జిల్లా వ్యవసాయ అధికారి జగ్గారావు | - | Sakshi
Sakshi News home page

జిల్లా వ్యవసాయ అధికారి జగ్గారావు

Nov 6 2026 2:38 AM | Updated on Nov 6 2026 2:38 AM

పంట నష్టం అంచనాలు సిద్ధం చేయండి వాహనం ఢీకొని 10 జీవాలు మృతి పోలింగ్‌ కేంద్రంలో ఉద్యోగికి అస్వస్థత పోలింగ్‌ కేంద్రాలు పరిశీలించిన ఎస్పీ జగదీష్‌

పెదకూరపాడు: మురస తుఫాన్‌ ప్రభావంతో దెబ్బతిన్నర పంట నష్ట అంచనాలను సిద్ధం చేయాలని జిల్లా వ్యవసాయ అధికారి జగ్గారావు తెలిపారు. తుఫాను ప్రభావంతో దెబ్బతిన్న వివిధ పంటలను ఏరువాక కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త, కోఆర్డినేటర్‌ డాక్టర్‌ ఎం. నగేష్‌ ప్రధాన శాస్త్రవేత్త సత్య గోపాల్‌, జగ్గారావుతో కలిసి గురువారం దెబ్బతిన్న వివిధ పంటలను పరిశీలించారు. రైతులకు తగు సూచనలు, సలహాలు అందజేశారు. పత్తిలో నిలబడిఉన్న నీళ్లని పూర్తిగా తీసివేయాలి తీసివేసిన తర్వాత బూస్టర్‌ డోస్‌గా ఎకరానికి 25 నుంచి 30 కిలోలు యూరియా 10 కిలోల పొటాష్‌ వేసుకోవాలని సూచించారు. తుఫాను ప్రభావం వల్ల పూర్తిగా కుళ్లిపోయి వివిధ దశల్లో ఉన్న కంది పంట తీసివేసి ఆరిన తర్వాత రెండు మూడు సార్లు దుక్కి చేసుకొని శనగ పంట వేసుకోవాలని చెప్పారు.

రెంటచింతల: మండల కేంద్రం శివారలో ఉన్న బాలాజీ హెచ్‌పీ గ్యాస్‌ ఏజెన్సీ వద్ద గురువారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో 10 జీవాలు మృతి చెందాయి. స్థానిక ఆంజనేయస్వామి మాణ్యం కాలనీకి చెందిన ఆవుల లక్ష్మయ్య తన జీవాలను మేతకు తీసుకువెళ్లి తిరిగి ఇంటికి వస్తున్న సమయంలో గుర్తు తెలియని వాహనం వేగంగా వచ్చి ముందు వెళ్తున్న జీవాలపై దూసుకెళ్లడంతో అక్కడికక్కడే 10 జీవాలు మృతి చెందాయి. వాహనం నిలపకుండా అత్యంత వేగంగా మాచర్ల వైపు వెళ్లడంతో వెంటనే స్థానిక పోలీసులకు ప్రమాదం జరిగిన సమాచారం ఇచ్చారు. పోలీసులు వెంబడించినా వాహనం ఆచూకీ లభించలేదు. సుమారు రూ. 2 లక్షల వరకు నష్టం వాటిల్లిందని బాధితుడు లక్ష్మయ్య వాపోయాడు. లక్ష్మయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

క్రోసూరు: మండలంలోని దొడ్లేరు గ్రామంలో 18 వార్డు పోలింగ్‌ కేంద్రంలో విధుల్లో ఉన్న పీహెచ్‌సీ ఉద్యోగి, పోలింగ్‌ అధికారి నూతక్కి దిలీప్‌ చక్రవర్తి అకస్మాత్తుగా అస్వస్ధతకు గురయ్యారు. వెంటనే పీహెచ్‌సీ వైద్యులు డాక్టర్‌ అనిల్‌కుమార్‌, డాక్టర్‌ మేరీశ్రీకళ, శిఖాశ్యాంసన్‌ ప్రాథమిక చికిత్స అందించి సత్తెనపల్లి ఏరియా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి బాగానే ఉన్నట్లు తెలిపారు.

పోలింగ్‌ కేంద్రాన్ని సందర్శించిన ఏఎస్పీ...

మండలంలోని పలు పోలింగ్‌ కేంద్రాలను జిల్లా అదనపు ఎస్పీ రోహిత్‌కుమార్‌ చౌదరి పరిశీలించారు. పోలీసు సిబ్బందికి తగు సూచనలు చేశారు. సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాల వద్ద సాయుధ బలగాలను పెట్టినట్లు తెలిపారు.

ముప్పాళ్ళ: జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నేపథ్యంలో పోలింగ్‌ కేంద్రాల వద్ద పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేసినట్లు జిల్లా ఎస్పీ జగదీష్‌ అదహళ్లి చెప్పారు. మండలంలోని ముప్పాళ్ళ జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలోని పోలింగ్‌ కేంద్రాలను గురువారం పరిశీలించారు. మండలంలోని నార్నెపాడు, లంకెలకూరపాడు గ్రామాల్లోని పోలింగ్‌ కేంద్రాలలోని భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. సమస్యాత్మక, అత్యంత సమస్మాత్మక పోలింగ్‌ కేంద్రాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామన్నారు. పోలింగ్‌ కేంద్రాల వద్ద 144వ సెక్షన్‌ పకడ్బందీగా అమలు చేశామన్నారు. పోలింగ్‌ కేంద్రాలకు వచ్చే ఓటర్లను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే పోలింగ్‌బూత్‌లోకి అనుమతించామని తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అదనపు పోలీసు బలగాలు ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. అదనపు ఎస్పీ హనుమంతురావు, సిబ్బంది ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement