నాదెండ్ల: నూతన బైపాస్‌పై జరిగిన రోడ్డు ప్రమాదంలో అయ్యప్ప మాలాధారుడు దుర్మరణం పాలైన సంఘటన మంగళవారం ఉదయం 10.30 గంటల సమయంలో చోటుచేసుకుంది. ఎస్సై కట్టా వెంకటయ్య తెలిపిన వివరాల మేరకు.. ప్రకాశం జిల్లా ఒంగోలు సమీపంలోని కరువాది గ్రామానికి చెందిన పుల్లా వేణు (45) ద్విచక్రవాహనంపై ఒంగోలు నుంచి గుంటూరు వెళ్తున్నాడు. మోటారు సైకిల్ స్పేర్‌పార్ట్స్ తీసుకునేందుకు వెళ్తుండగా నూతన బైపాస్ రోడ్డుపై నాదెండ్ల ఫ్లైఓవర్ సమీపంలో ముందు వెళ్తున్న నూతన ట్రాక్టర్లను వెనుక నుంచి ఢీకొన్నాడు. దీంతో పుల్లా వేణు రహదారిపై పడి తలకు తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. ద్విచక్రవాహనం ధ్వంసమైంది. మృతుడు వేణు గతంలో గుంటూరు మహీంద్రా కార్ షోరూమ్‌లో అకౌంటెంట్‌గా పనిచేశాడు. ఇటీవల అయ్యప్ప మాల ధరించాడు. ఈ క్రమంలో మంగళవారం రోడ్డు ప్రమాదంలో మృతి చెందటంతో మృతుడి ఆచూకీ కోసం అతని బ్యాగ్‌లో ఉన్న ఆధారాలతో కుటుంబ సభ్యులకు సమాచారమిచ్చారు. భార్య దార్ల సునీత రైల్వేశాఖ ఉద్యోగి కాగా, వీరికి ఇరువురు కుమారులు. మృతదేహాన్ని చిలకలూరిపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. భార్య సునీత ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.


