జ్వరాలపై ప్రజలకు అవగాహన కల్పించండి | - | Sakshi
Sakshi News home page

జ్వరాలపై ప్రజలకు అవగాహన కల్పించండి

Nov 5 2026 2:04 AM | Updated on Nov 5 2026 2:04 AM

పల్నాడు జిల్లా డీఎంహెచ్‌వో చుక్కా రత్నమన్మోహన్‌

యడ్లపాడు:వరుస తుఫాన్‌ల నేపథ్యంలో గ్రామీణ ప్రాంతాల్లో జ్వరాలు ప్రబలే అవకాశం ఎక్కువగా ఉంటుందని వీటిపై ప్రజలకు అవగాహన కల్పించాలని జిల్లా డీఎంహెచ్‌ఓ చుక్క రత్న మన్మోహన్‌ చెప్పారు. యడ్లపాడు ప్రాథమిక వైద్యశాలను బుధవారం ఆయన సందర్శించారు. రెండు రోజులపాటు భారీ వర్షాలు ఈదురు గాలులు వీచిన తరుణంలో ఆస్పత్రి పరిధిలోని గ్రామాల్లో పరిస్థితిని ఆయన పీహెచ్‌సీ వైద్యాధికారి పి.భరద్వాజను అడిగి తెలుసుకున్నారు. వరద నీరు ఇళ్ళ ముందు నిలిచినందున దుర్గంధంతోపాటు దోమలు వ్యాపించి జ్వరాలు వచ్చే అవకాశం ఉందన్నారు. వీటిపై పరిశీలన చేసి ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. అలాగే తాగునీటిని పరీక్షలు నిర్వహించి తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు కార్యక్రమంలో పీహెచ్సీ సిహెచ్‌ఓ పున్నారావు ఆసుపత్రి సిబ్బంది ఉన్నారు

అంటువ్యాధులు

ప్రబలకుండా చర్యలు

సత్తెనపల్లి:అంటువ్యాధులు ప్రబలకుండా ఉండేందుకు అవసరమైన ముందస్తు చర్యలు చేపట్టాలని జిల్లా మలేరియా అధికారి డాక్టర్‌ షేక్‌ నజీర్‌ అన్నారు. మలేరియా సత్తెనపల్లి సబ్‌ యూనిట్‌ను బుధవారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా పట్టణంలోని వేంకటపతినగర్‌లో ఉన్న సోషల్‌ వెల్ఫేర్‌ బాలికల వసతి గృహాన్ని సందర్శించి, అక్కడి పరిసరాలను పరిశీలించారు. హాస్టల్‌ పరిసరాల పరిశుభ్రత, వ్యక్తిగత పరిశుభ్రత, దోమల నివారణ చర్యలపై హాస్టల్‌ వార్డెన్‌కు, బాలికలకు పలు సూచనలు చేశారు.అనంతరం బాలికలకు వర్షాకాలంలో, తుఫాను సమయంలో, అనంతరం తీసుకోవాల్సిన ఆరోగ్యపరమైన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. ముఖ్యంగా దోమల ద్వారా వ్యాపించే వ్యాధులు, కలుషిత నీరు, కలుషిత ఆహారం వలన వచ్చే వ్యాధుల గురించి వివరించి, వాటి నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్త లను తెలియజేశారు. అలాగే వెంకటపతి నగర్‌లోని లోతట్టు ప్రాంతాలను సందర్శించి, తుఫాను ప్రభావం వల్ల నీరు నిల్వ ఉన్న ప్రాంతాలను పరిశీలించారు. ఆయా ప్రాంతా ల్లో దోమల వృద్ధిని అరికట్టేందుకు చర్యలు చేపట్టారు. కార్యక్రమంలో మలేరియా సత్తెనపల్లి సబ్‌ యూనిట్‌ అధికారి పెండెం మణిరావు, ఆరోగ్య పర్యవేక్షకులు బి. రోశయ్య, రాజేష్‌, ఆరోగ్య కార్యకర్తలు కోటేశ్వరరావు, షరీఫ్‌, సురేష్‌, నాగేశ్వరరావు, నటరాజ్‌, ఏఎన్‌ఎం ప్రమీల, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.

విద్యుత్‌ షాక్‌తో బాలుడు మృతి

తాడేపల్లి రూరల్‌: తాడేపల్లి రూరల్‌ పరిధిలోని పెనుమాక గ్రామంలో నివాసముండే ఓ బాలుడు విద్యుత్‌ షాక్‌తో బుధవారం సాయంత్రం మృతిచెందాడు. సేకరించిన వివరాల ప్రకారం.. పెనుమాక గ్రామానికి చెందిన కాజా కుమారుడు అమీర్‌(9) స్కూల్‌కు సెలవు కావడంతో ఇంటిపైన డాబాపై దీపావళి టపాసులతో ఆడుకుంటున్నాడు. పక్క బిల్డింగ్‌పై మరికొంతమంది పిల్లలు ఆడుకుంటుండగా అమీర్‌ చేతిలో ఉన్న అగ్గిపుల్లలను వెలిగించి వారిపైకి సరదాగా విసిరివేస్తున్నాడు. ఆ క్రమంలో డాబాకు పిట్టగోడ మధ్యలో ఉన్న ఐరన్‌ గ్రిల్‌ పట్టుకుని పైకి ఎక్కి అగ్గిపుల్ల వేసే క్రమంలో బిల్డింగ్‌కు ఆనుకుని వున్న విద్యుత్‌ స్తంభాల వైర్లు తగిలి బాలుడు అక్కడికక్కడే మృతి చెందాడు. అయినప్పటికీ తల్లి, బంధువులు వైద్య నిమిత్తం మణిపాల్‌ ఆసుపత్రికి తీసుకువెళ్లగా అప్పటికే బాలుడు మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. జరిగిన సంఘటనపై తాడేపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

కృష్ణానదిలో విద్యార్థి గల్లంతు

తాడేపల్లి రూరల్‌: తాడేపల్లి పట్టణ పరిధిలోని సీతానగరం పుష్కర ఘాట్ల వద్ద ఈతకు దిగి ఓ విద్యార్థి గల్లంతైన సంఘటనపై తాడేపల్లి పోలీసులు బుధవారం కేసు నమోదు చేశారు. తాడేపల్లి ఎస్‌ఐ ఖాజావలి తెలిపిన వివరాల ప్రకారం.. విజయవాడ అజిత్‌సింగ్‌ నగర్‌కు చెందిన డిగ్రీ విద్యార్థి కె.సాయి హర్షిత్‌ అతని స్నేహితులు ఎన్‌.నేతాజీ, పి.జగదీష్‌, సాయిలు ఈత కొట్టేందుకు కృష్ణానది సీతానగరం పుష్కర ఘాట్ల వద్దకు వచ్చి రైల్వే బ్రిడ్జి కింద కృష్ణానది వరద నీటిలోకి దిగారు. అర్ధగంట తరువాత సాయి హర్షిత్‌ నీటిలో మునిగిపోసాగాడు. మిగిలిన స్నేహితులు ముగ్గురు పెద్దగా కేకలు వేయడంతో స్థానికంగా ఉన్న మత్స్యకారులు కొంతమంది సాయి హర్షిత్‌ను కాపాడేందుకు ప్రయత్నించారు. పోలీసుల సాయంతో గజ ఈతగాళ్లతో వెతికించినా ఎటువంటి ప్రయోజనం లభించలేదు. సాయిహర్షిత్‌ తాత సూర్యనారాయణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఖాజావలి తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement