పోలింగ్ కేంద్రాల నుంచి గెంటివేత కేంద్రాల్లో నుంచి బెదిరించి లాగేసిన కూటమి నేతలు, పోలీసులు ఏజెంట్ల పత్రాలు చించివేసి ఆరాచకం
ఏజెంట్ ఫారాలు చించారు
దాచేపల్లి : జెడ్పీటీసీ ఎన్నికల నేపథ్యంలో కూటమి నేతలు ఆరాచకాలు సృష్టించారు. చట్టాన్ని కాపాడాల్సిన పోలీసులే కూటమి నేతలకు చుట్టాలుగా మారి ప్రజాస్వామ్యాన్ని అపహస్యం చేశారు. గురువారం జరిగిన జెడ్పీటీసీ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరుపున జెడ్పీటీసీలుగా బరిలో నిలిచిన అభ్యర్ధుల తరుపున ఏజెంట్లపై మూకుమ్మడి దాడులకు తెగబడ్డారు. పొందుగల, శ్రీనగర్, గామాలపాడు, కేసానుపల్లి, తక్కెళ్లపాడు, రామాపురం, ముత్యాలంపాడు, తంగెడ, మాదినపాడు, సారంగపల్లి అగ్రహారం, కొత్తూరు, భట్రుపాలెం, కాట్రపాడు, పెదగార్లపాడు గ్రామాల్లో పోలింగ్ కేంద్రాల్లోకి వెళ్లిన వైఎస్సార్ సీపీ ఏజెంట్లను కూటమి నేతలు తీవ్ర భయభ్రాంతులకు గురి చేసి వేధించారు. పోలింగ్ కేంద్రాల వద్దకు వెళ్లిన ఏజెంట్లను కూటమి నేతలు, పోలీసులు బెదిరించి వారి వద్ద ఉన్న పత్రాలను చించి పడేశారు. కొంతమంది ఏజెంట్లు ధైర్యం చేసి పోలింగ్ కేంద్రాల్లోకి వెళ్లగా కూటమి నేతలు గుంపులుగా పోలింగ్ కేంద్రాల్లోకి చొరబడి వైఎస్సార్ సీపీ ఏజెంట్లను బలవంతంగా బయటకు లాగి పడేశారు. పోలింగ్ కేంద్రాల్లో పట్టుబట్టి కూర్చొన్న ఏజెంట్లపై దాడులు చేసి బయటకు తీసుకొచ్చారు. వైఎస్సార్ సీపీ ఏజెంట్లపై కేసులు పెట్టి జైలుకి పంపిస్తామని బెదిరించి పోలింగ్ కేంద్రాల నుంచి బయటకు వెళ్లేలా ఒత్తిడి చేశారు. కూటమి నేతలు ఎన్నికల అధికారుల సమక్షంలోనే రిగ్గింగ్లకు పాల్పడ్డారు.
వైఎస్సార్ సీపీ ఏజెంట్లపై బెదిరింపులు....
పోలింగ్ రోజున కేంద్రాల్లోకి వెళ్లేందుకు సంబంధిత రిటర్నింగ్ అధికారులు అనుమతి పత్రాలపై సంతకాలు చేయకుండా ఇబ్బందులు పెట్టారు. వైఎస్సార్ సీపీ ఏజెంట్లు రిటర్నింగ్ అధికారులను బతిమిలాడుకొని సంతకాలు పెట్టించుకున్నారు. తీరా పోలింగ్ కేంద్రాల వద్దకు వచ్చిన వైఎస్సార్ సీపీ ఏజెంట్లను కూటమి నేతలు ఇష్టంవచ్చినట్లుగా దుర్భాషలాడారు. పోలింగ్ కేంద్రాల్లోకి వెళ్లకుండా అడ్డుకున్నారు. పలు గ్రామాల్లో పోలింగ్ కేంద్రాల్లో ఉన్న ఏజెంట్లను పోలీసులపై స్వయంగా బయటకు తీసుకొచ్చారు. బయటకు వెళ్లకపోతే కేసులు పెట్టి హింసలకు గురి చేస్తామని బెదిరింపులకు పాల్పడ్డారు. పోలీసులు, కూటమి నేతలు వేధింపులు, బెదిరింపులతో వైఎస్సార్ సీపీ ఏజెంట్లు పోలింగ్ కేంద్రాల్లో ఉండలేకపోయారు. కేంద్రాల్లో ఉన్న ఏజెంట్లను బయటకు పంపించిన తరువాత కూటమి నేతలు రిగ్గింగ్లకు పాల్పడ్డారు.
వైఎస్సార్ సీపీ ఏజెంట్గా నేను ఉంటానని తెలుసుకుని కూటమి నేతలు పోలీసుల ద్వారా నాకు తీవ్రస్థాయిలో ఒత్తిడి తెచ్చి బెదిరించి భయపెట్టారు. పోలింగ్ ఏజెంట్గా వస్తే ఇబ్బందులు పడతావని బెదిరించారు. నేనే ఏజెంట్గా పోలింగ్ కేంద్రంలోకి వెళ్లితే నా దగ్గరకు కూటమి నేతలు వచ్చి ఏజెంట్ ఫారాలు చించి నేలపై పడేశారు.
– పురంశెట్టి శ్రీనివాసరావు, పెదగార్లపాడు


