మొత్తం కట్టుడే...
నామినేషన్‌కు నో డ్యూ సర్టిఫికెట్ తప్పనిసరి ఇంటి పన్నులు, కరెంట్ బిల్లులు చెల్లిస్తున్న ఆశావహులు బ్యాంకుల్లో పాత అప్పులు కూడా క్లియర్ కార్యాలయాలు, బ్యాంకుల చుట్టూ పరుగులు ఎట్టకేలకు ఎన్నికలతో నిండుతున్న ఖజానా జిల్లాలో 512 పంచాయతీలకు ఎన్నికలు తొలి విడత, చివరి విడతలో మార్పులు తొలివిడతలో 173, చివరి విడతలో 189 పంచాయతీలకు ఎన్నికలు
సత్తెనపల్లి: ఒరేయ్ వెంకన్న నీ ఇంటి పన్ను కడుతారా.. అరే మామ నీ కరంటు బిల్లు మొత్తం క్లియర్ చేస్తా .. అరే బామ్మర్ది బ్యాంకులో ఎంతో కొంత అప్పు ఉన్నా .. నేను చెల్లిస్తా రా అంటూ గ్రామాల్లో ఓటర్ల వెంట అభ్యర్థులు పడుతున్నారు. నామినేషన్‌కు నో డ్యూ సర్టిఫికెట్ తప్పనిసరి కావడంతో మొండి బకాయిలు పలుచోట్ల వసూలు ప్రారంభమవుతున్నాయి. జిల్లాలో గ్రామపంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసే వారికి నామినేషన్ పత్రాలతో పాటు ధ్రువపత్రాల సమర్పణ తలనొప్పిగా మారింది. అన్ని సర్టిఫికెట్లు సమకూర్చుకునేందుకు నాయకులు హైరానా పడుతున్నారు. తొలి విడత నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుండడంతో సమర్పణకు అతి తక్కువ సమయం ఉంది. వివిధ పత్రాల కోసం కార్యాలయాలకు పరుగులు పెడుతున్నారు. లోకల్ బ్యాంకుల్లో కొత్త ఖాతాతో పాటు అప్పులు లేనట్టు నో డ్యూ సర్టిఫికెట్ కూడా అవసరం కావడంతో బ్యాంకులకు క్యూ కడుతున్నారు. నామినేషన్ పత్రం దాఖలు చేసేటప్పుడు ఈసీ విధించిన నిబంధనలు పాటించాలి. సూచించిన పత్రాలు తప్పనిసరిగా సమర్పించాలి. ఏ ఒక్కటి మిస్సయినా నామినేషన్ తిరస్కరణకు గురవుతుంది. అభ్యర్థులు అన్ని పత్రాలను సేకరించడంతోపాటు బకాయిలు లేకుండా జాగ్రత్త పడుతున్నారు.
మొదటి, ఆఖరి విడతల్లో మార్పులు....
జిల్లాలో మొదటి విడతలో నరసరావుపేట రెవెన్యూ డివిజన్ పరిధిలోని 10 మండలాల పరిధిలోని 228 గ్రామపంచాయతీలు 2,290 వార్డు సభ్యులకు ఎన్నికలు జరుగుతాయని తొలుత నిర్ణయించారు. అయితే నరసరావుపేట రెవెన్యూ డివిజన్‌లోని చిలకలూరిపేట, యడ్లపాడు, నాదెండ్ల మూడు మండలాలను మూడో విడతలోకి మార్పు చేశారు. తొలి విడతలో నరసరావుపేట, రొంపిచర్ల, వినుకొండ, శావల్యాపురం, నూజెండ్ల, బొల్లాపల్లి, ఈపూరు ఏడు మండలాల్లోని 173 పంచాయతీలకు 1,712 వార్డు సభ్యులకు ఎన్నికలు జరగనున్నాయి. రెండో విడతలో యథావిధిగా సత్తెనపల్లి రెవెన్యూ డివిజన్ పరిధిలోని సత్తెనపల్లి, ముప్పాళ్ల, రాజుపాలెం, నకరికల్లు, పెదకూరపాడు, అమరావతి, అచ్చంపేట, క్రోసూరు, బెల్లంకొండ 9 మండలాల్లోని 150 పంచాయతీలకు, 1,562 వార్డు సభ్యులకు ఎన్నికలు జరగనున్నాయి. మూడో విడత గురజాల రెవెన్యూ డివిజన్ పరిధిలోని గురజాల, దాచేపల్లి, మాచవరం, పిడుగురాళ్ల, మాచర్ల, వెల్దుర్తి, రెంటచింతల, కారెంపూడి, దుర్గి 9 మండలాలతో పాటు నరసరావుపేట రెవెన్యూ డివిజన్ పరిధిలోని చిలకలూరిపేట, యడ్లపాడు, నాదెండ్ల మూడు మండలాలు కలిపి 12 మండలాల్లోని 189 గ్రామ పంచాయతీలకు, 2,012 వార్డు సభ్యులకు మూడో విడతలో ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈనెల 13న తొలి విడత, 16న రెండో విడత, 19న మూడో విడత ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామ పంచాయతీల్లో కొన్ని నెలలుగా పంచాయతీలకు నిధులు రాక సిబ్బంది జీతాలు చెల్లించలేని పరిస్థితి ఉన్న సమయం లో ఈ పన్నుల వసూలు కాస్త ఊరట కలిగించనున్నాయి. ప్రతి ఒక్కరూ నో డ్యూస్ సర్టిఫికెట్‌తో నామినేషన్‌కు రావాలని, నో డ్యూస్ లేని వారి నామినేషన్ తిరస్కరణ గురవుతుందని అధికారులు ప్రకటిస్తున్నారు. ఈ క్రమంలో నామినేషన్ల సంఖ్య పెరిగి ఆదాయం మరింత పెరిగే అవకాశం ఉంది. ఎన్నికలు పూర్తయ్యే లోపు జిల్లాలోని పంచాయతీల్లో పాత బకాయిలు వసూలై గల్లా పెట్టె గలగల అనబోతుందని తెలుస్తోంది.
నామినేషన్ వేసే అభ్యర్థితో పాటు వారిని బలపరిచే వారికి అప్పులు, బకాయిలు ఉండొద్దు. వారి పేరిట గ్రామ పంచాయతీ నుంచి నో డ్యూ సర్టిఫికెట్ పొందాల్సి ఉంటుంది. దీంతో గ్రామపంచాయతీల్లో ఇంటి పన్ను బకాయిలు మొత్తం చెల్లించేస్తున్నారు. వారిని బలపరిచే వారి పన్నులు అభ్యర్థులే కట్టేస్తున్నారు. ఇన్నాళ్లు ఎలాంటి అవసరం పడకపోవడంతో పన్నుల చెల్లింపులకు మొండికేసిన వారున్నారు. అలాంటి వారు దేవుడా అంటూ మొత్తం కట్టేస్తున్నారు. అభ్యర్థి పేరిట ఉన్న ఇంటి, కరెంటు బిల్లు కూడా పూర్తిగా చెల్లించి బాకీ లేనట్టు పత్రం జత చేయాలి. సర్పంచి, వార్డు సభ్యులుగా పోటీ చేసే వారు పదుల సంఖ్యలో ఉండగా వారిని బలపరిచే వారు బిల్లులు క్లియర్ చేస్తున్నారు. బ్యాంకుల్లోని పాత అప్పులు చెల్లించడం, వడ్డీ కట్టి రెన్యువల్ చేసుకొని అప్పు లేనట్టు ధ్రువపత్రం తీసుకుంటున్నారు. ఎన్నికల పుణ్యమా అని ఇంటి పన్ను బకాయిలు, కరెంటు పెండింగ్ బిల్లులు క్లియర్ అవుతున్నాయి.


