వరద నీటిలో చిక్కుకుని ఇద్దరు మృతి | - | Sakshi
Sakshi News home page

వరద నీటిలో చిక్కుకుని ఇద్దరు మృతి

Nov 5 2026 2:04 AM | Updated on Nov 5 2026 2:04 AM

ముగ్గురికి గాయాలు

యడ్లపాడు: తుఫాన్‌ కారణంగా యడ్లపాడు మండలం తిమ్మాపురం పరిధిలోని 16వ నంబర్‌ జాతీయ రహదారి కొత్త బైపాస్‌ అండర్‌ పాస్‌ వద్ద చోటుచేసుకున్న ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా మరో ముగ్గురికి గాయాలయ్యాయి. చిలకలూరిపేట నుంచి గుంటూరుకు చెందిన జి.భాగ్యలక్ష్మి, ఇంటూరి షణ్ముఖరావు మంగళవారం కారులో బయలుదేరారు. ఇదే సమయంలో గుంటూరుకు చెందిన రాగి రాజ్‌ కుమార్‌ ద్విచక్రవాహనంపై పెదకాకానికి చెందిన రాగి అరుణ, పరం కవిత గుంటూరు బయలుదేరారు. మండలంలోని తిమ్మాపురం హైవే అండర్‌పాస్‌ వద్ద వరద నీరు భారీగా చేరింది. పోలీసులు వారించినా వినకుండా రెండు వాహనాలు ముందుకు సాగటంతో ఒక్కసారిగా వచ్చిన నీటి ఉధృతిలో రెండు వాహనాలు చిక్కుకొన్నాయి. ప్రాణ భయంతో మహిళలు ముగ్గురు కారు టాప్‌పై ఎక్కి కూర్చున్నారు. ప్రవాహం అధికం కావడంతో నీటిలో మునిగిన షణ్ముఖరావు రాజ్‌కుమార్‌ గల్లంతయ్యారు. కారుపై ఉన్న వారి కేకలు విని స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే స్పందించి చిలకలూరిపేట రూరల్‌ సీఐ బి. సుబ్బానాయుడు, ఎన్‌డీ ఆర్‌ఎఫ్‌ బృందం అక్కడికి చేరుకుంది. వంతెనకు ఇరువైపులా తాడును ఏర్పాటు చేసి కారుపై బిక్కుబిక్కుమంటున్న ముగ్గురు మహిళలను ఒడ్డుకు తీసుకొచ్చి ఆసుపత్రికి తరలించారు. గల్లంతైన కారు డ్రైవర్‌ ఇంటూరి షణ్ముఖరావు (43), స్కూటీ నడుపుతున్న రాగిరాజ్‌ కుమార్‌ (22) నీటి అడుగున తూము వద్ద ఇరుక్కుపోయి ఉన్నట్లు బుధవారం పోలీసులు గుర్తించారు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం చిలకలూరిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement