నరసరావుపేట ఈస్ట్: పల్నాడు జిల్లాలోనే అతిపెద్ద ప్రైవేటు పాఠశాలగా గుర్తింపు .. కార్పొరేట్ పాఠశాలలకు మించి ఫీజుల వసూలు.. హాస్టల్ ఫీజు రూ.లక్షల్లోనే.. ఇంతగా విద్యార్థుల నుంచి లక్షలాది రూపాయలను ఫీజుల రూపంలో వసూలు చేస్తూ... వాడుక నీరు కోసం చెరువు నుంచి నీటిని విద్యార్థులతో తెప్పిస్తున్న పాఠశాల యాజమాన్య వైఖరికి ఇదో నిదర్శనం.. తల్లిదండ్రులు ఎంతో నమ్మకంతో తమ పిల్లలను హాస్టల్‌లో ఉంచితే వారిచేత ప్రమాదకరమైన పని చేయిస్తున్న వైనం ఇది. పట్టణంలోని ఎన్జీవో కాలనీలోని ఒక ప్రైవేటు పాఠశాలకు చెందిన హాస్టల్ విద్యార్థులు సమీపంలోని వల్లప్పచెరువు నుంచి నీటిని డ్రమ్ములలో హాస్టల్‌కు తరలిస్తున్నారు. మురసు తుఫాన్ కారణంగా మంగళవారం ఉదయం నుంచి విద్యుత్ సరఫరా లేకపోవటంతో వాడుక నీటి కోసం పాఠశాల యాజమాన్యం హాస్టల్ విద్యార్థులతో చెరువు నుంచి డ్రమ్ములలో నీటిని తెప్పించటం విమర్శలకు దారి తీసింది. వర్షం కారణంగా చెరువు నిండుకుండలా మారింది. ఈపరిస్థితులలో విద్యార్థులతో చెరువు గట్టు నుంచి నీటిని బక్కెట్లతో తోడి స్కూల్ వ్యాన్‌లో డ్రమ్ముల ద్వారా తెప్పించటం వారిని చేజేతులా ప్రమాదంలోకి నెట్టినట్టేనని పలువురు విమర్శిస్తున్నారు. లక్షల రూపాయలు ఫీజుల రూపంలో వసూలు చేస్తున్న యాజమాన్యం కేవలం రూ.500 చెల్లించి ట్యాంకర్ ద్వారా నీటిని తెప్పించలేక పోయిందా అని వ్యాఖ్యానిస్తున్నారు. బూట్ దగ్గర నుంచి బెల్ట్, టై, సాక్స్‌లు, డ్రస్‌ల పేరుతో ఫీజులు పిండుకొనే యాజమాన్యం విద్యార్థులకు కనీసం వాడుక నీరు సమకూర్చలేక పోవటంపై విమర్శలు వినవస్తున్నాయి. మురసు తుఫాన్ కారణంగా పాఠశాలలకు సెలవులు ప్రకటిస్తే విద్యార్థులతో ఇటువంటి పనులు చేయించటంపై విద్యాశాఖాధికారులు చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.


