చోరీకి పాల్పడిన నిందితుడి అరెస్ట్‌ | - | Sakshi
Sakshi News home page

చోరీకి పాల్పడిన నిందితుడి అరెస్ట్‌

Nov 11 2026 1:13 AM | Updated on Nov 11 2026 1:13 AM

చోరీకి పాల్పడిన నిందితుడి అరెస్ట్‌

55 గ్రాముల బంగారం స్వాధీనం వివరాలు వెల్లడించిన డీఎస్పీ సీతారామ్‌

పట్నంబజారు: నివాసంలో ఉండే యజమాని ఇంట్లోనే చోరీకి పాల్పడిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచారు. మంగళవారం లాలాపేట పోలీసు స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఈస్ట్‌ డీఎస్పీ తాండ్ర సీతారామ్‌, లాలాపేట పీఎస్‌ సీఐ శివప్రసాద్‌ వివరాలు మీడియాకు వెల్లడించారు. అహ్మద్‌ నగర్‌లో నివాసం ఉండే మొహమ్మద్‌ ఖైరున్నీసా కుటుంబంతో కలిసి గతనెల 25న ఆసుపత్రిలో చికిత్స పొందేందుకు విశాఖపట్నం వెళ్లారు. తిరిగి 23వ తేదీన వచ్చే సరికి ఇంటి తలుపులు పగులగొట్టి ఉండటం గమనించి లోపలకు వెళ్లి చూడగా, ఆభరణాలు చోరీకి గురైనట్లు గుర్తించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేశారు. సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా ఖైరున్నీసా నివాసంలో రెండో అంతస్తులో అద్దెకు ఉండే షేక్‌ మొహమ్మద్‌ రఫీ ఇంటి తాళాలు పగులగొట్టి చోరీకి పాల్పడినట్లు గుర్తించారు. చోరీకి పాల్పడి రాజస్థాన్‌లోని అజ్మీర్‌ వెళ్లి నిందితుడు అక్కడ తలదాచుకున్నట్లు పేర్కొన్నారు. సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా ఈనెల 9వ తేదీన నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు వివరించారు. సుమారు 153 గ్రాముల బంగారం, వెండి వస్తువులు, రూ.5 వేలు చోరీకి గురైన క్రమంలో నిందితుడిని 55 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నారు. మిగిలిన సొత్తు, ఆభరణాల కోసం కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. కొద్దిమేర బంగారాన్ని లాలాపేట పోలీసు స్టేషన్‌ పరిధిలోని ఫైనాన్స్‌ కార్యాలయంలో నిందితుడు రఫీ అత్త షేక్‌ అయేషా పర్విన్‌ పేరుతో తాకట్టుపెట్టిన బంగారాన్ని పోలీసులు మధ్యవర్తుల సమక్షంలో సురక్షితంగా స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ తెలిపారు. మిగిలిన ఆభరణాల కోసం దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. నిందితుడిని పట్టుకోవడంలోప్రతిభ కనబర్చిన ఎస్‌ఐ వెంకట్రావు, హెడ్‌ కానిస్టేబుల్‌ కళ్యాణ్‌, కానిస్టేబుళ్లు టి.శంకర్‌, పి.కిరణ్‌లను అభినందించారు.

రైళ్లలో చోరీలకు పాల్పడుతున్న వ్యక్తి అరెస్ట్‌

తెనాలిరూరల్‌/లక్ష్మీపురం: రైలు ప్రయాణికులను లక్ష్యంగా చేసుకుని నిద్రిస్తున్న సమయంలో ల్యాప్‌టాప్‌లు, ఇతర ఎలక్ట్రానిక్‌ వస్తువులను చోరీ చేస్తున్న అంతర్‌జిల్లా దొంగను తెనాలి రైల్వే పోలీసులు అరెస్ట్‌ చేశారు. నిందితుడి వద్ద నుంచి మూడు ల్యాప్‌టాప్‌లు, ఒక రెడ్‌ మీ ట్యాబ్‌ను స్వాధీనం చేసుకున్నారు. తెనాలి జీఆర్పీ ఎస్‌ఐ సరస్వతితో కలసి మంగళవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో వివరాలను రైల్వే డీఎస్పీ పి.అక్కేశ్వరరావు వెల్లడించారు. కర్నూలు జిల్లా నంద్యాల మండలం కానాల గ్రామానికి చెందిన కై తేపల్లి హరీష్‌ సోమవారం ఉదయం తెనాలి రైల్వే స్టేషన్‌లో పోలీసుల చూసి పారిపోయేందుకు ప్రయత్నించాడు. అదుపులోకి తీసుకుని విచారించారు. ఈ క్రమంలో రైళ్లలో ప్రయాణికులు గాఢనిద్రలో ఉన్న సమయంలో వారి ల్యాప్‌టాప్‌ బ్యాగులు, సెల్‌ఫోన్లు, ఇతర విలువైన వస్తువులను అపహరిస్తున్నట్లు వెల్లడైంది. నవంబర్‌ 6, 7 తేదీల మధ్య అర్ధరాత్రి జీటీ ఎక్స్‌ప్రెస్‌ స్టేషన్‌కు చేరుకున్న సమయంలో బీ–5 కోచ్‌లో ప్రయాణిస్తున్న ఓ ప్రయాణికుడి ల్యాప్‌టాప్‌ను చోరీ చేసినట్లు విచారణలో తేలింది. తిరుపతి–చర్లపల్లి రైలు, విశాఖపట్నం– తిరుపతి స్పెషల్‌ ఎక్స్‌ప్రెస్‌తోపాటు ఒంగోలు– తెనాలి మార్గాల్లోనూ చోరీలకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. నిందితుడి నుంచి హెచ్‌పీ విక్టస్‌తో సహా మొత్తం మూడు ల్యాప్‌టాప్‌లు, ఒక రెడ్‌మీ ట్యాబ్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసును డీఎస్పీ పర్యవేక్షణలో ఇన్‌స్పెక్టర్‌ పి.నరసింహారావు, జీఆర్‌పీ ఎస్‌ఐలు ఎల్‌.సరస్వతి, డాక్టర్‌ ఎం.రాజమోహన్‌రావు కలిసి ఛేదించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement