క్రోసూరు: జెడ్పీటీసీ ఎన్నికల సందర్భంగా మండలంలోని అందుకూరు గ్రామంలోని 43, 44 పోలింగ్ కేంద్రాల్లో కూటమి నాయకులు బ్యాలెట్ పత్రాలు చించేశారు. 20 పోలింగ్ కేంద్రాల్లో రిగ్గింగ్‌కు పాల్పడ్డారు. ఆయా పోలింగ్ కేంద్రాలలో తిరిగి రీ పోలింగ్ నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి సంజనా శ్రీహర్షకు సీపీఎం జెడ్పీటీసీ అభ్యర్థి గంజిమాల రవిబాబు ఫిర్యాదు చేశారు. ఆమె ఆదేశాల మేరకు క్రోసూరు ఆర్ఓ కృష్ణ, తహసీల్దార్ హేనప్రియ విచారించేందుకు సీపీఎం కార్యాలయానికి గురువారం రాత్రి వచ్చారు. దీనిపై రవిబాబు ఫిర్యాదును స్వీకరించి బ్యాలెట్ పత్రాలను సేకరించి స్టేట్మెంట్ నమోదు చేసుకుని వెళ్లారు.
చిలకలూరిపేట టౌన్: విద్యుత్ ఘాతంతో వృద్ధురాలు మృతి చెందిన ఘటన గురువారం జరిగింది. చిలకలూరిపేట మండలం దండమూడి గ్రామంలోని సాయి బాబా గుడి సమీపంలో ఓ బడ్డీ బంకు ఉంది. దీని ఎదురుగా భారీ డిజిటల్ ఫ్లెక్సీ బోర్డు ఉంది. మురసు తుఫాన్ సమయంలో వీచిన ఈదురు గాలులకు ఫ్లెక్సీ బోర్డు సర్వసు తీగలకు ఆనుకుని బంకు పై పడింది. అది గమనించని వృద్ధురాలు కాటుకూరి సువార్తమ్మ (60) రోజూ మాదిరిగానే బంకు తెరచి అందులో కూర్చుంది. తర్వాత విద్యుత్ సరఫరా వచ్చింది. సర్వీసు తీగల నుంచి ఫ్లెక్సీ బోర్డుకు ప్రవహించిన విద్యుత్ సరఫరా వృద్ధురాలికి తగిలి మృతి చెందింది.
నరసరావుపేట రూరల్: రైతులు తుఫాను ప్రభావం ద్వారా పంటలు నష్టపోతే వారికి మళ్లీ ఉద్యాన పంటలు సాగు చేసుకోవటానికి అనుకూలంగా అమలులో ఉన్న పండ్ల తోటల పెంపకం, కూరగాయలు, పూల పెంపకంనకు సంబంధించిన రాయితీలు ఉద్యానశాఖ ద్వారా వారికి వర్తింప చేస్తామని జిల్లా ఉద్యానశాఖ అధికారి ఐ.వెంకట్రావు తెలిపారు. నరసరావుపేట మండలంలోని ఉప్పలపాడు, పెట్లూరివారిపాలెం, పమిడిమర్రు గ్రామాలలో మురసు తుఫాను ధాటికి దెబ్బతిన్న ఉద్యాన పంటలను గురువారం పరిశీలించారు. వెదురు కర్రలతో నిర్మించిన కూరగాయ పందిర్లు, అరటి తోటలు, నిమ్మ తోటలు పూర్తిగా దెబ్బతిన్న రైతులతో మాట్లాడారు. అదేవిధంగా అధిక వర్షాల వలన ఉద్యాన పంటలు త్వరగా కోలుకోవడానికి తగు సూచనలు రైతులకు వివరించారు. నరసరావుపేట ఉద్యాన అధికారి షేక్.నబి రసూల్, ఎ.ఆంజనేయులు, కృష్ణ, రైతు సేవా కేంద్రాల సిబ్బంది, సంబంధిత గ్రామ రైతులు పాల్గొన్నారు.
నరసరావుపేట టౌన్/నాదెండ్ల: రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందగా మరో యువకుడికి తీవ్ర గాయాలైన సంఘటన బుధవారం అర్ధరాత్రి పట్టణంలో చోటుచేసుకుంది. టుటౌన్ పోలీసులు తెలిపిన ప్రకారం.. నాదెండ్ల మండలం గణపవరం గ్రామానికి చెందిన రామదాసు వీరాంజనేయులు(23), వేమల బాబు పట్టణంలోని ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తూ ఉంటారు. ఉద్యోగ రీత్యా ప్రతి రోజూ ద్విచక్ర వాహనంపై నరసరావుపేటకు వచ్చి వెళ్తు ఉంటారు. ఈ క్రమంలో బుధవారం అర్ధరాత్రి విధులు ముగించుకొని ద్విచక్ర వాహనంపై స్వగ్రామానికి బయలుదేరారు. మార్గంమధ్యలోని నాగూర్వలి టాకీస్ ఓవర్ బ్రిడ్జి పైన ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనాన్ని తప్పించబోయి డివైడర్‌ను ఢీకొన్నాడు. సంఘటనలో వీరాంజనేయులు అక్కడికక్కడే మృతి చెందగా వేమల బాబుకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను 108 సాయంతో ఏరియా వైద్యశాలకు తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు టూ టౌన్ సీఐ సురేంద్రబాబు గురువారం తెలిపారు. వీరాంజనేయులు మృతితో గణపవరంలో విషాదఛాయలు అలుముకున్నాయి. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని గురువారం సాయంత్రం గణపవరంలోని స్వగృహానికి తీసుకొచ్చారు. మృతుడి తండ్రి రామారావు 45 రోజులు అయ్యప్ప దీక్ష అనంతరం బుధవారం సాయంత్రం శబరిమలకు బయలుదేరాడు. కుమారుడి మరణవార్త తెలుసుకున్న రామారావు తిరిగి వచ్చాడు. చేతికందికొచ్చిన కుమారుడు దుర్మరణం పాలవటంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు.


