మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు
వినుకొండ: మున్సిపల్ ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని పూర్తిగా అపహాస్యం చేసిందని, పోలీసు యంత్రాంగాన్ని అడ్డం పెట్టుకుని ఎన్నికలను ఏకపక్షంగా మార్చేసిందని వైఎస్సార్ సీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు ధ్వజమెత్తారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజల తీర్పు స్పష్టంగా వైఎస్సార్ సీపీ వైపే ఉన్నప్పటికీ, అధికార దుర్వినియోగం, పోలీసుల అండతో టీడీపీ కూటమి గెలిచినట్లు నటిస్తోందని మండిపడ్డారు.
పోలీసులు టీడీపీ తొత్తులుగా మారారు...
పోలింగ్ రోజున వైఎస్సార్ సీపీ అభ్యర్థులను, కౌన్సిలర్లను అడ్డుకోవడమే లక్ష్యంగా పోలీసులు పనిచేశారని తెలిపారు. చైర్‌పర్సన్ బరిలో ఉన్న పీఎస్ ఖాన్‌తో పాటు తనను స్వగృహంలో ఉండనీయకుండా నరసరావుపేటకు తీసుకెళ్లి అక్రమంగా నిర్బంధించారని చెప్పారురు. ముఖ్య నాయకులు ఎం.ఎన్. ప్రసాద్, అంజిరెడ్డి, బాలిరెడ్డి, వెంకట్రామిరెడ్డిలను సైతం హౌస్ అరెస్టులు చేసి కేడర్‌లో అయోమయం సృష్టించే కుట్ర చేశారన్నారు. పోటీలో ఉన్న మహిళా అభ్యర్థుల భర్తలను పోలింగ్ కేంద్రాల వద్ద నుంచి బలవంతంగా ఈడ్చుకెళ్లారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గంజాయి కేసులు పెడతామని, రౌడీషీట్లు తెరుస్తామని కార్యకర్తలను బెదిరించారని పేర్కొన్నారు.
వేలాది దొంగ ఓట్లు.. ఏజెంట్లపై దాడులు
నరసరావుపేట, అద్దంకి, దర్శి తదితర ప్రాంతాల నుంచి మనుషులను రప్పించి, బురఖాలు, ముసుగులు వేయించి వేలాది దొంగ ఓట్లు వేయించుకున్నారని ఆరోపించారు. పోలింగ్ బూత్‌ల వద్ద వైఎస్సార్ సీపీ ఏజెంట్లను బలవంతంగా బయటకు నెట్టివేశారని చెప్పారు. అడ్డువచ్చిన వారిపై హత్యాయత్నాలకు తెగబడ్డారని పేర్కొన్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఓట్లను ఇన్వాలిడ్ చేస్తూ కూటమి నేతలు అక్రమ విజయాన్ని నమోదు చేసుకున్నారని దుయ్యబట్టారు.
ఇన్ని అరాచకాలు చేసినా 9 స్థానాలు గెలిచాం..
రాష్ట్రంలో రాజ్యాంగాన్ని పక్కనబెట్టి రెడ్ బుక్ రాజ్యాంగం నడుపుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఇన్ని బెదిరింపులు, అక్రమాలు ఎదురైనా ప్రజలు వైఎస్సార్ సీపీ పక్షానే నిలిచారని స్పష్టం చేశారు. వైఎస్సార్ సీపీ 8 స్థానాల్లో, మిత్రపక్షమైన సీపీఐ 1 స్థానంలో విజయం సాధించి మొత్తం 9 వార్డులను దక్కించుకుందని తెలిపారు. వైఎస్సార్ సీపీ శ్రేణులు, అభిమానులు ఎవరూ అధైర్యపడాల్సిన పనిలేదని, ప్రజాక్షేత్రంలో అక్రమాలకు పాల్పడిన వారికి కాలమే సమాధానం చెబుతుందని పేర్కొన్నారు. గెలిచిన కౌన్సిలర్లను అభినందించిన ఆయన, కౌన్సిల్ సమావేశాల్లో ప్రజా సమస్యలపై నిరంతరం గళం విప్పాలని పిలుపునిచ్చారు. ఈ విలేకర్ల సమావేశంలో నాయకులు ఎం.ఎన్. ప్రసాద్, అమ్మిరెడ్డి అంజిరెడ్డి, పగడాల వెంకటరామిరెడ్డి, కొత్తమాసు శివ తదితరులు పాల్గొన్నారు.


