నకరికల్లు, క్రోసూరు మండలాల్లో రీపోలింగ్ నిర్వహించాలి ఏజెంట్లపై దాడులకు పాల్పడిన కూటమి నేతలను అరెస్ట్ చేయాలి నాలుగు రోజుల ముందే రక్షణ కోరినా పట్టించుకోని అధికారులు సీపీఎం జిల్లా కార్యదర్శి గుంటూరు విజయ్ కుమార్ డిమాండ్
నరసరావుపేట: స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణలో కూటమి నేతలు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారని సీపీఎం పల్నాడు జిల్లా కార్యదర్శి గుంటూరు విజయ్‌కుమార్ విమర్శించారు. నకరికల్లు, క్రోసూరు మండలాల్లో సీపీఎం అభ్యర్థులు, పోలింగ్ ఏజెంట్లపై కూటమి నాయకులు దాడులకు పాల్పడి, బలవంతంగా రిగ్గింగ్‌కు దిగారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయా మండలాల్లో రీపోలింగ్ నిర్వహించడంతో పాటు, దాడులకు పాల్పడిన వారిని తక్షణమే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. గురువారం ఎన్నికల పోలింగ్ సందర్భంగా చోటుచేసుకున్న ఘటనలను నిరసిస్తూ పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి కలెక్టరేట్ వద్ద ఆందోళన నిర్వహించారు. ’ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి, కూటమి దాడులను అరికట్టాలి’ అంటూ నినాదాలు చేశారు. అనంతరం జిల్లా రెవెన్యూ అధికారి కె.అద్దయ్యకు వినతిపత్రం అందజేశారు. విజయ్ కుమార్ మాట్లాడుతూ నకరికల్లు, క్రోసూరు మండలాల్లోని అన్ని పోలింగ్ కేంద్రాలతో పాటు ముప్పాళ్ల మండలం మాదల గ్రామంలోని 9, 16వ పోలింగ్ కేంద్రాల్లో తిరిగి పోలింగ్ జరపాలని డిమాండ్ చేశారు. నకరికల్లు మండలం చేజర్ల గ్రామంలో 50 మందికి పైగా టీడీపీ నాయకులు పోలింగ్ కేంద్రంలోకి ప్రవేశించి సీసీ కెమెరాలు నిలిపివేసి రిగ్గింగ్‌కు పాల్పడ్డారన్నారు. పోలింగ్ బూత్‌లలో విధులు నిర్వహిస్తున్న తమ పార్టీ ఏజెంట్లను చొక్కాలు పట్టుకుని బలవంతంగా బయటకు లాగివేశారన్నారు. ఇదే తరహాలో మండలంలోని ఇతర గ్రామాల్లోనూ రిగ్గింగ్‌కు ప్రణాళిక రూపొందించారని తెలిపారు. క్రోసూరులో టీడీపీ నేత కంచేటి సాయి ఆగడాలకు అడ్డూ అదుపూ లేకుండా పోయిందని పేర్కొన్నారు. తమ పార్టీ అభ్యర్థులు పోటీ చేస్తున్న నకరికల్లు, క్రోసూరు, ముప్పాళ్ల, సత్తెనపల్లి మండలాల్లో దాడులు జరిగే ప్రమాదం ఉందని ముందుగానే గ్రహించి ఎన్నికలకు నాలుగు రోజుల ముందే ఎన్నికల కమిషన్, జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్‌లతో పాటు సంబంధిత అధికారులకు ఈ–మెయిల్ ద్వారా సమాచారం అందించి రక్షణ కల్పించాలని కోరినట్లు తెలిపారు. అయినప్పటికీ అధికారులు తగిన భద్రతా చర్యలు చేపట్టకుండా నిర్లక్ష్యం వహించారని మండిపడ్డారు. కనీసం పోలింగ్ కేంద్రాల్లో ఉన్న ఏజెంట్లకు రక్షణ కల్పించడంలోనూ విఫలమయ్యారని విమర్శించారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా ఫిర్యాదులను పరిశీలించి పారదర్శకంగా ఎన్నికలు నిర్వహిస్తున్నామని అధికారులు చెబుతున్న మాటలు క్షేత్ర స్థాయిలో అమలుకు నోచుకోవడం లేదన్నారు. నాయకులు వై. రాధాకృష్ణ, తెలకపల్లి శ్రీను, ఈవూరి మస్తాన్‌రెడ్డి, అప్పిరెడ్డి, లక్ష్మారెడ్డి, జి.పిచ్చారావు, టి.పెద్దిరాజు, బాలమ్మ, దుర్గాభాయి, సాయమ్మ, కొండా నాయక్ పాల్గొన్నారు.


