మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజాస్వామ్య విలువలను కూటమి ప్రభుత్వం తుంగలో తొక్కిందని దుయ్యబట్టారు. కూటమి పార్టీల నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడి కమ్యూనిస్టు పార్టీలతో సహా ప్రతిపక్షాలను నామినేషన్లు వేయకుండా అడ్డుకున్నారని విమర్శించారు. నామినేషన్లు దాఖలు, విత్‌డ్రాలు, స్క్రూటీనీ, పోలింగ్, ఓట్లు లెక్కింపు ఇలా ప్రతి దశలోనూ అధికార బలంతో ప్రజాస్వామ్యాన్ని కాలరాసారని తెలిపారు. కమ్యూనిస్టులు పోటీ చేస్తే ఫ్యాక్షనిజం పెరుగుతుందని ఎమ్మెల్యేలు వ్యాఖ్యానించటం దారుణమన్నారు. చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో రెడ్‌బుక్ రాజ్యాంగాన్ని అమలు పరుస్తూ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నదని విమర్శించారు. రాజ్యాంగ పరిరక్షణ, ప్రజాస్వామ్య రక్షణకు రాజీ లేని సుధీర్ఘ పోరాటం చేపట్టాల్సిన పరిస్థితులు ఏర్పాడ్డాయని తెలిపారు. కార్యక్రమంలో సీపీఐ నాయకులు కాసా రాంబాబు, చక్రవరం సత్యనారాయణరాజు, ఉప్పలపాటి రంగయ్య, సీపీఎం నాయకులు ఎస్.ఆంజనేయులు, డి.శివకుమారి, పచ్చ రామారావు, వెంకటేశ్వరరాజు తదితరులు పాల్గొన్నారు.
ఎన్నికల అక్రమాలకు నిరసనగా వామపక్షాల ర్యాలీ


