రాజుపాలెం: రోడ్డు ప్రమాదంలో ఇంజినీరింగ్ విద్యార్థి మృతి చెందిన ఘటన మండలంలోని కస్తూర్భా గాంధీ బాలికల పాఠశాల వద్ద మాచర్ల–గుంటూరు రహదారిపై శుక్రవారం తెల్లవారుజామున జరిగింది. మార్కాపురం జిల్లా పెద్దారవీడు మండలం మల్లారం గ్రామానికి చెందిన ఉబ్బరపు శివనారాయణ(21) నరసరావుపేట ఇంజినీరింగ్ కాలేజీలో మూడవ ఏడాది చదువుతున్నాడు. శివనారాయణకు ఈవెంట్స్ ప్రోగ్రామ్‌లో చేసే డ్యాన్సర్‌తో పరిచయం ఏర్పడింది. అందులో భాగంగా ఎక్కడ ఈవెంట్స్ ఏర్పాటు చేసినా ద్విచక్రవాహనంపై వెళ్లి వస్తుంటాడు. అదే క్రమంలో రాజుపాలెం సమీపంలో ఉన్న గంగిరెడ్డిపాలెంలో గల శివాలయంలో వివాహం సందర్భంగా ఈవెంట్స్ ఏర్పాటు చేశారు. ఈ ఈవెంట్స్ చూసేందుకు నరసరావుపేటకు చెందిన స్నేహితులు రేగళ్ల మణి, గొల్ల విష్ణులతో కలసి ద్విచక్రవాహనంపై రాజుపాలెం వచ్చారు. ప్రోగ్రాం ముగిసిన అనంతరం డ్యాన్సర్‌లు, సామగ్రిని వాహనంలో వేసుకుని నరసరావుపేట బయలుదేరారు. ఆ వాహనం వెనుకవైపునే శివనారాయణ ఇద్దరు స్నేహితులతో బయలుదేరాడు. కస్తుర్భా గాంధీ పాఠశాల సమీపంలోకి వెళ్లగానే వాహనం డ్రైవర్ షడన్ బ్రేక్ వేశాడు. అతివేగంతో వస్తున్న ద్విచక్రవాహనం వెనుక నుంచి వాహనాన్ని ఢీకొంది. బైక్‌పై ఉన్న ముగ్గురు రోడ్డుపై పడ్డారు. ద్విచక్ర వాహనం నడుపుతున్న శివనారాయణకు తీవ్రగాయాలు కావడంతో అక్కడిక్కడే మృతి చెందాడు. వెనుక ఉన్న ఇరువురు స్నేహితులకు స్వల్పగాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న ఎస్‌ఐ మణికృష్ణ ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించి కేసునమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సత్తెనపల్లి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.


